మహిళలకే మున్సిపాలిటీలు | preference to ladies in municipal elections | Sakshi
Sakshi News home page

మహిళలకే మున్సిపాలిటీలు

Published Sun, Mar 2 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM

preference to ladies in municipal elections

ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, రెండు నగరపంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శనివారం ఉత్తర్వులు చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఖమ్మం కార్పొరేషన్ ఎస్టీలకు రిజర్వ్ అవుతోంది. సత్తుపల్లి నగర పంచాయతీ, ఇల్లెందు మున్సిపాలిటీలను బీసీ మహిళకు, కొత్తగూడెం మున్సిపాలిటీ జనరల్ మహిళకు, మధిర నగరపంచాయతీని ఎస్సీ మహిళకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దీంతో రిజర్వేషన్లు ఖరారయిన మున్సిపాలిటీలు, నగరపంచాయతీలలో మహిళలే కొలువుదీరనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్దిష్ట గడువులో పూర్తిచేయాలన్న దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం మేరకు పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రచురణకు ఎన్నికల సంఘం ఆదేశాలివ్వగా, రిజర్వేషన్ల ఖరారుతో మరో ప్రక్రియ పూర్తయినట్లయింది. అయితే, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో మాత్రం రిజర్వేషన్ మారే అవకాశం ఉందని పురపాలక వర్గాలంటున్నాయి.

 ఎన్నికల్లేకపోయినా....
 ఖమ్మం కార్పొరేషన్‌కు సంబంధించి ప్రస్తుతం ఎన్నికలు జరగకపోయినప్పటికీ కార్పొరేషన్ మేయర్ పదవి ఎస్టీ జనరల్‌కు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం జరిగే మున్సిపాలిటీలు అన్ని తొలి దశలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఖమ్మం  కార్పొరేషన్‌కు సంబంధించి డివిజన్‌లను 2001 జనాభా  ప్రకారం చేశారని, దానిని రద్దు చేసి 2011 జనాభా ప్రకారం డివిజన్‌లు ఏర్పాటు చేయాలని పలు పార్టీల నాయకులు హైకోర్టుకు వెళ్లడంతో వాటిని రద్దు చేస్తూ  2011 జనాభా లెక్కల ప్రకారం డివిజన్లను పునర్విభజన చేయాలని కోర్టు సూచించింది. దీంతో కార్పొరేషన్ ఎన్నికలు నిలిచిపోయాయి.

ఆదివారం ఫొటోలున్న ఓటర్ల జాబితాను మున్సిపాలిటీల్లో ప్రదర్శించనున్నారు. జిల్లాలో మిగిలిన మున్సిపాలిటీలయిన మణుగూరు, పాల్వంచలలో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement