PCC chiefs
-
ముగిసిన కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ బలోపేతంపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం(ఆగస్టు13) ఉదయం అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులతో పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీచీఫ్ మల్లికార్జున ఖర్గే , ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొని పీసీసీ చీఫ్‌లకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికలకు కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జరుగుతున్న సమావేశం ఇదే. -
పీసీసీ చీఫ్‌ల భేటీ.. సీఎం రేవంత్ ప్లేస్‌లో ఢిల్లీకి మంత్రి ఉత్తమ్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం(ఆగస్టు12) ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా నేషనల్డ్యామ్సేఫ్టీఅథారిటీ(ఎన్డీఎస్ఏ) ఛైర్మన్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అవనున్నారు.మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే అధ్యక్షతన జరగనున్న అన్ని రాష్ట్రాల కాంగ్రెస్(పీసీసీ) అధ్యక్షుల భేటీలో ఉత్తమ్ పాల్గొననున్నారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయనకు బదులు సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు. -
పార్టీ ముఖ్యనేతలతో సోనియా వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఏఐసీసీ కార్యదర్శులు, ఇన్ఛార్జ్లు, పీసీసీ చీఫ్‌లతో భేటీ అయ్యారు. ఈ భేటీలో దేశవ్యాప్తంగా కేంద్ర పభుత్వ వైఫల్యాలు, సంస్థాగత ఎన్నికలపై చర్చించనున్నట్లు సమాచారం. అదే విధంగా కేంద్రం వైఫల్యాలపై ఆందోళనలకు పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో సోనియా గాంధీ ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టారు. చదవండి: సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ -
కాంగ్రెస్‌కు పీసీసీ చీఫ్‌ల షాక్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఘోరంగా దెబ్బతింటున్న కాంగ్రెస్ పార్టీకి ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు షాకులిస్తున్నారు. పదవినుంచి తొలిగించిన వెంటనే వేరే పార్టీలోకి చేరిపోయి ఏదో ఒక పదవిని సాధించుకుంటున్నారు. అలా వెళ్లిన వారిని ఒక సారి పరిశీలిస్తే.. పదిరోజుల క్రితం ఎన్నికలు జరిగిన హర్యానాలో ఎన్నికల ముందు పీసీసీ చీఫ్ అశోక్ తన్వర్‌ను కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి తొలగించింది. ఆరేళ్లనుంచి పీసీసీ చీఫ్ పదవిలో ఉన్న అశోక్ తన్వర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 2014, 19 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు పునరావృతమయ్యాయి. దీంతో పార్టీ అశోక్‌ను బాధ్యుడిగా భావించి అతడిని పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించి, అతని స్థానంలో కుమారి సెల్జాను నియమించింది. ఈ చర్యను అవమానంగా భావించిన అశోక్ తన్వర్ వెంటనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీలో చేరిపోయారు. ఫలితాల వెలువడ్డాక ఆ పార్టీనే హర్యానాలో కింగ్‌మేకర్‌గా నిలిచి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలా జరగడం కాంగ్రెస్ పార్టీకి ఇదే మొదటిసారి కాదు. బీహార్‌లో 2013 నుంచి పీసీసీ చీఫ్‌గా ఉన్న అశోక్ చౌదరిని అంతర్గత విభేదాల నేపథ్యంలో 2017లో బాధ్యతల నుంచి తప్పించగా, కొద్దినెలలకే అశోక్ చౌదరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అధికారపార్టీ అయిన జనతాదళ్(యు)లో చేరిపోయారు. అంతకు ముందు 2010 నుంచి 2013 వరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న మొహబూబ్ అలీ కైసర్‌ను ఇలాగే తొలగించగా, కైసర్ రామ్‌విలాస్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తిలోకి చేరిపోయారు. ఆ పార్టీ తరపున 2014, 19 లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ సంపాదించి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్లో పీసీసీ చీఫ్‌గా ఉన్న మనస్ భూనియా 2016లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి 2017లో ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. దక్షిణాదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్‌ను వీడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీలోకి చేరిపోయారు. ఇప్పుడు ఆయన వైఎస్ జగన్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గత వారం జార్ఖండ్ పీసీసీ చీఫ్ సుఖ్‌దేవ్ భగత్ ఆ పార్టీని వీడి అధికార బీజేపీలోకి చేరిపోయారు. ఇలా గత ఐదారేళ్లుగా వంద సంవత్సరాలపైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, వరుసగా వస్తున్న దారుణ ఫలితాలపై సమీక్ష చేసుకోకుండా ఇంకా పాత పద్ధతిలోనే ఉంటోంది. వేరే పార్టీలోకి వెళ్లిన వారికి నాయకత్వ లక్షణాలు, ఓటు బ్యాంకు లేకపోతే అధికార పార్టీలలో వారికి పదవులు ఎలా వస్తున్నాయో కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధినాయకత్వం మీద విధేయత, అంతర్గత ప్రజాస్వామ్యం వంటి లక్షణాలు ప్రస్తుతం కాంగ్రెస్‌ను ఒడ్డుకు చేర్చలేకపోతున్నాయి. ఓటమికి గల కారణాలను క్షేత్ర స్థాయి నుంచి విశ్లేషించకుండా ఇంకా ఒకే కుటుంబాన్ని నమ్ముకుంటే సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
ఐదు పీసీసీలకు కొత్త చీఫ్‌లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి వచ్చే నెలలో జరగనున్న ఏఐసీసీ సదస్సులో పార్టీ అధ్యక్షుడిగా పదోన్నతి కల్పించనున్నారన్న అంచనాల నేపథ్యంలో.. ఆ పార్టీ నాయకత్వం ఐదు రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు, ఒక ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షులను నియమించింది. ఈ పునర్వ్యవస్థీకరణపై రాహుల్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ రాష్ట్ర నాయకత్వాన్ని అజయ్ మాకెన్‌కు అప్పగించగా, మహారాష్ట్రలో మాణిక్‌రావ్‌ఠాక్రే స్థానంలో అశోక్‌చవాన్‌కు, జమ్మూకశ్మీర్‌లో సైఫుద్దీన్‌సోజ్ స్థానంలో గులాం అహ్మద్‌మిర్‌కు, గుజరాత్లో అర్జున్ మోధ్వాడియా స్థానంలో భరత్సిన్హ్ సోలంకికి, తెలంగాణలో పొన్నాల లక్ష్మయ్య స్థానంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు పీసీసీ పగ్గాలు అప్పగించారు. ఏఐసీసీ కార్యదర్శి సంజయ్ నిరుపమ్‌ను ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ద్వివేది సోమవారం వెల్లడించారు. ఈ రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌లను నియమించాలని రాహుల్ కొంత కాలంగా పట్టుపడుతున్నారు. పీసీసీల్లో మార్పులు ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణకు ముందస్తు కసరత్తని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌లో తన కుమార్తె ప్రియాంకగాంధీ మరింత విస్తృత పాత్ర పోషించే అవకాశాలపై గురువారం విలేకరులు అడిగిన ప్రశ్నలను ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ దాటవేశారు. రాహుల్ సెలవుపై ప్రశ్నించగా విసుక్కున్నారు. -
పీసీసీ అధ్యక్షులతో రాహుల్ భేటీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం. ఆ వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో కొద్దిగా ఉపశమనం. ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో స్థానాలను కైవసం చేసుకోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. దీంతో పార్టీ భవిష్యత్తుపై సదరు పార్టీ నేతలలో నీలినీడలు కమ్ముకున్నాయి. భవిషత్తులో పార్టీని పరుగు పెట్టించాలని అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. అందులోభాగంగా ఏఐసీసీ కార్యాలయంలో వివిధ రాష్ట్రాలల పీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం భేటీ అయ్యారు. భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పీసీసీ నేతలతో చర్చిస్తున్నారు. ఈ బేటీకి తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డిలు పాల్గొన్నారు. -
పీసీసీ చీఫ్‌ల ఎదురీత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఇద్దరూ ఎదురీదుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతోంది. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రఘువీరా వెనుకంజలో ఉన్నారు. ఇక తెలంగాణ ఇచ్చినా ఆ ప్రాంతంలో సీనియర్ నాయకులు చాలా మంది ఓటమి అంచున ఉన్నారు. వరంగల్ జిల్లా జనగామ నుంచి పోటీ చేసిన పొన్నాల లక్ష్మయ్య వెనుకబడి ఓటమి అంచున ఉన్నారు. మాజీ మంత్రి సునీత లక్ష్మా రెడ్డి ఓడిపోయారు. మరో సీనియర్ నేత వి హనుమంతరావు వెనుకంజలో ఉన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన పొన్నాల, రఘువీరా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా ఎన్.రఘువీరా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు శనివారం ఉదయం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో పీసీసీ అధ్యక్ష బాధ్యతలను బొత్స సత్యనారాయణ నుంచి రఘువీరా, పొన్నాలకు స్వీకరించారు. గాంధీభవన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఇందిరాభవన్‌ను దిగ్విజయ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ కష్టకాలంలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇరుప్రాంతాలలో బలోపేతం చేయాల్సిన అవశ్యకతను ఆయన ఈ సందర్బంగా వివరించారు. రెండు పీసీసీ ఏర్పాటుతో కొత్త అధ్యాయనానికి నాంది పలుకుతున్నామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఇందిరా భవన్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకలాపాలు, గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. పీసీసీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఇరు ప్రాంతాల నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. -
2గా రాష్ట్ర కాంగ్రెస్