మద్యాన్ని వెలివేశారు! | poorest families in the village of epidemics of alcohol from the villages | Sakshi
Sakshi News home page

మద్యాన్ని వెలివేశారు!

Published Thu, Aug 15 2013 5:27 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM

poorest families in the village of epidemics of alcohol from the villages

 చొప్పదండి, న్యూస్‌లైన్: ప్రజలను జాగృతం చేయడంలో వీరు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. నిరుపేదల కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్న మద్యం మహమ్మారిని గ్రామం నుంచి ‘వెలివేశారు’. మద్య నిషేధం అమలుకు నిర్ణయించి ఈ మేరకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామం అభివృద్ధి స్ఫూర్తిగా ప్రభుత్వం ల్యాబ్ టు ల్యాండ్ కార్యక్రమం అమలుకు జిల్లాలో నాలుగు గ్రామాల ను ఎంపిక చేసింది. ఇందులో ఒకటి దేశాయిపేట. గ్రామంలో 2011 లెక్కల ప్రకారం 1,265 మంది జనాభా ఉన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై భారత్ నిర్మాణ్ వాలంటీర్లుగా ఇక్కడి యువతను ఎంపిక చేసి పలు దఫాలు గా శిక్షణ ఇచ్చారు. గ్రామంలో వివిధ పనుల అమలుకు 20 వరకు కమిటీలను గ్రామస్తులతో నియమించారు.
 
 ఒక్కో కమిటీకి ఒక్కో పని అప్పగించారు. బీఎన్వీలు గ్రామంలో మద్యనిషేధంపై సమావేశాల్లో నిర్ణయించి ప్రజాప్రతి నిధుల సహకారంతో అమలుకు రెండేళ్ల క్రితం బాటలు వేశారు. గ్రామంలోని స్వశక్తి మహిళ లు, యువత, విద్యార్థులు, నాయకులు కలిసి మద్యనిషేధంపై ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు చేయబోమని ప్రతినచేయించారు.  స్వాతంత్య్ర దినం సందర్భంగా దేశాయిపేటలో అప్పట్లో సంపూర్ణ మద్య నిషేధం అమలులోకి వచ్చింది. రెండేళ్లుగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి చేరువగా వీరి ప్రయాణం సాగుతోంది.
 
 ఎన్నికల హామీతో గుమ్లాపూర్‌లో..
 ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయడానికి మండల పరిధిలోని గుమ్లాపూర్ పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు చేపట్టవద్దని డప్పు చాటింపు చేయించారు.
 
 గామ జనాభా 2,848 మంది. పంచాయతీ ఎన్నికలకు ముందు అభ్యర్థులతో గ్రామస్తులు ముఖాముఖి నిర్వహించారు. మద్య నిషేధం అమలు చేయాలని స్వశక్తి మహిళలు డిమాండ్ చేశారు. ఇందుకు అభ్యర్థులు లిఖిత పూర్వక హామీఇచ్చారు. నేటి నుంచి ఇది అమల్లోకి రానుందని సర్పంచ్ ముష్కె వెంకట్‌రెడ్డి అధ్యక్షతన పాలకవర్గం తీర్మానించింది.
 
 కమిటీలు వేశాం
 మద్యనిషేధంతో పాటు అన్ని పనుల నిర్వహణకు కమిటీలు వేశాం. మద్యం అమ్మకాలు నిషేధించడానికి గ్రామస్తులంతా ఒప్పుకున్నారు. వాలంటీర్లం పలుసార్లు ర్యాలీలు నిర్వహించాం.
 - సుద్దాల శ్రీనివాస్‌గౌడ్,
 బీఎన్వీ వాలంటీర్, దేశాయిపేట
 
 గ్రామస్తుల సమష్టి నిర్ణయం
 గ్రామంలో మద్యనిషేధం అమలు చేయాలని అంతా సమష్టిగా నిర్ణయించాం. అందరం మద్య నిషేదానికి ప్రతిజ్ఞ చేశాం. అందరూ కట్టుబడి ఉన్నారు. గ్రామంలో ప్రశాంతత ఉంది. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తున్నాం.
 - మోర భద్రేశం, మాజీ సర్పంచ్, దేశాయిపేట
 
 ఎన్నికల హామీ నిలబెట్టుకుంటున్నాం..
 గ్రామంలో బహిరంగ మద్య నిషేధం, మద్యం అమ్మకాల నిషేధంపై ఎన్నికల ముందు మాటిచ్చాం. ప్రజల కోరిక మేరకు పంచాయతీ పాల కవర్గ సమావేశంలో దీనిపైనే తొలి తీర్మానం చేశాం. యువత భాగస్వామ్యం బాగుంది.
 - ముష్కె వెంకట్‌రెడ్డి, సర్పంచ్, గుమ్లాపూర్
 

Advertisement
 
Advertisement
 
Advertisement