సర్వం సిద్ధం | Prepare everything | Sakshi
Sakshi News home page

సర్వం సిద్ధం

Published Mon, Oct 6 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

సర్వం సిద్ధం

సర్వం సిద్ధం

సాక్షి, అనంతపురం/కళ్యాణదుర్గం :  
 ఒక రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం సోమవారం కళ్యాణదుర్గం రానున్నారు. కళ్యాణదుర్గం మండలం గరుడాపురం గ్రామంలో నిర్వహించే ‘జన్మభూమి- మాఊరు’లో పాల్గొంటారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలో వ్యవసాయ మిషన్‌ను ప్రారంభిస్తారు. కళ్యాణదుర్గం లక్ష్మిదేవమ్మ కృషి విజ్ఞానకేంద్రం ఎదురుగా ఉండే ఎర్రంపల్లి మైదానంలో బహిరంగ సభా వేదిక, ఖాళీ స్థలంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. కాగా ఆదివారం మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, కలెక్టర్ సొలమన్‌ఆరోగ్యరాజ్, జేసీ సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ నీలకంఠారెడ్డి, సమాచారశాఖ ఏడీ వెంకటేశ్వర్లు వేదిక, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు.  

 భారమంతా అధికారులదే :
 కళ్యాణదుర్గంలో సోమవారం నాటి సీఎం పర్యటన భారమంతా అధికారులపైనే పడింది. జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించి ఒక్కో శాఖకు, ఒక్కో బాధ్యతను అప్పగించారు. అవసరమైన వాహనాల ఖర్చు, జనాల తరలింపు బాధ్యత కూడా అధికారులకే అప్పగించారు. ఇందు కోసం వ్యవసాయ శాఖ, డీఆర్‌డీఏ ఐకేపీ, డ్వామా శాఖలకు 300 వాహనాలు కేటాయించారు. వీటికి సంబంధించిన డీజిల్, ప్రజల భోజన ఖర్చు డ్వామా అధికారులు భరించేలా నిర్ణయించారు. రైతు రుణమాఫీ, మహిళా రుణమాఫీ, ఇలా ఎన్నెన్నో హామీలను అమలు చేయని ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్న జనాన్ని మెప్పించి కార్యక్రమానికి తీసుకువచ్చేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మరికొన్ని కార్యక్రమాలు ఖర్చులు, లారీల ఖర్చు భారాన్ని వివిధ కాంట్రాక్టర్లు, టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులకు కూడా బాధ్యత అప్పగించారు.

60 వేల మంది జనాన్ని సమీకరించాలని అధికారులకు నేతలు చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు ఎలాంటి నిరసనలు వ్యక్తం చేయకుండా భారీ పోలీస్ బందోబస్తుకు ఏర్పాట్లు చేశారు. సభ ప్రాంగణం వద్ద మొత్తం పెద్ద స్థాయిలో ఉన్న ఇనుప రాడ్లతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆధ్వర్యంలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు , 10 మంది డీఎస్పీలు, 38 మంది సీఐలు , 82 మంది ఎస్‌ఐలు, 229 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 565 మంది కానిస్టేబుళ్లు, 50 మహిళా కానిస్టేబుళ్లు, 250 మంది హోంగార్డులు, ఆరు సెక్షన్ల సాయుధ దళాలు, 14 స్పెషల్ పార్టీ పోలీసులు మొత్తం 1500 మంది దాకా పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేశారంటే ముందస్తు జాగ్రత్తలు ఏ స్థాయిలో తీసుకున్నారో ఇట్టే అర్థమవుతోంది. అంతేకాదు రెండు రోజులుగా పట్టణంలో ప్రతి వాహనంతో పాటు ద్విచక్రవాహనాలు సైతం తనిఖీ చేస్తూ, సీఎం సభ ప్రాంగణానికి ముందు భారీ భద్రత కేటాయించారు. మొత్తం మీద సీఎం పర్యటన బాధ్యతను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేత లు, పూర్తి స్థాయిలో అధికారులకే అప్పగించి తూతూమంత్రంగా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

 ‘అనంత’లో బస్సుల హల్‌చల్
 ముఖ్యమంత్రి, మాజీ రాష్ర్టపతి పర్యటనను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా జనాన్ని సమీకరించడంపై దృష్టి సారించారు. ఈ మేరకు రవాణాశాఖ సహకారంతో 500 బస్సులను సమకూర్చుకున్నారు. ఈ బస్సులకు డీజిల్ వేయించేందుకు ఆదివారం అనంతపురం తెప్పించుకున్నారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో బస్సులు అనంతపురం చేరుకుని టవర్‌క్లాక్ కూడలి నుంచి బారులు తీరి వెళ్తుండడంతో ఆ మార్గంలో దాదాపు గంటపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది.

 సీఎం, కలాం  పర్యటన ఇలా:
 మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సోమవారం ఉదయం ఢిల్లీనుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11.15గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ చంద్రబాబునాయుడుతో కలసి అనంతపురం జిల్లా పర్యటనకు బయల్దేరి వస్తారు.

  సోమవారం ఉదయం 11.15 గంటలకు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి 11.25 గంటలకు బేగంఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
  11.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి అబ్దుల్‌కలాంతో కలసి ప్రత్యేక విమానంలో బయల్దేరి 12.30 గంటలకు అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
  మధ్యాహ్నం 1గంటకు పుట్టపర్తి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి 1.30 గంటలకు కళ్యాణదుర్గంలోని లక్ష్మిదేవమ్మ ృషి విజ్ఞానకేంద్రం (ఎల్‌కేవీకే) సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
  1.30 నుంచి 2గంటల వరకు ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించడంతో పాటు శాస్త్రవేత్తలు, ప్రగతి సాధించిన రైతులతో ముఖాముఖి అవుతారు.
 2గంటల నుంచి 4గంటల వరకు కళ్యాణదుర్గంలో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతుల కోసం వ్యవసాయ మిషన్‌ను ప్రారంభిస్తారు.
 4.15 గంటలకు కళ్యాణదుర్గం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి 4.45 గంటలకు పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
 సాయంత్రం 5గంటలకు పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement