కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్:
రైతుకు కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం, విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల అలసత్వంతో వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. రైతులకు ఇచ్చే 7గంటల ఉచిత విద్యుత్ సరఫరాలో అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. రోజుకు ఏడు గంటల్లో రైతులకు ఐదు రోజుల నుంచి కేవలం ఐదారు గంటలు మాత్రమే అందుతోంది. ఏదైన సమస్య తలెత్తితే ఏడు గంటల పాటు విద్యుత్ ఇవ్వలేని పక్షంలో తిరిగి ఇతర సమయాల్లో పునరుద్ధరించి సర్దుబాటు (కాంపెన్జేషన్) చేయాల్సి ఉంది. కాని ఈ నిబంధనను ఉన్నతాధికారులు విస్మరిస్తున్నారు. స్థానిక అధికారులకు ఆదేశాలు ఇవ్వకపోగా రైతుల అడుగుతున్నారని విన్నవించినప్పటికీ విద్యుత్ కొతర ఉందని, కోతలు విధించినప్పకిటీ సర్దుబాటు (కాంపెన్జేషన్) ఇవ్వాల్సిన అవసరంలేదని ఉన్నతాధికారులు (హైదరాబాదు) తేల్చిచెబుతున్నట్లు సమాచారం. దీంతో కిందిస్థాయి అధికారులు చేసేదేమిలేక చేతులెత్తేస్తున్నారు.
సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం, ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో రైతులు తీవ్రం నష్టపోతున్నారు. ఉచిత విద్యుత్ అందుతుందని బావులు, బోర్ల కింద పొలం సాగు చేస్తున్న రైతులు కోతల కారణంగా పంటకు నీరు కట్టుకోలేకపోతున్నారు. ఫలితంగా పంట పోలాల్లోనే ఎండిపోవాల్సిన పరిస్థితి. థర్మల్ పవర్ పాంట్లకు బొగ్గు కొరత, హైడల్ (జల) విద్యుత్ కేంద్రాల్లో ఏర్పడిన సమస్య కారణంగా రాష్ట్రంలో లోటుకు దారితీసింది. ఫలితంగా జిల్లాలో కొద్ది రోజులుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. జిల్లాను ప్రాంతాలుగా విభజించి, లోడ్ రిలీఫ్ (ఎల్‌ఆర్) పేరుతో విడతల వారిగా సరఫరా నిలిపివేస్తున్నారు. అయినా లోటు తీరడం లేదు. దీంతో వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌లో కోతలు విధించేందుకు సిద్ధమయ్యారు. సర్కిల్‌ను రెండు గ్రూపులుగా విభజంచి రోజుకు 7గంటల పాటు సరఫరా చేయాలి. పగలు నాలుగు గంటలు, రాత్రి మూడు గంటలు వారానికి ఒక గ్రూపుగా ఇవ్వాలి. లోటు పేరుతో ట్రాన్స్‌కో సంస్థ అధికారులు నేరుగా హైదరాబాదులోని లోడ్ మానిటరింగ్ అండ్ డిస్పాచ్ సెంటర్ నుంచే ఈ కోతలు విధిస్తున్నారు.
కోత విధించిన విద్యుత్‌ను ఇతర సమయాల్లో ఇచ్చి సర్దుబాటు చేయాలని ఏపీసీపీడీసీఎల్ స్థానిక అధికారులు చేస్తున్న విన్నపాలను పట్టించుకోవడం లేదు.
రోజుకు ఎంత విద్యుత్ అవసరం:
సర్కిల్ (జిల్లా)లో ప్రస్తుతం ఎనిమిది కేటగిరిల కింద మొత్తం 10.52లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా 375 హెచ్‌టీ కనెక్షన్లున్నాయి. ప్రస్తుతం రోజుకు 1కోటి యూనిట్లు అవసరం కాగా లోటు కారణంగా కేవలం 85లక్షల యుూనిట్లలోపే ఇస్తున్నారు. మొత్తం 1.03లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. 5 హార్స్ పవర్ (హెచ్‌పీ) మోటరు 7గంటల పాటు ఆడితే 28 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. మొత్తం కనెక్షన్లకు రోజుకు దాదాపు 32.51లక్షల యూనిట్ల అవసరం అవుతుంది.
లోటు కారణంగా ఇవ్వలేకపోతున్నాం - టి. బసయ్య, ఎస్‌ఈ
నాలుగు రోజులుగా విద్యుత్ సమస్య ఉంది. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు లోడ్ రిలీఫ్ పేరుతో మెయిన్ సప్లై ద్వారా సరఫరా నిలిపివేస్తున్నారు. తిరిగి సరఫరా ఇచ్చి సర్దుబాటు (కాంపెన్‌జేషన్) ఇచ్చేందుకు ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వడం లేదు. అందుకే సరఫరా సర్దుబాటు చేయలేకపోతున్నాం.
‘ఉచితం’లో కోత
Published Tue, Dec 17 2013 4:19 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement