క‘న్నీటి’కష్టాలకు చెక్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యుత్ సరఫరాలో తరుచూ ఏర్పడుతున్న అంతరాయంతో మంచినీటి పథకాల పంపింగ్ జరగడం లేదు. దీంతో విజయన గరం పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేయలేకపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఎన్ని ప్రభుత్వాలొచ్చినా, ఎంతమంది అధికారులొచ్చినా ఈ సమస్య పునరావృతమవుతూనే ఉంది. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడా సమస్యకు ప్రస్తుత మున్సిపల్ అధికారులు పరిష్కారం కనుగొ న్నారు. మంచినీటి పథకాలు ఉన్న చోట జనరేటర్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో నీటి కష్టాలకు ఫుల్‌స్టాప్ పడే అవకాశం ఉంది. పెరిగిన జనాభాకు తగ్గట్టుగా పట్టణ ప్రాంతాల్లో నీటి పథకాలు పెరగడం లేదు. ఉన్న కొద్దిపాటి పథకాలతో కాలం వెళ్లదీస్తుండడంతో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. దీనికితోడు విద్యుత్ అంతరాయం మరింత పట్టిపీడిస్తోంది.
విద్యుత్ కోతల కారణంగా మంచినీటి పథకాల పంపింగ్ జరగకపోవ డంతో కనీస స్థాయిలో తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నారు. ఒక్క విజయనగరం పట్టణాన్నే తీసుకుంటే ఇక్కడున్న దాదాపు 3లక్షల మేర జనాభాకు 17మిలియన్ లీటర్ల తాగునీరు అవసరం కాగా, ప్రస్తుతం 12 మిలియన్ లీటర్ల నీరును సరఫరా చేసే పథకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో రెండు రోజుల కొకసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ పథకాలు కూడా పనిచేయకపోతే అంతే సంగతులు. విజయనగరం పట్టణానికి తాగునీరందించే పథకాలు ముషిడిపల్లి, నెల్లిమర్ల, రామతీర్థంలో ఉన్నాయి. విద్యుత్ కోతలతో ఆయా పథకాల పంపింగ్ సరిగ్గా జరగడం లేదు. ఫలితంగా నీటిని సమకూర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కొక్కసారి రెండు మూడు రోజులైనా సరఫరా చేయలేని పరిస్థితి. అయితే, ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ సోమన్నారాయణ జీవీఎంసీలో పని చేసిన అనుభవంతో సమస్య పరిష్కారంపై దృష్టి సారించారు. విద్యుత్ కోతలను అధిగమించాలంటే జనరేటర్ల ఏర్పాటు ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గమని గుర్తించారు.
ఈమేరకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద జనరేటర్లు మంజూరు చేయాలని, లేకపోతే పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేయలేమన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన ఉన్నతాధికారులు విజయనగరం మున్సిపాల్టీలోని మంచినీటి పథకాలకు జనరేటర్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఒక్కొక్కటి రూ.15 లక్షలు విలువైన నాలుగు జనరేటర్లను మంజూరు చేశారు. నెల్లిమర్లలోని మాస్టర్ పంపు హౌస్‌కు ఒకటి, నెల్లిమర్ల వాటర్ వర్క్స్ ఒకటి, రామతీర్థం మంచినీటి పథకానికి ఒకటి, ముషిడిపల్లి మంచినీటి పథకానికి ఒకటి చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల్లో ఇవి రానున్నాయి. అవి మున్సిపాల్టీకొచ్చినట్టయితే విద్యుత్ కోతలతో సంబంధం లేకుండా పంపింగ్ చేసి పట్టణ ప్రజలకు తాగునీరందించేందుకు అవకాశం ఉంటుంది. ఇదే తరహాలో మిగతా మున్సిపాల్టీల్లోనూ, మేజర్ పంచాయతీల్లోనూ జనరేటర్లను ఏర్పాటు చేయగలిగితే తాగునీటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.