కీలక కేడర్‌లో భారీ మార్పులు!
Published Tue, Sep 16 2014 1:39 AM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM
ప్రత్యూష్‌సిన్హా కమిటీ తుది కసరత్తు పూర్తి
తెలంగాణకు ఆంధ్రా సీఎం పేషీ ముఖ్యకార్యదర్శి అజయ్‌సహానీ
ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నుంచి బీపీ ఆచార్య, బీఆర్ మీనాలు
త్వరలో ప్రధానమంత్రికి ఫైలు.. వారంలో జాబితా ప్రకటన!
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత సివిల్ సర్వీసెస్ అధికారుల తుది కేటాయింపు జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 20 మంది అధికారుల కేడర్‌లో మార్పులు, చేర్పులు చేస్తూ ప్రత్యూష్‌సిన్హా కమిటీ తుది జాబితాను ఖరారు చేసినట్లు ఆ కమిటీ వర్గాలు తెలిపాయి. అఖిల భారత అధికారుల కేటాయింపునకు సంబంధించి గత నెల చివరలో ముసాయిదా జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల నుంచి దాదాపు వందకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాలను చైర్మన్ ప్రత్యూష్‌సిన్హా నేతృత్వంలో కమిటీ సోమవారం ఢిల్లీలో సమావేశమై పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐ.వై.ఆర్.కృష్ణారావు, రాజీవ్‌శర్మలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు భేటీ అయిన కమిటీ భారీ మార్పులతో తుది జాబితాను సిద్ధం చేసింది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన అధికారులను తెలంగాణకు కేటాయించడం, 1983 బ్యాచ్ బినయ్‌కుమార్ కేంద్ర సర్వీసును పరిగణనలోకి తీసుకోవద్దని చేసిన విజ్ఞప్తికి ప్రత్యూష్‌సిన్హా పెద్ద పీట వేసినట్లు చెప్తున్నారు. తాత్కాలిక కేటాయింపులో బినయ్‌కుమార్‌ను ఆంధ్రాకు కేటాయించారు. అయితే తెలంగాణకు కేటాయిస్తే భవిష్యత్‌లో సీఎస్ అయ్యే అవకాశం ఉన్నందున బినయ్‌కుమార్ కేంద్ర సర్వీసును పరిగణనలోకి తీసుకోరాదని విజ్ఞప్తిచేశారు. దీంతో పాటు మరికొన్ని ఇతర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ తుది జాబితాలో భారీ మార్పులు చేసింది. ప్రధానంగా ముసాయిదా జాబితాలో కేటాయింపు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఖరారైన బినయ్‌కుమార్ అభ్యంతరాన్ని పరిశీలించడంతో రోస్టర్‌లో మార్పులు చోటుచేసుకున్నట్టు సమాచారం. కేంద్ర సర్వీసును తీసేసి రాష్ట్ర సర్వీసును మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఈ జాబితాలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే ఔట్ సైడర్ అధికారులు ఇతర రాష్ట్రాల్లో పని చేసి ఇక్కడికి బదిలీ అయి రావడం కారణంగా వారిని సంబంధిత బ్యాచ్‌లో చివరగా తీసుకుని సర్వీసును లెక్కించినట్టు సమాచారం. ఈ జాబితాను నేడో రేపో కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ప్రధానమంత్రికి పంపనుంది. ప్రధానమంత్రి ఆమోదించిన తరువాత ఈ తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని కమిటీ వర్గాలు తెలిపాయి.
మారిన అధికారుల కేడర్ ఇలా..!
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు..: ఎస్.ఎస్.రావత్, పి.వి.రమేశ్, బి.పి.ఆచార్య, బి.ఆర్.మీనా, ఆధిత్యనాథ్‌దాస్, దినేష్‌కుమార్, జె.రామానంద్, శాంతికుమారి, వీణా ఈష్, అనంతరాం, నీలం సహాని, షాలినిమిశ్రా తదితరులు ఉన్నారు.
ఏపీ నుంచి తెలంగాణకు..: బినయ్‌కుమార్, అజయ్‌సహానీ, అజయ్‌జైన్, అదర్‌సిన్హా, రంజీవ్ ఆర్ ఆచార్య తదితరులున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన ఐఏఎస్ అధికారి జె.ఎస్.వి.ప్రసాద్ అభ్యర్థనను కమిటీ తిరస్కరించింది. ఆయన తెలంగాణలోనే ఉంటారు.
Advertisement
Advertisement