
కడపలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
మూడు రాజధానుల నినాదం రాష్ట్రమంతటా మార్మోగింది. పాలన, అధికార వికేంద్రీకరణ ఉపయోగాలను చాటుతూ ప్రజా చైతన్య సదస్సులు, రౌండ్‌టేబుల్ సమావేశాలు జరిగాయి. పలుచోట్ల చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. మూడు రాజధానులకు మోకాలడ్డుతూ చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతంపై వివిధ వర్గాల ప్రజలు విరుచుకుపడ్డారు.
– సాక్షి నెట్‌వర్క్
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి పాలన, అధికార వికేంద్రీకరణతో సాధ్యమని ఎలుగెత్తుతూ కడపలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. వివిధ సంఘాల ప్రతినిధులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఒకే రాజధాని అమరావతి అంటూ చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతంపై మేధావులు, ప్రజాస్వామ్య వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి, తణుకు, తాడేపల్లిగూడెంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇదే జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు తప్పనిసరి అని ముక్తకంఠంతో నినదించారు.
అనంతపురంలోని కలెక్టరేట్ ఎదుట బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాచైతన్య సదస్సులో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ అధికార, పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్‌గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి లెక్కల రాజశేఖర్‌రెడ్డి, యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.ఓబుల్ రెడ్డి వికేంద్రీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వికేంద్రీకరణ కోరుతూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి, సోంపేట, ఆముదాలవలసలో రిలే దీక్షలు కొనసాగాయి. వివిధ సంఘాల నేతలు కలెక్టర్ జె.నివాస్‌ను కలిసి ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment