
డిపాజిట్లు కోల్పోయారు.. మమ్మల్ని ఎలా విమర్శిస్తారు?
కొరిటెపాడు(గుంటూరు) : సాధారణ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన రఘువీరారెడ్డికి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శనాస్త్రాలు గుప్పించారు. ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అభినందించి సలహాలు, సూచనలు అందించాలే కానీ, అడ్డుకోవటం సరికాదన్నారు. గుంటూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 125 ఏళ్ల చరిత్ర అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటుకూడా గెలవలేదని, దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.
స్వార్ధరాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాని నిర్ధాక్షిణంగా విభజించారని, ప్రజలు తిరస్కరించినా కాంగ్రెస్ నాయకులకు బుద్ధిరాలేదని విమర్శించారు. రాష్ట్రం రూ.16,500 కోట్లు లోటు బడ్జెట్ వున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90 శాతం పూర్తి చేశామని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పెన్షన్ ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అసెంబ్లీలో రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆపరేషన్ నుంచి తప్పించుకోలేవని అన్నారని, అదే ఆపరేషన్ చేశారని పుల్లారావు ఎద్దేవా చేశారు.