పదవులు హుళక్కేనా?
- నామినేటెడ్ పోస్టుల నగుబాటు
- జిల్లాలో అర్బన్‌బ్యాంక్, ఉడా, దేవాలయాల పదవులకు గండం
- గవర్నర్ మరో ఝలక్‌తో సర్వత్రా చర్చ
సాక్షి, మచిలీపట్నం : మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నియమించిన నామినేటెడ్ పదవులకు పెద్ద గండం వచ్చి పడింది. సోమవారం రాత్రి గవర్నర్ నరసింహన్ అనధికార ఆదేశాలు ఇవ్వడంతో జిల్లాలోని నామినేటెడ్ పదవులు చేపట్టిన వారి గుండెల్లో గుబులు రేగుతోంది. రాష్ట్రపతి పాలన నేపథ్యంలో గవర్నర్ ఇప్పటికే సీఎంగా కిరణ్ ఆఖరి సమయంలో చేసిన సంతకాలపై పరిశీలిస్తానని ఝలక్ ఇచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా కిరణ్ నియమించిన నామినేటెడ్ పదవుల నుంచి వైదొలగాలని అనధికారి ఆదేశాలు ఇచ్చి గవర్నర్ మరో ఝలక్ ఇచ్చారు. దీంతో జిల్లాలోని ఉడా, మచిలీపట్నం అర్బన్ బ్యాంక్ పాలకవర్గాలతో పాటు పలు దేవాలయాలు, ఇతర నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ముచ్చట ముగిసిపోయే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది.
రెండు వారాలకే ముగియనున్న అర్బన్ బ్యాంకు పదవీకాలం...
కాంగ్రెస్‌లో అనేక వివాదాల నడుమ బందరు అర్బన్ బ్యాంకుకు ఫిబ్రవరిలో పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. అర్బన్ బ్యాంకు పాలకవర్గ చైర్మన్ జోగి రామకృష్ణ నేతృత్వంలోని పాలకవర్గం గత నెల 19న బాధ్యతలు చేపట్టింది. గవర్నర్ ఉత్తర్వులతో బాధ్యతలు చేపట్టి రెండు వారాలు గడవకముందే బందరు అర్బన్ బ్యాంకు పాలకవర్గం పదవీకాలం ముగిసిపోయే ప్రమాదం వచ్చిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఉడాకు నలుగురు డెరైక్టర్లను నియమించారు.
గవర్నర్ ఆదేశాలు అమల్లోకి వస్తే వారి పదవులు హుళక్కే. బందరు టౌన్‌హాలు కమిటీ, మచిలీపట్నం నియోజకవర్గంలోని చిన్నాపురంలోని దేవాలయం, కొజ్జిల్లిపేటలోని నాగేశ్వరస్వామి దేవాలయం, ఈడేపల్లిలోని జోడు గుళ్లు, తపసిపూడిలోని ఆలయంతో పాటు పలు ఆలయాలకు హడావుడిగా నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు.
ఇలా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దేవాలయాలకు నామినేటెడ్ పదవులను ఎన్నికల తాయిలాలుగా కాంగ్రెస్ క్యాడర్‌కు ఇచ్చేశారు. గవర్నర్ ఆదేశాలు పాటిస్తే కిరణ్ సర్కార్ నియమించిన నామినేటెడ్ పదవులు పొందిన వారంతా రాజీనామాలు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే గవర్నర్ ఇచ్చిన అనధికార ఆదేశాలు ఎంత వరకు అమలువుతాయన్నది సందేహమేనని నామినేటెడ్ పదవులు పొందినవారు తేలిగ్గా తీసుకోవడం కొసమెరుపు.