కడప అగ్రికల్చర్: ‘దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే’ చందంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత అందివచ్చిన అవకాశాన్ని ఏమాత్రం చేజార్చుకోవద్దనే రీతిలో ఆ పార్టీ నేతల తీరు ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మార్కెట్ కమిటీల పాలక వర్గాలను ప్రత్యేక ఉత్తర్వులతో కేబినెట్ కమిటీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ పదవులను చేజిక్కించుకునేందుకు పలువురు ఆశావహులు తెరముందుకు వస్తున్నారు.
అయితే డబ్బున్నోడికే మార్కెట్ క మిటీ పదవులు అంటూ అధికార పార్టీకి చెందిన ఓ నేత నిర్మొహమాటంగా చెబుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో కాంట్రాక్టు పనులతో బాగా డబ్బు సంపాదించుకుని తెలుగుదేశం పార్టీలో చేరిన వారు ఎక్కువమంది ఈ పదవులకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కడప సీఎంగా పేరు పొందిన అధికార పార్టీ నేత వీరి అడుగులకు మడుగులొత్తుతూ అందిన కాడికి దండుకోవాలనే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. మార్కెట్ కమిటీ పదవులను మార్కెట్‌లో సరుకుల్లా విక్రయించేందుకు సిద్ధపడిన నేత తీరుపై ఆ పార్టీ సీనియర్లు గుర్రుమంటున్నారు.
ప్రొద్దుటూరు, కమలాపురం, రాయచోటి, సిద్దవటం, బద్వేలు, పులివెందులలో ఈ పదవులకు తీవ్రమైన పోటీ నెలకొందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటివరకు కడప మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పెడబల్లె గణేష్‌రెడ్డి, కమలాపురానికి కె.మోహన్‌రెడ్డి, మైదుకూరుకు బీఎన్ శ్రీనివాసులు (2013 మార్చి వరకు), లక్కిరెడ్డిపల్లెకు చింతకుంట రెడ్డెమ్మ, రాయచోటికి కొలిమి హరూన్‌బాషా, సిద్దవటంకు శివరామిరెడ్డి, బద్వేలుకు జయసుబ్బారెడ్డి, జమ్మలమడుగుకు బి.నారాయణరెడ్డి, పులివెందులకు తూగుట్ల మధుసూదన్‌రెడ్డి, రైల్వేకోడూరుకు జయప్రకాశ్ నారాయణ వర్మ, రాజంపేటకు యోగేశ్వరరెడ్డి, ప్రొద్దుటూరుకు మారుతిప్రసాద్‌రెడ్డిలు ఛైర్మన్లుగా ఉంటున్నారు. ఈ కమిటీలను రద్దు చేస్తూ జీఓ వెలువడింది. ఈ జీఓ రెండు, మూడు రోజుల్లో జిల్లా కేంద్రానికి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఆ జీఓలు వచ్చిన తర్వాత నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని వారు పేర్కొన్నారు. కాగా, ఈ పదవులపై పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నవారు ఆశలు పెట్టుకున్నారు. పాలకవర్గంలో చోటు కావాలంటే మనీ అప్పగించాల్సి వస్తోందని కొందరు పార్టీ నాయకులు మథన పడుతున్నారు. ఎప్పటినుంచో పార్టీలో సేవలందిస్తూ వచ్చామని, ఇప్పుడు పదవిని డబ్బుతో కొనుక్కోవాల్సి రావడం బాధ కలిగిస్తోందని పలువురు పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు పలువురు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికి అధికార పార్టీలో మార్కెట్ కమిటీల వివాదం తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మార్కెట్‌లో పదవులు!
Published Mon, Jul 28 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM
Advertisement
Advertisement