బాబు మోసాలపై నిలదీయాలి
పుంగనూరు: ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నిలదీయాలని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలిసారిగా పుంగనూరు మండలంలోని గ్రామాల్లో పర్యటనకు శ్రీకారం చుట్టారు. మండలంలోని జౌకొత్తూరులో పర్యటన ప్రారంభించారు.
ఈ సందర్భంగా అలజనేరు గ్రామంలో జరిగిన సమావేశంలో పెద్దిరెడ్డి ప్రసంగించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డిని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రకాల రైతుల రుణాలను, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామనీ, వెయ్యిరూపాయల పింఛన్లు మంజూరు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంచేసి రెండు నెలలు కావస్తున్నా, బాబు మాయమాటలతో, కమిటీల పేరుతో రోజుకొక ప్రకటన ఇస్తూ ప్రజల ను మోసగిస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టిన వెంటనే ఉచిత కరెంటు ఇచ్చారని, రైతుల రుణాలు తీర్చారని గుర్తుచేశారు.
వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలుపరిచేందుకు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల తరువాత ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన మోసపూరిత ప్రకటనలను ప్రజలు నమ్మి తెలుగుదేశానికి ఓట్లు వేశారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై ప్రజలు చైతన్యవంతులుకావాలని కోరారు. నియోజకవర్గంలో సర్పంచ్ నుంచి ఎంపీ వరకు అధికారం తమదేనని, ఇందులో విమర్శలకు తావులేదన్నారు. సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, వైస్‌ఎంపీపీ రామచంద్రారెడ్డి, సర్పంచ్‌లు రెడ్డెప్ప, నాగిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, మాజీ ఎంపీటీసీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, రామసముద్రం సింగిల్‌విండో అధ్యక్షుడు కేశవరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పర్యటనకు అన్నిశాఖల అధికారులు హాజరయ్యారు. కానీ పోలీసు అధికారులు, సిబ్బంది ఎవరూ హాజరుకాలేదు.
చిన్నారులకు అభివాదం
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండల పర్యటనలో భాగంగా కురప్పల్లెకు వెళ్లారు. అక్కడ చిన్నారులు ‘‘ఎమ్మెల్యేసార్ ..’’ అంటూ నమస్కారం చేయగా.. ఎమ్మెల్యే ‘‘వెరీగుడ్’’ అంటూ చిరునవ్వుతో ప్రతినమస్కారం చేయడం పలువురిని ఆకట్టుకుంది.