జీజీహెచ్‌లో నరకం చూస్తున్న బాలింతలు | Pregnant Women Faced Problems In Ggh | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో నరకం చూస్తున్న బాలింతలు

Published Fri, May 17 2019 10:07 AM | Last Updated on Fri, May 17 2019 10:08 AM

Pregnant Women Faced Problems In Ggh  - Sakshi

ఒకే మంచంపై ముగ్గురు చిన్నారులతో బాలింతల ఇక్కట్లు

సాక్షి, కాకినాడ సిటీ: పాలకులు మారుతున్నా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు తొలగడం లేదు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గర్భిణులకు ప్రసూతి సేవలు అందించలేక చేతులెత్తేస్తున్నాయి. కాన్పు కోసం వచ్చే గర్భిణులను హైరిస్క్‌ కేసులంటూ ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరిమేస్తున్నారు. అక్కడకు వెళ్లే స్తోమత లేని వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వస్తున్నారు. ఇక్కడ తగినంత మంది ప్రసూతి వైద్యనిపుణులు లేకపోవడం ఒక సమస్యైతే.. ప్రసవం అనంతరం బాలింత సంరక్షణ సమస్యగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఆసుపత్రికి ఉభయ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన పేద, మధ్య తరగతికి చెందిన గర్భిణులు పెద్ద సంఖ్యలో కాకినాడ సామాన్య ఆసుపత్రికి రావడంతో ఆసుపత్రిలో పడకల సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ ఆసుపత్రిలో నిత్యం దాదాపు 300 మందికి పైగా గర్భిణులు వస్తుంటే 80 మంది వరకు ప్రసవాలు జరుగుతుంటాయి.

వాటిలో దాదాపు 30 మంది వరకు సిజేరియన్‌ ఆపరేషన్లు చేస్తుంటారు. దీంతో గైనిక్‌ విభాగంలోని పోస్టునేటల్‌ వార్డులో బాలింతలు ప్రత్యక్షనరకం చూస్తున్నారు. శుక్రవారం ఉదయం పరిస్థితి చూస్తే ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు ఉన్న దృశ్యాలు కన్పించాయి. ఏ తల్లిని కదిపినా ఒకటే ఆవేదన. తాను తొమ్మిది నెలలు గర్భిణులతో ఉన్నా ఎటువంటి ఇబ్బంది కన్పించలేదు, కానీ ఆసుపత్రిలో పురుడు పోసుకున్న తరువాత చిన్నారితో ఉండేందుకు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాకుండా ఉన్నాయంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. బాలింత అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నా, ఆ జాగ్రత్తలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కన్పించడం లేదని ఆందోళన చెందుతున్నారు. తల్లి చిన్నారుల పక్కన పడుకొని పాలు ఇవ్వాలంటే మరో చిన్నారి ముఖంపై కాళ్లు పెట్టుకునే పరిస్థితి కన్పిస్తోంది. ఎంత మంది జిల్లా అధికారులు సందర్శించినా ఈ పరిస్థితిలో మార్పురాకపోవడం శోచనీయం. కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పదేపదే ఆసుపత్రిని సందర్శిస్తున్నా గైనిక్‌ వార్డుల్లోని సమస్యలు పరిష్కరించిన దాఖలాలు కన్పించలేదు.

గురువారం ఆసుపత్రిని సందర్శించిన జీజీహెచ్‌ అభివృద్ధి కమిటీ బృందం, అధికారుల బృందానికి ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురు బాలింతలు ఉన్న దృశ్యం కన్పించకపోవడం శోచనీయం. చాలా మంది బాలింతలకు చెందిన బంధువులు ఒకే మంచంపై ఇద్దరు నుంచి ముగ్గురు ఉన్న విషయాన్ని కలెక్టర్, జీజీహెచ్‌ అభివృద్ధి కమిటీ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదని పలువురు విమర్శిస్తున్నారు. బాలింత మంచంపై పడుకునేందుకు లేదని, ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని మంచంపై పరుండబెడితే తల్లులు కింద కూర్చునే పరిస్థితి ఉందని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం గొప్పగా ఉన్నా సౌకర్యాలు లేకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నామన్నారు. గర్భిణులుగా ఉన్నప్పుడు తల్లి ఆలనపాలన చూసే కన్నా బాలింతగా ఉన్న సమయంలోనే తల్లి ఆరోగ్యం కోసం పరితపించాల్సిన అవసరం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలింత పడుకునేందుకు చోటు లేకపోవడంతో సహాయకులుగా ఉన్న వారే కొద్దిసేపు పిల్లలను ఎత్తుకొని తల్లిని మంచపై పడుకోబెడుతున్నామంటున్నారు. కొన్ని మంచాల వద్ద బాలింతలు రోజంతా నిద్రలేకుండానే గడుపుతున్నారని ఆవేదన చెందుతున్నారు.

బాలింత ఉండేందుకు చోటు లేదు
తాము జగ్గంపేట నుంచి వచ్చాం. తన భార్యకు పురుడు వచ్చింది. ఆసుపత్రిలో ఒక్కొక్క మంచానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున వేస్తున్నారు. మంచాలు ఒకరికన్నా ఎక్కువ ఉండేందుకు సరిపోవడం లేదు. చేసేది లేక పిల్లను మంచంపై ఉంచి బాలింతను పక్కనే పీట మీద కూర్చోబెడుతున్నాం. బాలింతలు పరిస్థితి చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. 
– జి.రామకృష్ణ, జగ్గంపేట

గర్భిణుల కన్నా బాలింతకే ఎక్కువ బాధ
ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లేందుకు స్థోమత లేక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పురుడు పోయిస్తే గర్భిణులుగా ఉన్న సమయం కన్నా బాలింతగానే ఎక్కువగా బాధను అనుభవిస్తున్నాం. తల్లి పడుకునేందుకు చోటులేక తల్లి బిడ్డ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అంతేకాకుండా వీరికి ఆసరాగా వచ్చిన మాలాంటి వారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఒకే మంచానికి ముగ్గురు చొప్పున వేస్తుంటే తల్లీబిడ్డ పడుతున్న ఇబ్బందులు చూడలేకపోతున్నాం.
– అమరావతి, బాలింత తల్లి, కాకినాడ

   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement