కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్ : విద్యుత్ ఉద్యోగులు ఐకాస ఆధ్వర్యంలో 72 గంటల సమ్మెలోకి వెళ్లడంతో జిల్లాలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం సీమాంధ్ర జేఏసీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద విద్యుత్ ఐకాస నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది నిరసన తెలిపారు. శంకరాపురం పవర్‌హౌస్‌లో విభజనను నిరసిస్తూ నినాదాలు చేశారు.
విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా ఆసుపత్రులకు, నీటి సరఫరాకు చాలా ప్రాంతాల్లో అవాంతరాలు సంభవించాయి. కడప నగరంలోని శంకరాపురంలో ఉన్న పవర్ స్టేషన్ ట్రిప్ అయింది. దీంతో విద్యుత్ సరఫరా దాదాపు కొన్ని గంటల పాటు పునరుద్ధరణకు నోచుకోలేదు. ప్రొద్దుటూరులోని ఆటోనగర్ విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ఆ ప్రాంత పరిధిలో ఆంధకారం నెలకొన్నట్లు కాంట్రాక్టు ఉద్యోగులు తెలిపారు.
అలాగే సంబేపల్లె మండలంలో వర్షానికి విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో దాదాపు 10 గ్రామాల్లో అంధకారం నెలకొంది. చిట్వేలి మండలంలోని మూడు సబ్‌స్టేషన్లలోని ట్రాన్స్‌మీటర్లు మొరాయించడంతో 15 గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. ట్రిపుల్ ఐటీఐ పరిధిలోని సబ్‌స్టేషన్‌ట్రిప్ కావడంతో ఆ పరిధిలోని 3 గ్రామాలు చీకట్లో ఉండిపోయాయి. గోపవరం మండలంలోని 20 గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. రెగ్యులర్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో కాంట్రాక్టు ఉద్యోగులు సమస్యలు ఉత్పన్నమవుతున్న ప్రాంతాలను గుర్తించలేక పోతున్నారు.
రూ.. 2.30 కోట్ల బిల్లు వసూళ్లకు గండి
విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మెకు వెళ్లడంతో జిల్లాలో విద్యుత్ బిల్లుల వసూళ్లు ఆగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా బిల్లుల వసూలు కేంద్రాలు 22 ఉన్నాయి. ప్రతి రోజు రూ.1.15 కోట్ల బిల్లులు వసూళ్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. విద్యుత్ బిల్లు వసూళ్ల సిబ్బంది రెండు రోజులుగా సమ్మెలోకి పోవడంతో రూ.2.30 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి గండి పడినట్లయింది.
జిల్లా పరిశీలనకు వచ్చిన తిరుపతి సర్కిల్ సీఈ రాంసింగ్
విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో పాటు సంస్థ ఇచ్చిన సిమ్ కార్డులను ఎస్‌ఈకి అప్పగించారు. జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు తిరుపతి డిస్కం సర్కిల్ చీఫ్ ఇంజనీర్ రాంసింగ్ రెండు రోజులుగా పరిశీలన చేస్తున్నారు. అన్ని సబ్‌స్టేషన్లను పరిశీలిస్తూ ఏయే ప్రాంతాలలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో కాంట్రాక్టు ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. చిన్నచిన్న అంతరాయాలకు ఎలాగోలా మరమ్మత్తులు చేస్తామని, పెద్ద సమస్యలు పరిష్కరించడం తమవల్ల కాదని పలు ప్రాంతాల కాంట్రాక్టు ఉద్యోగులు సీఈకి వివరించినట్లు సమాచారం.
సమ్మె షాక్
Published Sat, Sep 14 2013 3:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement
Advertisement