హైదరాబాద్: ఇప్పటికే తత్కాల్ పేరుతో ప్రయాణికుల మీద పెనుభారం మోపుతున్న రైల్వేశాఖ ఇప్పుడు అందులోనూ మరో సరికొత్త వీరబాదుడు మొదలుపెట్టేసింది. అసలు తత్కాల్ ఛార్జీలే ఎక్కువనుకుంటే అందులో మళ్లీ ప్రీమియం తత్కాల్ అంటూ మరో కొత్త కోటాను తీసుకొచ్చింది. మొత్తం తత్కాల్ సీట్లలో సగం వరకు ఈ కోటాలోకి వెళ్లిపోతాయి. ఈ ప్రీమియం తత్కాల్ను బుధవారం నుంచి ప్రవేశపెడుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది.
7 ప్రధాన రైళ్లు.... ఫలక్నామా, పాట్నా, ఏపీ, బెంగళూరు, గోదావరి, దర్శన్, శబరి ఎక్స్ప్రెస్లలో మాత్రమే ప్రీమియం తత్కాల్ సౌకర్యం ఉంటుందని పేర్కొంది. కోచ్లలో బెర్త్లు తగ్గే కొద్దీ ఛార్జీలు పెరుగుతాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. డైనమిక్ ఫేస్ స్ట్రక్చర్ కింద టికెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపింది. తత్కాల్లోని 50 శాతం టికెట్ల కోటాను ప్రీమియం తత్కాల్కు బదిలీ చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే విశదీకరించింది.