మూగబోయిన ఆలమూరు | prahladudu family members are in concern | Sakshi
Sakshi News home page

మూగబోయిన ఆలమూరు

Published Sun, Aug 17 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

మూగబోయిన ఆలమూరు

మూగబోయిన ఆలమూరు

రుద్రవరం: ‘హైదరాబాద్‌లో ఉద్యోగం చూసుకుంటా. మీకు ఏ లోటు లేకుండా కళ్లలో పెట్టుకుంటా’నని వెళ్లిన ఒక్కగానొక్క కుమారుడు ఇక లేడంటే ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు నెలల క్రితం తమ కనుల పంట నదిలో గల్లంతయ్యాడని తెలిసి ఏడ్చి ఏడ్చి వారి కళ్లలో నీరింకిపోయింది. కడసారి చూపునకైనా నోచుకుంటామో లేదోననే ఆ వృద్ధ దంపతులను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. ఎట్టకేలకు మృతదేహం లభించగా.. శనివారం అధికారులు స్వగ్రామమైన ఆలమూరుకు చేర్చారు.
 
రెండు నెలల మౌనం వీడి ఒక్కసారిగా కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. తల్లిదండ్రులు సహా గ్రామస్తుల్లో విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పెద్దనాగిశెట్టి, లక్ష్మీనర్సమ్మల కుమారుడైన ప్రహ్లాదుడు(23) గత జూన్ 3వ తేదీన చిరుద్యోగం కోసం హైదరాబాద్‌లోని మేన మామ వరసైన మురళి వద్దకు చేరుకున్నాడు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న ఆయన విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్తూ ప్రహ్లాదుడిని వెంటపెట్టుకుని వెళ్లాడు. హిమాచల్‌ప్రదేశ్‌లోని దిండి జిల్లాలో ఉన్న బియాస్ నది వద్ద జూన్ 8న విద్యార్థులంతా ఫొటోలు దిగుతుండగా నదిలోకి అకస్మాత్తుగా నీరు విడుదల చేయడంతో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. వారిని అప్రమత్తం చేయబోయి ప్రహ్లాదుడు కూడా నీటిలో కొట్టుకుపోయాడు.
 
ఘటనలో 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు సైతం గల్లంతవడం తెలిసిందే. విస్తృత గాలింపు అనంతరం ప్రహ్లాదుడి మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రులకు నిర్వహించిన డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా మృతదేహం గుర్తించిన అధికారులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. శనివారం రాత్రి ప్రహ్లాదుడి మృతదేహం ఆలమూరుకు చేరుకుంది. రుద్రవరం తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్యామసుందర్‌రెడ్డి, టీడీపీ నేత బ్రిజేంద్రారెడ్డి మృతుని తల్లిదండ్రులను ఓదార్చారు. ఇదివరకే ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రహ్లాదుడి తల్లిదండ్రులకు త్వరలోనే అందిస్తామని తహశీల్దార్ తెలిపారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement