
ఐదు పీసీసీలకు కొత్త చీఫ్‌లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి వచ్చే నెలలో జరగనున్న ఏఐసీసీ సదస్సులో పార్టీ అధ్యక్షుడిగా పదోన్నతి కల్పించనున్నారన్న అంచనాల నేపథ్యంలో.. ఆ పార్టీ నాయకత్వం ఐదు రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు, ఒక ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షులను నియమించింది. ఈ పునర్‌వ్యవస్థీకరణపై రాహుల్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ రాష్ట్ర నాయకత్వాన్ని అజయ్ మాకెన్‌కు అప్పగించగా, మహారాష్ట్రలో మాణిక్‌రావ్‌ఠాక్రే స్థానంలో అశోక్‌చవాన్‌కు, జమ్మూకశ్మీర్‌లో సైఫుద్దీన్‌సోజ్ స్థానంలో గులాం అహ్మద్‌మిర్‌కు, గుజరాత్‌లో అర్జున్ మోధ్వాడియా స్థానంలో భరత్‌సిన్హ్ సోలంకికి, తెలంగాణలో పొన్నాల లక్ష్మయ్య స్థానంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు పీసీసీ పగ్గాలు అప్పగించారు.
ఏఐసీసీ కార్యదర్శి సంజయ్ నిరుపమ్‌ను ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ద్వివేది సోమవారం వెల్లడించారు. ఈ రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌లను నియమించాలని రాహుల్ కొంత కాలంగా పట్టుపడుతున్నారు. పీసీసీల్లో మార్పులు ఏఐసీసీ పునర్‌వ్యవస్థీకరణకు ముందస్తు కసరత్తని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌లో తన కుమార్తె ప్రియాంకగాంధీ మరింత విస్తృత పాత్ర పోషించే అవకాశాలపై గురువారం విలేకరులు అడిగిన ప్రశ్నలను ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ దాటవేశారు. రాహుల్ సెలవుపై ప్రశ్నించగా విసుక్కున్నారు.