రేపల్లెలో ‘భూ’పాలుడు!
‘ముఖ్య’నేత తరఫున మడ భూములను మడతేశాడు
రూ.వందల కోట్ల భూమి హాంఫట్
- గుంటూరుజిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యే చేతివాటం
- సంపూర్ణంగా సహకరించిన రెవెన్యూ యంత్రాంగం
- 508 ఎకరాల సర్కారు భూమి ప్రైవేటు వ్యక్తుల పరం
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ భూములంటే ప్రజల ఆస్తి. వాటిని జాగ్రత్తగా కాపాడాల్సిన ప్రభుత్వం రికార్డులను తారుమారు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుంటే ఏమనాలి? కంచే చేను మేస్తుంటే కాపాడేవారెవరు? అధికారపార్టీ నాయకుల చేతివాటానికి అడ్డూఅదుపూ ఉండడం లేదు. కనిపించిన భూమినల్లా కాజేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు వారికి అండగా నిలుస్తూ ఈ దారుణాలకు తమవంతు సాయం చేస్తున్నారు. గుంటూరుజిల్లా తీర ప్రాంతంలోని ప్రభుత్వ భూముల వ్యవహారం చూస్తే అధికారపార్టీ నాయకులు ఎంత బరితెగిస్తున్నారో అర్ధమౌతుంది.
రికార్డులను తారుమారు చేశారు.. నిబంధనలకు విరుద్ధంగా సర్వే నంబర్లను సబ్ డివిజన్ చేశారు. 313 ఎకరాలను హాంఫట్ చేసేశారు. అదేగాక సర్వే నెంబర్ల కొత్త ఫార్మాట్ పేరిట మరో 195 ఎకరాలను సొంతం చేసేసుకున్నారు. మొత్తం 508 ఎకరాలను స్వాహా చేశారు. వీటి విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుంది. వీటితో పాటు తీర ప్రాంతానికి రక్షా కవచంలా ఉండే మడ అడవులనూ తెగనరికేస్తూ నేలను చదునుచేస్తూ భూమిని మింగేస్తున్నారు. రేపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఈ భూ కుంభకోణానికి సూత్రధారి అని వినిపిస్తోంది. పాత్రధారులంతా ఆయన అనుచరులు, అనుయాయులే. వీరికి రెవెన్యూ యంత్రాంగం యథాశక్తి సహకరించి ప్రభుత్వ భూములను ప్రయివేటు పరం చేసేసింది. ఆ వివరాలు మీకోసం...
విభజించు...కొల్లగొట్టు
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో సర్వే నంబర్ 875లో 416.26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఒకప్పుడు ఈ భూమిని వాన్‌పిక్ ప్రాజెక్టుకు కేటాయించేందుకు ప్రభుత్వం గుర్తించింది. కానీ ఆ ప్రాజెక్టుకు ఇంకా కేటాయించలేదు. ప్రభుత్వ అధీనంలోనే ఉంది. అందువల్ల ఆ భూముల క్రయవిక్రయాలు జరపకూడదని ఉత్తర్వులు కూడా జారీ చేసింది. క్రయవిక్రయాలు నిషేధించిన భూముల జాబితా వివరాలతో 2016లో విడుదల చేసిన 22ఏ రికార్డుల్లో ఈ విషయాన్ని పేర్కొంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ అధికారులు సర్వే నంబర్ 875ను ఎనిమిది సబ్ డివిజన్లుగా విభజించేశారు.
అందులో సర్వే నంబర్ 875తో 231.54 ఎకరాలను అసెస్సడ్‌వేస్ట్ డ్రై(ఏడబ్లూడీ)గా పేర్కొని ప్రభుత్వ భూమిగా చూపించారు. సబ్ డివిజన్లుగా విభజించిన భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరుతో 1బీ అడంగల్‌లో నమోదు చేశారు. సర్వే నంబర్ 875(1)లో 89.60 ఎకరాలు, 875(2)లో 61 ఎకరాలు , 875(3)లో 57.50 ఎకరాలు, 875(4)లో 52.50 ఎకరాలు, 875(5)లో 30 ఎకరాలు, 875(6)లో 12.50 ఎకరాలు, 875(7)లో 8ఎకరాలు, 875(8)లో 2.50 ఎకరాలు ఉన్నట్లు చూపించారు. అలా 313.60 ఎకరాలు పలువురు ప్రైవేటు వ్యక్తుల అధీనంలో ఉన్నట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. డీకే పట్టా, ఆక్రమణ, అనువంశిక, కొనుగోలు చేయడం తదితర విధాలుగా ఆ భూమి అంతా ప్రైవేటు వ్యక్తులదేనని 1బీ రికార్డుల్లో నమోదు చేశారు. వీరంతా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అనుయాయులే. దానిని బట్టి ఇదో పెద్ద భూ కుంభకోణమని మనకు తేలిగ్గా అర్థమౌతుంది.
అటవీ భూమిని కలిపేసుకునే ఎత్తుగడ..
ఈ భూ మాయ వెనుక మరో పన్నాగం కూడా ఉంది. సర్వే నంబర్ 875లో 416.26 ఎకరాలు ఉన్నట్లుగా 2016 రికార్డుల్లో ఉంది. తాజాగా చూపించిన రికార్డుల్లో 875 సర్వే నంబర్ కింద 231.54 ఎకరాలను అసెస్సడ్‌వేస్ట్ డ్రై(ఏడబ్లూడీ)గా ప్రభుత్వ భూమిగా చూపించారు. ఇక ఎనిమిది సబ్ డివిజన్ల కింద 313.60 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల అధీనంలో ఉన్నట్లుగా లెక్కతేల్చారు. ఈ రెండు కలిపితే మొత్తం 545.14 ఎకరాలు అవుతున్నాయి. అంటే 128.88 ఎకరాలు అధికంగా చూపించారు. ఆ భూముల సమీపంలో ఉన్న అటవీ భూమిని కూడా కలిపేసుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారు. ఇప్పటికే తీరప్రాంతానికి సమీపంలో ఉన్న మడ అడవులను నరికివేస్తూ భూమిని కలిపేసుకుంటున్నారు. ఆ విధంగా సర్వే నంబర్ 875 సబ్ డివిజన్ల ముసుగులో మొత్తం 313.60 ఎకరాలు కొల్లగొట్టేందుకు పక్కాగా పన్నాగం పన్నారు. ఆ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ దాదాపు రూ.20 లక్షలపైనే పలుకుతోంది.
కొత్త ఫార్మాట్‌తో 195 ఎకరాలు హాంఫట్
సర్వే నంబర్ 874లో మరో 195 ఎకరాలు హాంఫట్ చేశారు. 2011లో రెవెన్యూ అధికారులు విడుదల చేసిన 22ఏ( ప్రొహిబిటెడ్ ప్రోపర్టీస్) రికార్డుల్లో సర్వే నంబర్ 874తో 422.84 ఎకరాలను ప్రభుత్వభూమి (మందబైలు పోరంబోకు) గా పేర్కొన్నారు. కానీ 2016లో విడుదల చేసిన 22ఏ (ప్రొహిబిటెడ్ ప్రోపర్టీస్) రికార్డుల్లో సర్వే నంబర్ 874 కింద 227.84 ఎకరాలే ఉన్నట్లు చూపిస్తూ ఆ భూమిని వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం గుర్తించినట్లు నమోదు చేశారు. మరి ఆ సర్వే నంబర్‌లోని మిగిలిన 195 ఎకరాలు ఏమయ్యాయి...!? ఇక్కడే ఉంది అసలు మాయ. ఇటీవల పాత సర్వే నంబర్ల స్థానంలో కొత్తవి అమలులోకి తీసుకువచ్చారు. నిబంధనల ప్రకారం సర్వే నంబర్లు మార్చాలంటే ఓ కమిటీని నియమించి నిర్ణయించాల్సి ఉంటుంది.
కానీ కమిటీ లేకుండానే అధికారులు 874 సర్వే నంబర్‌ను కొత్త ఫార్మాట్ పేరిట 1126, 1128, 1129, 1132 తదితర నంబర్లుగా విభజించారు. ఆ పేరుతో 195 ఎకరాల ప్రభుత్వ భూమిని రికార్డుల నుంచి గల్లంతు చేశారు. ఆ భూమిని పట్టాభూమిగా, ఆక్రమణ భూమిగా చిత్రీకరిస్తూ అధికార పార్టీ నేతల బినామీల పేరిట నమోదు చేస్తూ కంప్యూటర్ 1బీ అడంగల్‌లో పేర్కొన్నారు. ఆ భూమి విలువ రూ.39కోట్లు. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ ఇంకా ఎక్కువే.
అందరూ ఎమ్మెల్యే సన్నిహితులే..
ప్రభుత్వ భూములను తమపేరుతో 1బీ అడంగల్‌లో నమోదు చేసుకున్నవారం తా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ సన్నిహితులే కావడం గమనార్హం. ఆయన కు అత్యంత సన్నిహితుడు, కూచిన పూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ పంతాని మురళీధరరావు కుటుంబసభ్యుల పేరుతో పలు సర్వే నంబర్ల భూములను నమోదు చేశారు. ఆయన కుమారులు, కోడళ్లతోపా టు సమీప బంధువుల పేర్లు ఉన్నాయి. ఎమ్మెల్యే సత్య ప్రసాద్‌కు సన్నిహితుడైన నగరం ఎస్‌వీ ఆర్‌ఎం కళాశాల రిటైర్డ్ ప్రిన్సి పాల్, ప్రస్తుత డైరెక్టర్ కేసన సురేంద్రబాబు కుటుంబ సభ్యులకు కూడా కొన్ని భూము లపై హక్కు కల్పించారు. ఆ జాబితాలో సురేంద్రబాబు సోదరుడు, ఏపీఐఐసీలో డీఈగా విశాఖపట్నంలో పనిచేస్తున్న సత్యదేవ ప్రసాద్ కుటుంబసభ్యుల పేర్లు కూడా ఉండడం గమనార్హం. వాస్తవానికి వీరంతా టీడీపీ ప్రజాప్రతినిధికి బినామీలుగానే ఈ భూములు పొందారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.