
ఎవరెస్ట్ శిఖరంపై త్రివర్ణ పతాకంతో హిమాంషా , ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్న హిమాంషా
ఒంగోలు కల్చరల్: ‘లే..గమ్యాన్ని చేరుకునే వరకూ విశ్రమించవద్దు’ స్వామి వివేకానంద మహితోక్తులు ఒంగోలుకు చెందిన డిగ్రీ విద్యార్థి షేక్ హిమాంషాపై విశేష ప్రభావం చూపాయి. ఎవరికీ అందకుండా ఠీవిగా నిలబడి అంబర చుంబనం చేస్తున్న మౌంట్ ఎవరెస్ట్ మెడలు వంచాలనే ఆలోచన ఆ నవ యువకునిలో ఉదయించింది. అందుకు ప్రభుత్వ చేయూత, జిల్లా స్టెప్ అధికారుల ప్రోత్సాహం తోడైంది. అనేక వడపోతల తరువాత 40మందినుండి ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు కేవలం అయిదుగురిని ఎంపికచేసారు.
కొన్ని నెలల కఠోర శిక్షణ తరువాత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అర్ధరాత్రి ప్రపంచం గాఢ నిద్రలో జోగుతున్న వేళ హిమాంషా కన్ను పొడుచుకున్నా కానరాని నిశీధిలో జాతీయ పతాకాన్ని ఎవరెస్ట్ శిఖరంపై ఎగురవేసి భారతావని పులకించేలా, గర్వించేలా చేశాడు. దారిపొడుగునా భయపెట్టే శవాలను, అకస్మాత్తుగా సంభవించే వాతావరణ మార్పులను పట్టించుకోకుండా లక్ష్యం వైపే పురోగమించి ఆత్మ విశ్వాసంలో యువతకు ఆదర్శంగా నిలిచాడు. కరాటేతోపాటు ఇతర ఆటల్లోనూ హిమాంషాకు ఆసక్తి ఉంది. పలు అవార్డులు కూడా సాధించి తన సత్తా చాటాడు.
ఒంగోలు బిడ్డ..
మస్తాన్, మస్తాన్‌బీ దంపతుల రెండో కుమారుడు హిమాంషా. మస్తాన్ తొలుత ఒంగోలుకు సమీపంలోని ఉలిచిలో నివాసం ఉంటూ బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు. మరింత మేలైన ఉపాధి కోసం ఆయన తన కుటుంబంతో 1991లో ఒంగోలుకు చేరుకున్నారు. హిమాంషా 10వ తరగతి దామోదర స్కూల్లో, ఇంటర్ ఉమామహేశ్వర కళాశాలలో, స్థానిక శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదివాడు.
కరాటేలో ప్రావీణ్యం
చదువుతోపాటు కరాటే, కుంగ్ ఫూపై కూడా హిమాంషా దృష్టి సారించాడు. కుబియా నాయక్ వద్ద కరాటేలో శిక్షణ పొందాడు. కరాటేలో 2012లో జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్ సాధించాడు. కుంగ్ ఫూలో జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. 2016లో ఎన్‌సీసీ ‘సి’ సర్టిఫికెట్ సాధించాడు. దానితోపాటు కబడ్డీ టీం కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. క్రీడాంశాలతోపాటు మనసును కదిలించే సంగీతమన్నా హిమాంషాకు మక్కువ ఎక్కువ.
స్టెప్ ప్రకటనే ప్రేరేపణ
ఎవరెస్ట్ శిఖరం అధిరోహణకు యువత దరఖాస్తు చేసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వ విభాగమైన స్టెప్ 2017 నవంబర్ నెలలో హిందూ దినపత్రికలో ఇచ్చిన ప్రకటన హిమాంషాను ఆకర్షించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎలాగైనా అధిరోహించి తీరాలనే ఆశయంతో మాంషా దరఖాస్తు చేశాడు. రన్నింగ్, జంపింగ్, హైజంప్, లాంగ్‌జంప్ తదితర అంశాల్లో ప్రతిభ చూపి జిల్లా స్థాయి పోటీల్లో ఎన్నికయ్యాడు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా హిమాంషా ఎంపికయ్యాడు. మొత్తం 40 మందిని అధికారులు ఎంపిక చేయగా హిమాంషా వారిలో ఒకడు. సిక్కిం, డార్జిలింగ్‌లో శిక్షణ ఇచ్చారు.
శిక్షణానంతరం 40 మంది బృందంలో 20 మందికి అవకాశం కల్పించారు. ఈ ఏడాది జనవరిలో పహల్గాంలోని జవహర్‌లాల్ నెహ్రూ పర్వతారోహణ శిక్షణ సంస్థలో మరిన్ని మెళకువలు నేర్పించారు. శారీరక, మానసిక దారుఢ్యాన్ని ఎలా పెంచుకోవాలో, పర్వతారోహణ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలో హిమాంషా శిక్షణ పొందాడు. కఠోర శిక్షణ అనంతరం కేవలం 10మంది రంగంలో మిగిలగా వారికి ఫిబ్రవరి–మార్చి నెలలో లడఖ్‌లో 15 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. చివరకు 40 మంది బృందంలో హిమాంషాతోపాటు మరో నలుగురు మాత్రమే ఎవరెస్ట్ ఎక్కేందుకు తుది జాబితాలో స్థానం సాధించారు. ఏప్రిల్ 22న బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు.
చైనా వైపు నుంచి..
ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు చైనా వైపు మార్గాన్ని హిమాంషా బృందం ఎంచుకుంది. క్యాంప్ 1లో 6400 మీటర్లు, క్యాంప్ 2లో 7,900 మీటర్లు, క్యాంప్ 3లో 8,300 మీటర్ల ఎత్తుకు హిమాంషా చేరుకున్నాడు. దారిపొడవునా 22కు పైగా పర్వతారోహకుల మృతదేహాలు కనిపించినా హిమాంషా భయపడలేదు.
ఫలించిన కల
అంచెలంచెలుగా ఎవరెస్ట్‌ను అధిరోహించిన హిమాంషా మే 16వ తేదీ రాత్రి 1.55 నిమిషాలకు తన బృందంలోని వారి కన్నా కొన్ని గంటల ముందుగా 8848 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ శిఖరాగ్రాన్ని చేరుకుని మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. 2018 ఎవరెస్ట్ శిఖరారోహణ సీజన్‌లో ఆ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయుడుగా కూడా హిమాంషా రికార్డు సృష్టించాడు. ప్రకాశం జిల్లాలో ఈ ఖ్యాతిని సాధించిన తొలి వ్యక్తి కూడా హిమాంషానే. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విషయాన్ని చైనా ప్రభుత్వం ధ్రువీకరించి సర్టిఫికెట్ అందజేసింది.
అధికారుల అభినందనలు
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన హిమాంషాను యూత్ సర్వీసెస్ చీఫ్ సెక్రటరీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం, కోమలి కిషోర్, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్, రాష్ట్ర అటవీ శాఖా మంత్రి శిద్దా రాఘవరావు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు, ఎంఎల్‌సి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శ్రీ హర్షిణి విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్, ప్రిన్సిపాల్ ఆంజనేయులు, పలు సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు అభినందించారు. ఒంగోలులో హిమాంషా అభినందన ర్యాలీ కూడా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి హిమాంషాను సన్మానించారు.
ఆత్మవిశ్వాసం ముఖ్యం
యువతకు ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఒకరిని గుడ్డిగా అనుసరించడం కాకుండా తాము దేనికి సరిపోతామో యువత నిర్ణయించుకోవాలి. అదే సమయంలో ప్రోత్సాహం కూడా అవసరం. యువతకు సరైన దిశలో ప్రోత్సహిస్తే వారు చాలా అద్భుతాలు సాధించి చూపగలరు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో అతి ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలనేది నా ఆశయం. అలాగే ఆర్మీలో పారా కమాండర్‌గా ఉద్యోగం చేయాలనేది ఆశయం. నేను ఇప్పటి వరకు సాధించినదేమైనా ఉంటే దానికి నా తల్లిదండ్రులైన మస్తాన్, మస్తాన్‌బీ, సోదరుడు అంజావలి, వదిన అనూష కారణం. వారు ప్రతి విషయంలో నన్ను వెన్నుతట్టి ఫ్రోత్సహించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే విషయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. – హిమాంషా