రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం అట్టహాసంగా ప్రవేశపెట్టిన ‘వంద రోజుల ప్రణాళిక’ ఆచరణలో ‘ప్రగతి' చూపలేక పోయింది. ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రారంభమై ఈనెల 15తో ముగిసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం పెద్ద పీట వేసిన పారిశుద్ధ్య కార్యక్రమం సైతం అమలుకు నోచలేదు. ఫలితంగా పల్లెలు అపరిశుభ్రవాతావరణంలో అలమటిస్తున్నాయి. నిధులివ్వని ఈ తరహా కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో విఫలమవుతాయని సాక్షాత్తూ గ్రామ సర్పంచ్‌లే స్పష్టం చేస్తున్నారు.
సత్తెనపల్లి: దోమలు పెరగకుండా, రోగాలు ప్రబల కుండా పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టడంతోపాటు ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం పల్లెలవైపు చూడడం లేదని గ్రామీణులు గగ్గోలు పెడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ‘వంద రోజుల ప్రణాళిక’ పేరిట గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు పెద్ద పీట వేసినా ఆచరణలో ప్రగతి చూపలేదంటున్నారు. మరో వైపు నిధులు ఇవ్వకుండా పంచాయతీల్లో పనులు ఎలా చేపట్టాలని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు.
ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు ఉన్న కొద్దిపాటి నిధులు ఖర్చు అయ్యాయని, కొత్త పథకాల అమలు భారమేనని అంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఏగ్రామం చూసినా అపరిశుభ్రంగానే దర్శనమిస్తోంది. దోమలు పెరిగి వ్యాధుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 57 మండలాలు 1,011 పంచాయతీలు. వీటిలో 112 మేజరు, 899 మైనర్ పంచాయతీలు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరగక ముందు రెండేళ్లపాటు ప్రత్యేక అధికారుల ఏలుబడిలో సమస్యలు పేరుకుపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో గ్రామాలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయి.
గత ఏడాది పంచాయతీ ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు పగ్గాలు చేపట్టాయి. అనంతరం విడుదలైన సాధారణ నిధులతో సర్పంచ్‌లు గ్రామాల్లో తాగునీరు, వీధి దీపాల ఏర్పాటు, చెత్త కుప్పల తొలగింపు, సైడు కాలువలు శుభ్రం చేయించడం, బోర్ల మరమ్మతులు, కాలువల్లో పూడిక తీత పనులను అరకొరగానే చేయించగలిగారు.
అమలు కాని ‘వంద రోజుల ప్రణాళిక’ ...
కొత్త ప్రభుత్వం చేపట్టిన ‘వంద రోజుల ప్రణాళిక’ కార్యక్రమం నిధులు లేక నీరసించింది.
గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, ఇతర మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ‘వంద రోజుల ప్రణాళిక’ను నిర్ధేశించింది. ఇందులో పారిశుద్ధ్యానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చింది.
ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభమైన వంద రోజుల ప్రణాళిక ఈనెల 15తో ముగిసింది. కొన్ని గ్రామాల్లో కాలువల్లో పూడిక తొలగించి చేతులు దులుపుకున్నారు. చాలా పల్లెల్లో వంద రోజుల ప్రణాళిక ఊసే లేదు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంద రోజుల ప్రణాళికతో గ్రామాల్లో ఏమాత్రం ప్రగతి కనిపించలేదని పేర్కొంటున్నారు.
కొత్త పథకాలే భారం... వంద రోజుల ప్రణాళికలో గ్రామసభల ఏర్పాటు, స్వచ్ఛ భారత్, జన్మభూమి-మా ఊరు, పారిశుద్ధ్యం, నీటి ట్యా ంకుల పరిశుభ్రత వంటి పనులు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తేవాలని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల సర్పంచ్‌లు తమ సొంత నిధులతో చిన్న చిన్న పనులు చేయగా, మరికొందరు తామేమీ చేయలేమని వదిలేశారు.
ప్రగతీలేదు..‘ప్రణాళిక'లేదు
Published Tue, Nov 18 2014 1:46 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM
Advertisement
Advertisement