
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఘోరంగా దెబ్బతింటున్న కాంగ్రెస్ పార్టీకి ఆయా రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు షాకులిస్తున్నారు. పదవినుంచి తొలిగించిన వెంటనే వేరే పార్టీలోకి చేరిపోయి ఏదో ఒక పదవిని సాధించుకుంటున్నారు. అలా వెళ్లిన వారిని ఒక సారి పరిశీలిస్తే.. పదిరోజుల క్రితం ఎన్నికలు జరిగిన హర్యానాలో ఎన్నికల ముందు పీసీసీ చీఫ్ అశోక్ తన్వర్‌ను కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి తొలగించింది. ఆరేళ్లనుంచి పీసీసీ చీఫ్ పదవిలో ఉన్న అశోక్ తన్వర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 2014, 19 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు పునరావృతమయ్యాయి. దీంతో పార్టీ అశోక్‌ను బాధ్యుడిగా భావించి అతడిని పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పించి, అతని స్థానంలో కుమారి సెల్జాను నియమించింది. ఈ చర్యను అవమానంగా భావించిన అశోక్ తన్వర్ వెంటనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీలో చేరిపోయారు. ఫలితాల వెలువడ్డాక ఆ పార్టీనే హర్యానాలో కింగ్‌మేకర్‌గా నిలిచి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇలా జరగడం కాంగ్రెస్ పార్టీకి ఇదే మొదటిసారి కాదు. బీహార్‌లో 2013 నుంచి పీసీసీ చీఫ్‌గా ఉన్న అశోక్ చౌదరిని అంతర్గత విభేదాల నేపథ్యంలో 2017లో బాధ్యతల నుంచి తప్పించగా, కొద్దినెలలకే అశోక్ చౌదరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అధికారపార్టీ అయిన జనతాదళ్(యు)లో చేరిపోయారు. అంతకు ముందు 2010 నుంచి 2013 వరకు పీసీసీ చీఫ్‌గా ఉన్న మొహబూబ్ అలీ కైసర్‌ను ఇలాగే తొలగించగా, కైసర్ రామ్‌విలాస్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తిలోకి చేరిపోయారు. ఆ పార్టీ తరపున 2014, 19 లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ సంపాదించి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో పీసీసీ చీఫ్‌గా ఉన్న మనస్ భూనియా 2016లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి 2017లో ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. దక్షిణాదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్‌ను వీడి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీలోకి చేరిపోయారు. ఇప్పుడు ఆయన వైఎస్ జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
గత వారం జార్ఖండ్ పీసీసీ చీఫ్ సుఖ్‌దేవ్ భగత్ ఆ పార్టీని వీడి అధికార బీజేపీలోకి చేరిపోయారు. ఇలా గత ఐదారేళ్లుగా వంద సంవత్సరాలపైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, వరుసగా వస్తున్న దారుణ ఫలితాలపై సమీక్ష చేసుకోకుండా ఇంకా పాత పద్ధతిలోనే ఉంటోంది. వేరే పార్టీలోకి వెళ్లిన వారికి నాయకత్వ లక్షణాలు, ఓటు బ్యాంకు లేకపోతే అధికార పార్టీలలో వారికి పదవులు ఎలా వస్తున్నాయో కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధినాయకత్వం మీద విధేయత, అంతర్గత ప్రజాస్వామ్యం వంటి లక్షణాలు ప్రస్తుతం కాంగ్రెస్‌ను ఒడ్డుకు చేర్చలేకపోతున్నాయి. ఓటమికి గల కారణాలను క్షేత్ర స్థాయి నుంచి విశ్లేషించకుండా ఇంకా ఒకే కుటుంబాన్ని నమ్ముకుంటే సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment