- నీళ్లొదిలిన కిరణ్ సర్కారు
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా ప్రజాప్రతినిధుల అలసత్వం వల్ల మచిలీపట్నంలో నిర్మితం కావాల్సిన పోర్టుపనులు ఎక్కడ వేసినగొంగలి అక్కడే అన్న చందంగా మారాయని స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా అధికారపక్ష నాయకులు పోర్టు అంశంపై ముఖ్యమంత్రిని ఒప్పించలేకపోవడంతోనే ఈ దుస్థితి పట్టిందని ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికంగా అంతగా అభివృద్ధి చెందని జిల్లాలో బందరు పోర్టు నిర్మాణంతో పలు పరిశ్రమలు స్థాపించడానికి అవకాశం ఉందని, అయినా ఈ విషయాన్ని ఐదేళ్లుగా మన జిల్లాకు చెందిన పాలకులు పట్టించుకోలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
11 సంవత్సరాలుగా ఉద్యమాలు...
బందరు పోర్టు నిర్మాణం చేయాలని 2003 నుంచి ఉద్యమాలు ప్రారంభమై నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. పోర్టుకు అనుబంధంగా 27 రకాల పరిశ్రమలు జిల్లాలో స్థాపించేందుకు అవకాశం ఉంటుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
జీవో నంబరు 11 అమలయ్యేనా...
బందరు పోర్టును నిర్మించాలని 2003నుంచి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 2004లో 100 రోజులపాటు రిలే దీక్షలు, 10 రోజులపాటు ఆమరణ దీక్షలు చేయడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి బందరు పోర్టును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2008 ఏప్రిల్ 23 వ తేదీన బందరు పోర్టు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. 2009లో ఎన్నికల నేపథ్యంలో పోర్టు పనులకు బ్రేక్‌పడింది. 2009 సెప్టెంబరు 2వ తేదీన వైఎస్.మరణంతో పోర్టు అంశాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేటాస్ కంపెనీనుంచి నవయుగ సంస్థకు పనులను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అనంతరం వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2012 మే 2వ తేదీన మచిలీపట్నంలో జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. పోర్టుకు కావాల్సిన భూసేకరణ కోసం జీవో నంబరు 11ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి స్థాయిలో జీవో నంబరు 11ను జారీ చేసి 21 నెలలు గడచినా బందరు పోర్టు నిర్మాణానికి భూసేకరణ జరగనేలేదు. ఇంతవరకు పోర్టు ఫైల్ సీఎం పేషీ దాటి బయటకు రాలేదు. రాష్ట్ర విభజన అంశం వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆఖరి ప్రయత్నంగానైనా జిల్లాకు చెందిన అధికార పక్షానికి చెందిన నాయకులు బందరు పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అలక్ష్యం వల్లే పోర్టు కం షిప్ యార్డు తరలిపోయిందా...
రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సమయంలో నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో పోర్టు కం షిప్ యార్డును నిర్మిస్తామని కేంద్రస్థాయి నేతలు ప్రకటించారు. దీనికి నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. దీంతో దుగరాజపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మింపజేసేందుకు ఆ జిల్లాకు చెందిన అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు తమ వంతు ప్రయత్నాలు వేగవంతం చేశారు.
వాస్తవానికి పోర్టు కం షిప్‌యార్డును మచిలీపట్నంలో నిర్మించేందుకు తొలుత ప్రయత్నాలు జరిగాయి. మచిలీపట్నంలో పోర్టు కం షిప్ యార్డును నిర్మించేందుకు అనుకూలత ఉందని సాంకేతిక నిపుణులు నివేదిక ఇచ్చారు. అయితే మన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని అంతగా పట్టించుకోకపోవడంతో దాదాపు రూ.1500 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే పోర్టు కం షిప్‌యార్డు దుగరాజపట్నంకు తరలిపోయిందనే వాదన పలువురి నుంచి వ్యక్తమవుతుంది.