అధికారమా.. మజాకా! | power magic | Sakshi
Sakshi News home page

అధికారమా.. మజాకా!

Published Wed, Jun 24 2015 3:07 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

అధికారమా.. మజాకా! - Sakshi

అధికారమా.. మజాకా!

సాక్షి ప్రతినిధి, కడప : ‘వడ్డించేవారు మనోళ్లైతే కడబంతి అయితేనేం’ అన్నట్లు రేషన్ డీలర్ల నియామకం సాగుతోంది. యర్రగుంట్ల మండలంలో 27 చౌక దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అన్ని దుకాణాటూ టీడీపీ మద్దతుదారులకే దక్కాయి. రెవిన్యూ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చల్లనిచూపు కారణంగానే డీలర్‌షిప్ దక్కించుకున్నట్లు తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కిందని, డబ్బులు పోయినా డీలర్ నియామకం సాధించామని గర్వంగా వెల్లడిస్తున్నారు.     యర్రగుంట్ల మండలంలో మొత్తం 37 ప్రభుత్వ చౌక దుకాణాలు ఉన్నాయి.

వీటిలో 27 దుకాణాలకు గాను మే నెల 5న నోటీఫికేషన్ జారీ చేశారు. అదే నెల 22న కడప ఆర్డీఓ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో సుమారు 71 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించామని అప్పట్లో రెవిన్యూ అధికారులు ప్రకటించారు. అయితే ఏకపక్షంగా 27 దుకాణాలు టీడీపీ మద్దతుదారులకు దక్కడంతో అనుమానాలు వెల్లువెత్తాయి. అత్యున్నత అర్హత కలిగిన అభ్యర్థులు పరీక్ష రాసినా మొత్తం దుకాణాలు ఆ పార్టీ మద్దతుదారులకే ఎలా దక్కాయనే విషయంపై జోరుగా చర్చ సాగుతోంది.  

 ఉన్నతాధికారి సహకారం
 అధికార పార్టీ హోదా ఓవైపు, చేతి నిండా సొమ్ము మరోవైపు ఎరగా చూపెట్టడంతో రెవిన్యూ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు పక్కాగా తెరవెనుక సహకారం అందించారు. ఫలితంగా నోటిఫికేషన్‌లో పేర్కొన్న 27 దుకాణాలు టీడీపీ వర్గీయులు సొంతం చేసుకున్నారు. రాతపరీక్షకు ముందురోజు ప్రశ్నాపత్రం ఫొటోను పోట్లదుర్తికి చెందిన దేశం నేతకు స్వయంగా ఉన్నతాధికారి అందజేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా లక్షలాది రూపాయల ముడుపులు అందించినట్లు ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

27 మంది అభ్యర్థులను ముందే నిర్ణయించుకుని వారి నుంచి బిసీ నేతగా గుర్తింపు పొందిన పొరుగు మండల వాసి, యర్రగుంట్లలో స్థిరపడిన ఓ వ్యక్తి ద్వారా ముడుపులు సేకరించినట్లు సమాచారం. అలా ఒప్పందం చేసుకున్న వారికి మాత్రమే ప్రశ్నాపత్రం ప్రతిని అందించినట్లు తెలుస్తోంది. ఇలా తెరవెనుక వ్యూహాత్మకంగా వ్యహరించడంతోనే విజయం సాధించామని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇటీవల కాలంలో ప్రతిపనికి ఓ రేటు నిర్ణయించి వ్యవహారాన్ని చక్కబెట్టుతున్న రెవిన్యూ అధికారి కారణంగానే ఇది సాధ్యమైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement