
పేదోడి ఆరోగ్యంపై చిన్నచూపు
నాయుడుపేట, న్యూస్‌లైన్: పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడుకి చెందిన మరియమ్మ తన బిడ్డ తిరుపతమ్మను ఆసుపత్రికి తీసుకువచ్చింది. అలాగే సిద్ధవరం చెంచ మ్మ తన కుమారుడు సుబ్బరాయుడుకు వైద్యం చేయించేందుకు డాక్టర్ కోసం ఉదయం నుంచి ఎదురుచూస్తోంది. గొట్టిప్రోలుకి చెందిన వసంతమ్మ తన బిడ్డకు కడుపులో నొప్పిగా ఉండడంతో ఉదయం నుంచి వేచి చూస్తున్నారు.
అయినా చిన్న పిల్లల వైద్యులు మాత్రం ఉదయం 11 గంటలైనా రాకపోవడంతో చిన్నారులను తీసుకువచ్చిన మహిళలు ఆసుపత్రి వరండాలోనే పడిగాపులు కాశారు. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళకు ప్రసవ నొప్పలు వచ్చి ఇబ్బందులు పడుతున్నా అందుకు సంబంధించిన వైద్యాధికారిణి పట్టించుకోకపోవడం విశేషం. ఇవీ నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం కనిపించిన దృశ్యాలు. ఖరీదైన వైద్యం చేయించుకోలేక పేదలు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు.
కానీ వారిని వైద్యాధికారులు, సిబ్బంది చిన్నచూపు చూస్తున్నారు. అసలు ైవె ద్యులు ఎప్పుడొస్తారో కూడా తెలియని పరిస్థితి. చక్కెర కర్మాగారంలో పనిచేసే కాండ్రేగులు వెంకటేశ్వరరావు కుమార్తె నాగవేణి గర్భిణి. ఆమె ఆసుపత్రికి వచ్చారు. రెండు రోజుల నుంచి నొప్పులు వస్తూ పోతూ ఉన్నాయి. దీంతో ఆమె ఆస్పత్రికి రాగా పట్టించుకున్న వారు లేరు. నాగవేణి తండ్రి వెంకటేశ్వరరావు వైద్యులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పే వారు కరువయ్యాయరు. కాన్పు సమయం దగ్గరపడిందా..లేక ప్రసవం అవుతుందా అనే విషయాలను బాధితులకు తెలపకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ విషయాన్ని తమకు చెబితే స్కానింగ్ చేసుకోవడం వంటి ఏర్పాట్లు చేసుకుంటామని ఏవైనా ఇబ్బందులు జరిగితే ఏం చేయాలని మండి పడ్డారు.
సెలైన్‌పెట్టాలంటే
బెడ్లు తెచ్చుకోవాల్సిందే
30 పడకల ఆసుపత్రిని ట్రామాకేర్ సెంటర్‌కు మార్చడంతో రోగులు ఎవరి బెడ్లు వారే తెచ్చుకోవాలని అక్కడి సిబ్బంది సూచిస్తున్నారు. సెలైన్ పెట్టాలన్నా పడకలు ఖాళీ ఉండడంలేదు. మీరు తెచ్చుకుంటే సెలైన్ పెడతామంటూ సిబ్బంది తెలపడంతో పక్క గదుల్లో ఉన్న బెడ్లను వారే తెచ్చుకుని సెలైన్ పెట్టించుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే 30 పడకల ఆసుపత్రిలోకి మార్చి వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభత్వ ఆసుపత్రిలో
వసతులు కరువు
వాకాడు: వాకాడులోని నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులు వెనుదిరుగుతున్నారు. మండలంలోని తీర ప్రాంత ప్రజలు కాన్పులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలంటే వాకాడు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందిస్తారనే నమ్మకంతో పరుగులు తీస్తారు. సర్కారు ఆసుపత్రి పని తీరు దుర్భరంగా ఉండడంతో ప్రభుత్వాసుపత్రి అంటేనే భయపడిపోయి ప్రైవేట్ వైద్యశాలలకు వెళుతున్నారు. దీంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల సంఖ్య ఇక్కడ గణనీయంగా తగ్గిపోయింది.
తాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, సరైన మంచాలు, రోగానికి తగిన మందులు, లైట్లు, రాత్రిపూట వాచ్‌మెన్ తదితర సదుపాయాలు లేవు. ఆసుపత్రి పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినా సంబంధిత అధికారులు,పాలకులు పట్టించుకున్న దాఖలాల్లేవు. వేసవితాపం తట్టుకోలేని గ్రామీణ ప్రాంత వృద్ధులు, మహిళలు, చిన్నారులు వడదెబ్బ తగిలి వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఆరోగ్య ఉపకేంద్రాలు తెరిచిన పాపాన పోలేదని, ఒక వేళ తెరిచినా వైద్య సిబ్బంది, మందులు ఉండవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది విధులకు రావడం, రిజిస్టర్‌లో సంతకాలు చేయడం, ప్రతి నెలా జీతాలు తీసుకోవడం తప్ప ఆసుపత్రి అభివృద్దిపై దృష్టి సారించడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.