పోర్టుకు ప్రత్యేక జీవో వేగంగా భూసేకరణ
- రెండు వారాల్లో జీవో విడుదల చేస్తాం
- సీఎంతో పారిశ్రామికాభివృద్ధి విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిధర్
- నాలుగు లేన్లుగా 216 జాతీయ రహదారి
మచిలీపట్నం : బందరు పోర్టు భూసేకరణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక జీవో జారీచేయనున్నట్లు పారిశ్రామికాభివృద్ధి విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిధర్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం విజయవాడలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో బందరుపోర్టు, 216 జాతీయ రహదారి నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసే అంశాలు చర్చకు వచ్చాయి.
బందరు పోర్టు అభివృద్ధికి భూసేకరణ కీలకంగా మారిందని, భూసేకరణలో అనేక అడ్డంకులు ఉన్నాయని గిరిధర్ తెలిపారు. అడ్డంకులను అధిగమించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు రెండు వారాల వ్యవధిలో ప్రత్యేక జీవోను విడుదల చేయనున్నట్లు ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సముద్రతీరం వెంబడి రహదారుల అభివృద్ధిపై సమావేశంలో చర్చ జరిగింది. రహదారుల విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యాంబాబు మాట్లాడుతూ.. 216 జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని సీఎంకు వివరించారు.
భూసేకరణ పూర్తవడానికి ఎనిమిది నెలలు పైనే..
బందరు పోర్టు భూసేకరణకు 2012 మే 1వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జీవో నంబరు 11 జారీ చేశారు. 5,324 ఎకరాలను సేకరించనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 524 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించింది. మిగిలిన 4,800 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. కాగా బందరు పోర్టు అభివృద్ధి జరగాలంటే భూసేకరణే కీలకంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మళ్లీ ప్రత్యేక జీవో జారీ చేస్తే ఎంత కాలానికి ఈ ప్రక్రియ పూర్తవుతుందనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. పాలకులు ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని చెబుతూ వస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసినా భూసేకరణకు అన్ని విభాగాలు సహకరిస్తే కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుంది.
నాలుగు లేన్లుగా 216 జాతీయ రహదారి
సముద్రతీర ప్రాంతాలను కలుపుతూ కోస్తా జాతీయ రహదారిని నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలుకు సమీపంలోని త్రోవగుంట వరకు 216 జాతీయ రహదారి 393 కిలోమీటర్ల మేర ఉంది.
ఇందులో కత్తిపూడి, కాకినాడ, యానాం, అమలాపురం, రాజోలు, నర్సాపురం, బంటుమిల్లి, పెడన, మచిలీపట్నం, చల్లపల్లి, మోపిదేవి, రేపల్లె, బాపట్ల, చీరాల, ఒంగోలు వరకు ఉన్న రహదారి తీరం వెంబడి ఉంది. గతంలోనే ఈ రహదారిని పదిమీటర్ల మేర విస్తరించి, తారురోడ్డుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. కేంద్రప్రభుత్వం జాతీయ రహదారుల విభాగం నుంచి ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ యూనిట్ విభాగానికి రోడ్డు విస్తరణ పనులను అప్పగించింది.
ఇందుకోసం మచిలీపట్నంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లాలో కృత్తివెన్ను మండలం పల్లెపాలెం వద్ద 171వ కిలోమీటరు వద్ద ఈ రహదారి ప్రారంభమై పులిగడ్డ వారధి 265వ కిలోమీటరు వరకు 94 కిలోమీటర్ల మేర ఉంది. అయితే ఈ రోడ్డును నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయాలనే అంశంపై గతంలోనూ కలెక్టర్ల సమావేశంలో చర్చ జరిగింది. సముద్రతీరం వెంబడి 216 జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జాతీయ రహదారులశాఖ అధికారులు చెబుతున్నారు.