మళ్లీ.. కరెంట్ కట్
Published Wed, Sep 11 2013 2:44 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
వరంగల్, న్యూస్‌లైన్: విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది... నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తాం.. అన్న ప్రభుత్వ ప్రకటనలు నీటి మీద రాతలుగా మారారుు. అవన్నీ కోతలేనని తేలిపోయూరుు. 50 రోజుల పాటు నిరంతర సరఫరా చేసిన విద్యుత్ సంస్థ మంగళవారం నుంచి కోతలను అమల్లో పెట్టింది. ప్రస్తుతానికి గృహ వినియోగదారులకు మాత్రమే పవర్ కట్ అమలు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో పంటలకు విద్యుత్ సరఫరా ఎక్కువ కావడం, లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ సెట్లు మొదలు కావడంతో విద్యుత్ కోతలు తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే రెండు, మూడు గంటలే సరఫరా నిలిపివేస్తున్నామని చెబుతున్నా... ఆరు గంటలకు పైగానే కోత విధిస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాకు రోజుకు 7.4 మెగా యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఆదివారం 11ఎంయూలు, సోమవారం 10.8 ఎంయూలు, మంగళవారం 11.13 ఎంయూల విద్యుత్ వినియోగమైంది. ఈ లెక్కన రోజుకు సగటున 11 మెగా యూనిట్లు అవసరమవుతోంది. కానీ... లోటు 3.6 మెగా యూనిట్లు ఉండడంతో కోతలు అనివార్యమవుతున్నట్లు తెలుస్తోంది.
విద్యుత్ కోతలు ఇలా...
అధికారుల ప్రకటన ప్రకారం మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ కేంద్రాల్లో రెండు గంటలు, గ్రామాల్లో నాలుగు గంట లపాటు కోతలు అమలు చేస్తున్నారు. కానీ... గ్రామాల్లో అదనంగా మరో రెండు గంటల కోత అమలు చేస్తున్నారు. సరఫరా సమయంలో ఈఎల్‌ఆర్ (ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్) నెపంతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఇందుకు బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో మంగళవారం అమలు చేసిన కోతలే నిదర్శనంగా నిలుస్తున్నారుు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.... మళ్లీ 1.30 నుంచి 3.30 గంటల వరకు... సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక విద్యుత్ సరఫరా ఉన్న సమయంలో 12 సార్లు కరెంట్ వచ్చిపోయింది.
కట్ చేసిన ప్రతి సారి 10 నుంచి 20 నిమిషాల వ్యవధిలో సరఫరా ఆపేశారు. ధర్మసాగర్ మం డలం నారాయణగిరిలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిరంతరాయంగా స రఫరా ఆపేశారు. అదే విధంగా సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు, 5.30 నుంచి 6 గంటల వరకు కోత పెట్టారు. కానీ... అధికారులు మాత్రం విద్యుత్ ఇచ్చామనే చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో రాత్రిపూట కూడా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో 45 నిమిషాల నుంచి గంటన్నర వరకు సరఫరా ఉండడం లేదని గ్రామీణ ప్రాంత వినియోగదారులు చెబుతున్నారు. ఇక కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో కోతలు లేవని చెబుతున్నా... లైన్ల మరమ్మతుల పేరిట గంటల తరబడి సరఫరా నిలిపివేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరాకు బ్రేక్ పెడుతున్నారు. ప్రతి రోజూ లైన్ల మరమ్మతులు చేస్తూ... ఏరియాకో రోజు అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు.
విమర్శల వెల్లువ
సాధారణ వర్షపాతం మించి వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లో పూ ర్తిస్థాయి నీటిమట్టం చేరింది. విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా... ప్రజలకు కరంట్ కష్టాలు తప్పడం లేదు. అధికారికంగా రెండు గంటలని చెబుతున్నా... అనధికారికంగా గంటల తరబడి సరఫరా ఆపేస్తున్నారు. ఇక కార్పొరేషన్, మునిసిపాలిటీల్లో కోతలు లేవని చెబుతున్నా... విద్యుత్ లైన్ల మరమ్మతుల పేరిట రోజంతా సరఫరాను నిలిపివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నారుు.
Advertisement