అధిక వడ్డీలు ఆశ చూపి... | Poor, small business owners heavy Interest | Sakshi
Sakshi News home page

అధిక వడ్డీలు ఆశ చూపి...

Published Tue, Feb 23 2016 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

Poor, small business owners heavy Interest

* రూ.8కోట్ల సొమ్ముతో ఉడాయించిన పెద్ద మనిషి
* లబోదిబోమంటున్న పేదలు, చిరు వ్యాపారులు
* షిర్డీకి వెళ్తున్నామని ఉడాయింపు

విజయనగరం కంటోన్మెంట్ : అత్యవసర పని ఉంది.. అధికంగా వడ్డీలు ఇస్తామని చెప్పి సుమారు రూ. 8 కోట్లకు కుచ్చు టోపీ వేశారు ఆ దంపతులు. పాఠశాల యజమానిగా పరిచయం చేసుకొని దొరికిన కాడికి దోచుకుపోయారు. షిర్డీ వెళ్తున్నామని చెప్పి పక్కా ప్రణాళిక ప్రకారం పిల్లల టీసీలు తీసుకొని మరీ ఉడాయించారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఒబ్బిలిశెట్టి రాజశేఖర్, గాయత్రి దంపతులు విజయనగరంలోని వక్కలంకవారి వీధిలో అద్దె ఇంట్లో ఉండేవారు. పదేళ్ల క్రితం సాయిరాం పబ్లిక్ స్కూల్‌ను స్థాపించారు. మరో పక్క లార్వెన్స్ స్కూల్‌లో ఓ డెరైక్టర్‌గా పరిచయం చేసుకున్నారు. పెద్ద మనుషులుగా చలామణి అయ్యారు. చుట్టుపక్కల అందరితో వరుసలు కలిపారు. లార్వెన్స్, పెన్ స్కూళ్లలో భాగస్వామ్యం ఉందన్నారు.

రోటరీ క్లబ్‌లో కూడా సభ్యులయ్యారు. పాఠశాలకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలతో కలుపుగోరుగా ఉండేవారు. కల్లబొళ్లి కబుర్లు చెప్పి ఎక్కువ వడ్డీలిస్తామని ఆశచూపి దొరికిన వారి వద్ద వేలు, లక్షల్లో అప్పులు చేశారు. సమాజంలో స్థితిమంతులైన వారి దగ్గరి నుంచి ఇళ్లల్లో పాచిపనులు చేసుకునే వారిని, పాల ప్యాకెట్లు అమ్ముకునే వారిని బుట్టలో వేసుకున్నారు.  ఫంక్షన్లకు వెళ్తామని చెప్పి మహిళల వద్ద నగలు కాజేశారు.
 
పథకం ప్రకారం...
దాదాపు రూ.8 కోట్ల సొమ్ము, విలువైన నగలతో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం షిర్డీ వెళ్తున్నామని చెప్పి ఉడాయించేశారు.  షిర్డీ వెళ్లిన వీరు ఇంకా రాలే దేంటని బాధితులు సాయిరాం పబ్లిక్ స్కూల్‌కు వెళ్లి ఆరా తీశారు. మరొకరికి పాఠశాల నిర్వహణ బాధ్యతలు అప్పగించి ఉడాయించేశారన్న విషయం తెలుసుకొని లబోదిబోమంటున్నారు. భారీ ఎత్తున డబ్బులు ఇచ్చిన వారు కూడా ఇన్‌కంటాక్స్ ఇబ్బందులు ఉన్నాయని బయటకు రాలేదని బాధితులు చెబుతున్నారు. ఈ ఘరానా మోసంపై టూ టౌన్‌పోలీస్ స్టేషన్‌లో గతంలో ఫిర్యాదు చేసిన వీరు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లోను ఫిర్యాదు చేశారు.
 
