సాక్షి, అమరావతి: ఎంసెట్ సహా ఇతర సెట్లన్నింటి నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్, వివిధ యూనివర్సిటీల ప్రవేశ పరీక్షలతో పాటు పలు రాష్ట్రాల ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా పడిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయి. ఈ అంశాలను విద్యాశాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకురావడంతో రాష్ట్రంలోనూ అన్ని రకాల సెట్లను వాయిదా వేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
8 ప్రవేశ పరీక్షలు వాయిదా: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా, వివిధ వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ సహా అన్నిప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మూడో వారానికి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సోమవారం ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పరీక్షలను వాయిదా వేస్తున్నామని వెల్లడించారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
– నీట్, జేఈఈ లాంటి జాతీయ ప్రవేశ పరీక్షలకు ఆటంకం కలగకుండా ఎంసెట్ సహా 8 ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మూడో వారానికి వాయిదా వేస్తున్నాం. వీటిపై స్పష్టమైన షెడ్యూల్‌ను తరువాత ప్రకటిస్తాం.
– తొలుత నిర్ణయించిన ప్రకారం ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షల ¯నిర్వహణకు ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాస్కులు, శానిటైజర్లు పంపిణీ సహా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పరీక్షలు వాయిదా వేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
– జాతీయ ప్రవేశ పరీక్షలకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఈ ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటిస్తాం.
డిగ్రీ, పీజీ ఫైనలియర్ పరీక్షల బాధ్యత వర్సిటీలకు...
– యూజీసీ ఆదేశాల మేరకు బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులు, పీజీ ఫైనలియర్ విద్యార్థులకు సెప్టెంబర్ ఆఖరులోగా పరీక్షలు నిర్వహించే బాధ్యతను ఆయా యూనివర్సిటీలకే అప్పగిస్తున్నాం. చాయిస్ బేస్డ్ క్రెడిట్ విధానానికి సంబంధించి కొత్తగా రూపొందించిన విద్యా క్యాలెండర్‌ను డిగ్రీ, పీజీ కాలేజీల్లో అమలు చేయనున్నాం.
ఆన్‌లైన్‌పై త్వరలో మార్గదర్శకాలు....
– ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాల బోధనకు సంబంధించి విధివిధానాలు రూపొందించలేదు. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు బ్రిడ్జి కోర్సులు, ఇంగ్లిష్ ప్రొఫెషియన్సీ శిక్షణ, ఎంసెట్ తదితర పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మాక్ టెస్టులలో ఆన్‌లైన్‌ను వినియోగిస్తున్నారు. విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ బోధనపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తాం.
– ఇంటర్మీడియెట్‌లో అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేసినందున ఇంప్రూవ్‌మెంటు పరీక్షలను నిర్వహించలేదు. ప్రస్తుతం ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరంలో సెకండియర్ పరీక్షలతోపాటు ఫస్టియర్ సబ్జెక్టులలో ఇంప్రూవ్‌మెంటు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తున్నాం.
ఆ విద్యాసంస్థలపై చర్యలు..
– ప్రయివేటు విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా పలు కార్యకలాపాలు చేపడుతున్నాయని, ఫీజుల వసూలుకు ఒత్తిడి చేస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ స్కూళ్లకు సంబంధించి ఫీజుల నిర్ణయం, విద్యాసంస్థల్లో ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌కు ప్రయివేటు విద్యా సంస్థలపై అనేక ఫిర్యాదులు అందాయి. ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది.. ఆ మేరకు చర్యలు చేపడతాం.
– మీడియా సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్లు రామ్మోహనరావు, లక్ష్మమ్మ, కాలేజీ విద్య కమిషనర్ నాయక్, మండలి కార్యదర్శి సుధీర్ ప్రేమ్‌కుమార్, ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.
పలు ప్రవేశ పరీక్షలకు అందిన దరఖాస్తులు
ఎంసెట్ 2,72,283
ఈసెట్ 36,486
ఐసెట్ 64,810
పీజీఈసెట్ 27,685
లాసెట్ 16,817
ఎడ్‌సెట్ 13,789
పీఈసెట్ 2,648
రీసెర్చ్ సెట్ –
Comments
Please login to add a commentAdd a comment