ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కే పవర్
-
పోలీసు పోస్టింగ్‌లు, బదిలీలుగవర్నర్ చేతికి..
-
విభజన చట్టంలో సవరణకు కేంద్రం ముసాయిదా బిల్లు
-
ఇరు రాష్ట్రాల సీఎస్‌లు,డీజీపీలతో ప్రత్యేక బోర్డుఏర్పాటుకు ప్రతిపాదన
-
తీవ్రంగా వ్యతిరేకిస్తూ తిప్పి పంపిన తెలంగాణ సర్కారు
-
రాష్ర్ట హక్కులను కాలరాయడమేనని మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టేందుకు కేంద్రం ఓ ముసాయిదా బిల్లును రూపొందించింది. హైదరాబాద్‌లో పోలీసులపై ఆయనకే పెత్తనం అప్పగించాలని.. వారి పోస్టింగ్‌లు, బదిలీల బాధ్యతలు ఆయనకే ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ముసాయిదా ప్రతిని తెలంగాణ సర్కారు తిప్పి పంపింది. పోలీసులపై గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తూ కేంద్రానికి ఘాటుగా లేఖ రాసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇప్పటికే లేఖను కేంద్ర హోంశాఖకు పంపినట్లు తెలిసింది.
ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల సమస్య వచ్చినప్పుడు, హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య ఏదేని విషయంలో తీవ్ర విభేదాలు తలెత్తినప్పుడు మాత్రమే గవర్నర్ జోక్యం చేసుకుని ఆ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విభజన చట్టంలోని సెక్షన్ 8 సూచిస్తోందని ఆ లేఖలో స్పష్టం చేశారు. పాలనాపరమైన నిర్ణయాలు, శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసుల సంక్షేమం, పోలీసు శాఖ ఆధునీకరణ తదితర బాధ్యతలన్నీ తెలంగాణ ప్రభుత్వానివేనని తేల్చి చెప్పారు. విభజన చట్టానికి మార్పులు చేస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సిన కనీస అధికారాల్లో పోలీసుల బదిలీలు, పోస్టింగ్‌లు కూడా ఉన్నాయని, రాష్ర్ట హక్కులను కాలరాసే విధంగా చట్ట సవరణకు సిద్ధమవడం అన్యాయమని ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను గవర్నర్ గౌరవించాలని, హైదరాబాద్ పోలీసు వ్యవస్థపై గవర్నర్‌కు అధికారులు కల్పించాలని విభ జన చట్టంలో ఎక్కడా లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇందుకోసం కొత్తగా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాయి. ఉమ్మడి రాజధానిలో తన విధులేమిటో తెలుసుకునేందుకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ గతంలో కేంద్రానికి లేఖ రాసిన నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ ఈ ముసాయిదాను రూపొందించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించేందుకు వీలుగా విభజన చట్టంలోని సెక్షన్ 8కు సవరణలు చేస్తూ ముసాయిదా బిల్లును రూపొందించి రాష్ట్రానికి పంపింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కూడిన కామన్ పోలీస్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా అందులో పేర్కొన్నట్లు సమాచారం.
దీన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆదివార ం టీఆర్‌ఎస్ ఎంపీలతో క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలోనూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టే ముసాయిదా బిల్లును పార్లమెంట్‌లో తీవ్రంగా వ్యతిరేకించాలని, దాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో నగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న అనురాగ్ శర్మను తెలంగాణ డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. తర్వాత నగర కమిషనర్‌గా అదనపు డీజీ ఎం.మహేందర్‌రెడ్డిని తెలంగాణ సర్కారు నియమించింది. ఇక అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, డీసీపీల్లోనూ ఒకరిద్దరు మినహా అంతా పాత వారే కొనసాగుతున్నారు.