నగలు తీసుకుపోయారు
ఎన్నాళ్లో కూడబెట్టిన డబ్బులతో సంక్రాంతి పండగ ముందు నల్లపూసలు, నగలు చేయించుకున్నాను. 8 తులాల నగలు దాదాపు రెండున్నర లక్షల విలువైనవి. మెచ్యూర్ ఫంక్షన్‌కు వేసుకెళ్తామని చెప్పి తీసుకుపోయారు. ఇలా ఊరొదిలి వెళతారనుకోలేదు.  - సీహెచ్ సూర్యకళ, విజయనగరం
 
పారిపోతామా? అన్నారు.
పాఠశాల అభివృద్ధి చేసుకుంటానంటే నా వద్ద ఉన్న డబ్బులతో పాటు వస్తువులు పెట్టి పలుమార్లు రూ.7.50లక్షలు అప్పిచ్చాను. వడ్డీ కూడా ఇస్తామన్నారు. ఇటీవల నా కుమార్తె అల్లుడు కలసి వచ్చారు. అల్లుడు వెళ్లి గట్టిగా అడిగాడు. మార్చిలో స్కూల్ ఫీజులొస్తాయి. అప్పుడిస్తానన్నాడు. గాయత్రి వచ్చి ఇప్పుడు అంత డబ్బులు మీకేం అవసరం వదినా? మేమేం పారిపోతామా అని అడిగింది. ఇస్తారు కదా అనుకుంటే పారిపోయారు.  
- గూడిపూడి నాగమణి, వక్కలంక వీధి
 
రూ.7.50 లక్షలు ఇచ్చాను
టిఫిన్ దుకాణం నడుపుతున్నాను. చీటీలు ఎత్తేవారు నాకు డబ్బులిచ్చి వెళ్తుంటారు. అలా ఇచ్చిన డబ్బులను వారికిచ్చాను. దాదాపు రూ.7.50లక్షలు ఇచ్చాను. దీంతో పాటు మరో రూ.60 వేల చీటీ డబ్బులు ఇచ్చాను. దేనికీ కాగితాలు రాసివ్వలేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు.
- పి అప్పలకొండ, చిన్నిపిల్లి వీధి
 
నాకు తెలియకుండా నా భార్య ఇచ్చేసింది
రాజశేఖర్ భార్య గాయత్రి వచ్చి మాయ చేసి అడిగితే నాకు తెలియకుండా నా భార్య పద్మజ రూ.7 లక్షలు ఇచ్చేసింది. భూమి అమ్మితే వచ్చిన డబ్బు ఇంట్లో ఉందని తెలుసుకుని వచ్చి మాయ చేశారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. కలెక్టర్ దృష్టిలో పెట్టాలని అందరం వచ్చాం.
- ఎం జగదీశ్వరరావు, బాధితుడు
 
నా డబ్బులెలా వస్తాయో..    
నేను నాలుగైదు వీధుల్లో పాల ప్యాకెట్లు విక్రయిస్తాను. అలాగే సాయిరాం ఆలయం ముందు కొబ్బరి కాయలు విక్రయిస్తాను. నేను పైసా పైసా కూడబెట్టి రూ.30 వేలు పోగేశాను. ఆ డబ్బులు ఉన్నాయని తెలిసి వచ్చారు. మళ్లీ వడ్డీతో సహా ఇస్తామని చెబితే ఇచ్చాను. నా డబ్బులెలా వస్తాయో..!    
- చిన్నిపిల్లి రమణమ్మ,  పన్నీరువారి వీధి
 
రూ. 3లక్షల చీటీ, రెండు లక్షల అప్పు ఇచ్చాం
నా భర్త ప్రైవేటు ఇన్‌కంటాక్స్ ఫైళ్లు రాస్తుంటారు. మేం చీటి వేసిన రూ. 3లక్షలకు నేనే ష్యూరిటీ ఉంటానని తీసుకెళ్లిపోయాడు. అలాగే మరో రెండు లక్షలకు మధ్య ఉన్నాం. మొత్తం ఐదు లక్షలు కాజేశారు. ఇలా అర్ధాంతరంగా స్కూల్ మూసేసి వెళ్లిపోతారనుకోలేదు.      
- కె.సూర్యకళ, విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement