చీరాల, న్యూస్‌లైన్: పనబాక లక్ష్మి..పక్క జిల్లా నుంచి వచ్చి ఎంపీగా పోటీచేసి ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో గెలిచి కేంద్రమంత్రిగా అధికారాన్ని అనుభవిస్తున్నారు. 2009 ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమెకు ఇక్కడి ప్రజలు, పార్టీ నాయకులతో పరిచయం లేదు. కనీసం అన్ని ప్రాంతాల్లో తిరిగి ఓట్లు కూడా అభ్యర్ధించలేదు. కానీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఆమె ముఖం కూడా చూడకుండానే అత్యధిక మెజార్టీతో గెలిపించారు.
దీంతో ఆమెకు కేంద్రమంత్రి పదవి దక్కింది. చేనేత జౌళిశాఖ సహాయ మంత్రి, పెట్రోలియం, సహజవాయువుల సహాయ మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో చేనేతలు చీరాలలో ఉన్నారు. చేనేత రంగం సంక్షోభంలో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్న కార్మికులకు పనబాక చేయూతనిస్తారని ఆశించారు. అయితే ఐదేళ్ల కాలంలో ఆమె చేనేత కార్మికులు, నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యమే. బాపట్ల పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గుంటూరు జిల్లాలో బాపట్ల, రేపల్లె, వేమూరు, ప్రకాశం జిల్లాలో చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాలున్నాయి. వీటిలో అత్యధికంగా రైతులు, చేనేత కార్మికులున్నారు.
ఐదేళ్లపాటు కేంద్రమంత్రి స్థాయిలో ఆమె నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. గెలిచిన అనంతరం చీరాల ప్రాంతంలో మెగాక్లస్టర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన ఆమె కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించినా..నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఆదివారం చేనేత పార్కు స్థలంలో శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో కూడా నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వడం మినహా కార్మికులకు పెద్దగా ఉపాధి అవకాశాలు ఉండవనేది సమాచారం.
విభజనవాది...పనబాక:
నియోజకవర్గాల అభివృద్ధి గాలికొదిలేసిన పనబాక లక్ష్మి రాష్ట్ర విభజనకు అందరికంటే ఎక్కువ సహాయ సహకారాలందించారు. రాష్ట్ర విభజనపై మొదటిసారి సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు సోనియాగాంధీని కలిసినప్పుడు అందరిముందే ‘నీకు ముందే విభజన గురించి చెప్పాను కదా..మళ్లీ ఇప్పుడు రావడం ఏమిటి’ అని ఆమె పనబాకతో అన్నట్లు సమావేశంలో పాల్గొన్న ఎంపీలే చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొందరు ఎంపీలు, కేంద్రమంత్రులు సమైక్యాంధ్ర కోసం అంటూ నాటకీయంగా ఆందోళనలు చేసినా..పనబాక మాత్రం సోనియా చెప్పిందే వేదవాక్కు అన్నట్లు వ్యవహరించారు. రాష్ట్ర విభజన వలన సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని తెలిసినా ఆమె ఒక్కసారి కూడా నిరసన వ్యక్తం చేయలేదు. పెపైచ్చు అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని పలుమార్లు ప్రకటించారు. దీంతో ప్రజలు పనబాకపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలే ఆమెను బహిరంగంగా విమర్శిస్తున్నారు. పనబాక ఎక్కడికెళ్లినా..సమైక్యవాదులు అడ్డుకుని నిరసన తెలుపుతున్నారు. ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆమె కూడా చీరాల వచ్చారు.
సీఎం ఎదుటే పనబాక లక్ష్మిని సీమాంధ్ర ద్రోహి అంటూ సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు నినాదాలు చేసి అడ్డుకోబోయారు. ఇదిలా ఉంటే మెగా క్లస్టర్ ప్రాజెక్టు శంకుస్థాపన పేరుతో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుతో కలిసి ఆమె ఆదివారం వేటపాలెం రానున్నారు. దీంతో మరోసారి పనబాకకు నిరసనలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. అయితే ఆమె మళ్లీ బాపట్ల నుంచే పోటీ చేస్తానని అనడంతో పాటు కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రను సింగపూర్ చేస్తుందని ప్రజల ఆగ్రహంపై నీళ్లు చల్లే ప్రయత్నాలు చేయడం గమనార్హం.
పదవే ప్రాణం..
Published Sun, Mar 2 2014 4:28 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement