ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా ఎన్.రఘువీరా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు శనివారం ఉదయం హైదరాబాద్లోని గాంధీభవన్లో బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో పీసీసీ అధ్యక్ష బాధ్యతలను బొత్స సత్యనారాయణ నుంచి రఘువీరా, పొన్నాలకు స్వీకరించారు. గాంధీభవన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఇందిరాభవన్ను దిగ్విజయ్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ కష్టకాలంలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇరుప్రాంతాలలో బలోపేతం చేయాల్సిన అవశ్యకతను ఆయన ఈ సందర్బంగా వివరించారు. రెండు పీసీసీ ఏర్పాటుతో కొత్త అధ్యాయనానికి నాంది పలుకుతున్నామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఇందిరా భవన్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకలాపాలు, గాంధీభవన్లో తెలంగాణ పీసీసీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. పీసీసీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఇరు ప్రాంతాల నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.