చీ‘కట్’లు
పది నిమిషాలకోసారి ట్రిప్.. పావుగంటకోసారి బ్రేక్ డౌన్.. అరగంటకోసారి లోడ్ రిలీఫ్.. గంటకోసారి లైన్ క్లియర్.. జిల్లాలో కరెంట్ సరఫరా దుస్థితి ఇదీ. అటు మండుతున్న ఎండలు, ఇటు కరెంట్ కోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కటిక చీకట్లో కంటిమీద కునుకు రాక జనాలు.. వేసిన తుకాల కోసం చుక్కనీరు లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పెరిగిన డిమాండ్ కనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి లేకపోవడమే అనధికార కోతలకు కారణంగా తెలుస్తోంది.
మెదక్: జిల్లాలో కరెంట్ కోతలు తీవ్ర రూపం దాల్చాయి. కోతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మరోవైపు వ్యవసాయానికి 7 గంటల కరెంట్ ఇస్తామన్న అధికారులు కనీసం 6 గంటలు కూడా సక్రమంగా ఇవ్వలేక పోతుండటం.. మరోవైపు వర్షపు జాడలేక.. ఊపిరి పోసుకుంటున్న నారుమళ్లకు నీరుపెట్టలేక రైతన్న కన్నీటిమయమవుతున్నారు. జిల్లాలో 6.83 లక్షల వాణిజ్య, గృహ వినియోగదారులున్నారు. వీరితోపాటు పరిశ్రమలు, వ్యవసాయ వినియోగ కనెక్షన్లు ఉన్నాయి.
వీటికి విద్యుత్ సరఫరా కోసం పట్టణ ప్రాంతంలో 77 ఫీడర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 613, 135 మిశ్రమ, 96 ఎక్స్‌ప్రెస్, 28 డెడికేటెడ్ ఫీడర్లు కలిసి మొత్తం 949 ఫీడర్లు ఉన్నాయి. వీటిద్వారా రోజుకు 563.27 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా కావాలి. కాని వర్షపు జాడలేక జల విద్యుత్ కేంద్రాలు వట్టి పోతున్నాయి. బొగ్గు ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఘననీయంగా తగ్గుముఖం పట్టింది. దీంతో రోజుకు 422.16 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రం సరఫరా అవుతోంది.
రైతన్నల గోడు..
జిల్లాలో 2.21.296 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా, 6.50 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా కావాల్సి ఉంది. కాని ఆరు మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుండటంతో రోజుకు 6 గంటలు కూడా వ్యవసాయ విద్యుత్ సరఫరా కావడం లేదు. అదికూడా రెండు విడతల్లో ఇస్తున్నారు.
మధ్యలో అంతరాయం ఏర్పడితే తిరిగి విద్యుత్ సరఫరా చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా వర్షపు చుక్క జాడలేక పోవడంతో బోర్లున్న చోట్ల రైతులు వరి తుకాలు పోశారు. అయితే తుకాలు బతికించుకునేందుకు కూడా నీరు సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదే సమయంలో ఎండలు మండుతుండటంతో ఇళ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వేస్తేగాని ఉండలేని పరిస్థితి నెలకొంది. అయితే కరెంట్ మాత్రం ఎప్పుడు పోతుందో..ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. మెదక్ పట్టణంలో 15 రోజులుగా కరెంట్ కోతలు మరీ దారుణంగా మారాయి. ఒక్కోసారి సుమారు 3 నుంచి 4 గంటల పాటు కోతలు విధిస్తున్నారు.
దీంతో జనాలు నిద్రకు దూరమై ఆరుబయటే జాగరణ చేస్తున్నారు. వ్యాపారులు, కరెంట్‌పై ఆధారపడి జీవనం సాగించే జిరాక్స్ సెంటర్లు, గిర్నీలు, ఇంటర్‌నెట్ సెంటర్లు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ దుకాణాదారులు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కరెంట్ కోతల వల్ల వ్యాపారులు దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.