నగరపాలక సంస్థ కమిషనర్‌గా ప్రశాంతి | Prasanthi As Commissioner Of Anantapur Municipal Corporation | Sakshi
Sakshi News home page

నగరపాలక సంస్థ కమిషనర్‌గా ప్రశాంతి

Published Sun, Jun 23 2019 7:34 AM | Last Updated on Sun, Jun 23 2019 7:35 AM

Prasanthi As Commissioner Of Anantapur Municipal Corporation - Sakshi

సాక్షి, అనంతపురం న్యూసిటీ: నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఐఏఎస్‌ ప్రశాంతి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌తో పాటు అహుడా వైస్‌ చైర్‌పర్సన్‌గా కూడా ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఈమె కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేస్తున్నారు. అంతకు ముందు అనంతపురం, హిందూపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(అహుడా) వైస్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.

అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా.. ఏ మాత్రం లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో ఆమెను కర్నూలు కార్పొరేషన్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. కర్నూలులో ఆమె ఐదు నెలలుగా కమిషనర్‌ హోదాలు పని చేస్తున్నారు. ఇదిలాఉంటే ప్రస్తుతం అనంతపురం కమిషనర్‌గా పని చేస్తున్న పీవీవీఎస్‌ మూర్తి ఎక్కడ పోస్టింగ్‌ ఇచ్చారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
 
కర్నూలులో రిలీవ్‌ 
ఐఏఎస్‌ పి.ప్రశాంతి కర్నూలులో శనివారం రిలీవ్‌ అయ్యారు. త్వరలోనే అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పి.ప్రశాంతి పేరు వినగానే కొందరు అధికారులు, సిబ్బందిలో వణుకు పుడుతోంది. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వెళ్లడంతో పాటు అభివృద్ధి విషయంలో రాజీలేకుండా విధులు నిర్వహిస్తారనే పేరున్న అధికారిణి కావడంతో అక్రమార్కులు అప్పుడే ఆలోచనలో పడ్డారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement