మంచంపై గర్భిణిని ఉంచి మసాలాగెడ్డను దాటిస్తున్న ఈతమానువలస గ్రామస్తులు, కుటుంబ సభ్యులు
సాక్షి, సాలూరు: గిరిశిఖర గ్రామాల గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. కాన్పుకు ముందే ఆస్పత్రుల్లో చేరాలన్న వైద్యుల సూచనను పట్టించుకోకపోవడం కష్టాలకు గురిచేస్తోంది. అత్యవసర వేళ నరకయాతన పడుతున్నారు. దీనికి పాచిపెంట మండలంలోని పెద్దవలస పంచాయతీ ఈతమానువలస గ్రామానికి చెందిన లావుడుజన్ని కస్తూరీ ప్రసవ వేదనే నిలువెత్తు సాక్ష్యం. కస్తూరీకి బుధవారం అర్ధరాత్రి పురుటినొప్పులు వచ్చాయి. రోడ్డు సదుపాయం ఉండడంతో 108కు ఫోన్ చేశారు. అయితే, గ్రామానికి వెళ్లే మార్గంలో మసాలాగెడ్డపై వంతెన లేకపోవడం, వర్షాలకు గెడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనరాకపోకలు నిలిచిపోయాయి. డోలీ సహాయంతో గెడ్డ సమీపం వరకు గర్భిణిని తీసుకొచ్చారు. గెడ్డ దాటే అవకాశం లేక అక్కడ గురువారం ఉద యం వరకు నిరీక్షించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు పాచిపెంట వీరంనాయుడు గర్భిణీని తరలించే ఏర్పాట్లు చేశారు.
మంచానికి తాళ్లు కట్టి డోలీగా మార్చారు. అందులో కస్తూరిని పడుకోబెట్టి అతికష్టం మీద వాగును దాటించారు. ప్రైవేటు వాహనంలో ఆమెను పాచిపెంట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి సాలూరు సీహెచ్‌సీకు, తరువాత విజయనగరం ఘోషాస్పత్రికి రిఫర్ చేశారు. గురువారం సాయంత్రం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గర్భిణి ప్రసవ కష్టాలను పాచిపెంట పీహెచ్‌సీ వైద్యాధికారి లక్ష్మివద్ద ప్రస్తావించగా కేసు పార్వతీపురానికి చెందినదిగా పేర్కొన్నారు. ఆమెను జీఎల్ పురం వైటీసీలోని గిరిశిఖర గర్భిణుల వసతి గహంలో చేర్పించాల్సి ఉందన్నారు. ఆమె ఈతమానువలస గ్రామానికి 10 రోజులు క్రితమే వచ్చిందని, హైరిస్క్ కేసుగా గుర్తించి రిఫర్ చేసినా వినిపిం చుకోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment