సాక్షి, సంగారెడ్డి: మళ్లీ చీకట్లు అలుముకుంటున్నాయి. వేసవి రాకముందే విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి జిల్లా అంతటా అధికారిక విద్యుత్ కోతలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే పల్లెల్లో ఎడాపెడా కోతలు విధిస్తుండగా.. తాజాగా జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీల్లో, మండల కేంద్రాల్లో ‘నిర్ణీత’ వేళల కోతలను అమలు చేస్తున్నారు. మండల కేంద్రాల్లో రెండు విడతలుగా 4 గంటలు, జిల్లా కేంద్రం, మున్సిపాలిటీల్లో 2 గంటల కోతలు విధించడానికి ట్రాన్స్‌కో షెడ్యూల్‌ను ఖరారు చేసింది. డిసెంబర్ నెల కోటా ప్రకారం జిల్లాకు రోజూ 16.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా కావాల్సి ఉండగా 14 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో కోతలు పెట్టక తప్పడం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
పల్లెల్లో పగలంతా కట్
పల్లెల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ ఉండడం లేదు. వీలును బట్టి మధ్యలో 4 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అక్కడ ఇప్పటికే 8 గంటల కోతలు అమల్లో ఉన్నాయి. సాంకేతిక సమస్యల ఏర్పడిన విద్యుత్ ఉత్పాదన తగ్గిన సమయంలో లోడ్ రిలీఫ్ కోసం అదనపు కోతలు విధించాల్సి వస్తే పల్లెలకు సరఫరా చేసే విద్యుత్‌పైనే వేటు వేస్తున్నారు. జిల్లాలో 609 విద్యుత్ ఫీడర్లుండగా, లోడ్ రిలీఫ్ అమలైన ఫీడర్ల పరిధిలోని పల్లెల్లో పగటి పూట సరఫరా చేయాల్సిన 4 గంటల విద్యుత్‌ను సైతం ఎత్తివేస్తుండడంతో .. పగలంతా సరఫరా ఉండడం లేదు.
రబీ సాగుపై ప్రభావం
వ్యవసాయానికి రెండు లేక మూడు విడతల్లో 7 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు విద్యుత్ శాఖ పేర్కొంటోంది. రాత్రి వేళల్లో 3 గంటలు, పగటి పూట 4 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నారు. ఏదైనా సమస్య వచ్చి లోడ్ రిలీఫ్ అమలైతే సంబంధిత ఫీడర్‌ల పరిధిలో పగటి పూట ఇవ్వాల్సిన 4 గంటల విద్యుత్‌ను నిలిపివేస్తుండడంతో కొన్ని సార్లు కేవలం 3 గంటల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. అయినా..ఇప్పుడిప్పుడే రబీ సాగు ఊపందుకుంటున్న సమయంలో ప్రభుత్వం కోతల విధించడంతో పంటల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇక వేసవిలో విద్యుత్ సరఫరా ఎలా ఉంటుందోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మండల కేంద్రాల్లో ..
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత సాయంత్రం 04 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు..రెండు విడతల్లో 4 గంటల పాటు కోత పెట్టేస్తున్నారు.
మున్సిపాలిటీల్లో..
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 2 గంటల పాటు కోతలు విధిస్తున్నారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో సైతం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు.
ఇక ‘చీకట్’లే!
Published Thu, Dec 19 2013 12:36 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement