ఎస్‌ఐల పదోన్నతులకు రంగం సిద్ధం
సాక్షి, గుంటూరు: పోలీస్ శాఖలో వరస పదోన్నతులతో సీఐ, డీఎస్పీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. గుంటూరు పోలీస్ రేంజ్‌లోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 212 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. ఇటీవల 27 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి లభించింది. మరో తొమ్మిది మంది డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి రానుంది. ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్‌లో సుమారుగా 30 సీఐ పోస్టులు ఖాళీ కానున్నట్టు తెలుస్తోంది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఎస్‌ఐలకు పదోన్నతులు కల్పించనున్నారు.
ఈ మేరకు డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. రేంజిలో ఐదేళ్లకుపైగా ఎస్‌ఐలుగా పనిచేస్తున్న వారి జాబితాను తయారు చేయగా, సుమారు 60 మంది వరకు ఉన్నట్టు తేలింది. వీరిలోనూ సీనియార్టీ ప్రకారం మరో జాబితాను సిద్ధం చేశారు.
ఈ జాబితాలను డీజీపీ కార్యాలయం ఎప్పుడు కోరినా వెంటనే అందించాలనే ఉద్దేశంతో ఐజీ కార్యాలయం వీటిని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.ఈ పరిణామాలను బట్టీ చూస్తే డీఎస్పీల పదోన్నతుల జాబితా విడుదల కాగానే, ఎస్‌ఐల పదోన్నతులపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
ఈ జాబితాలో సీఐలుగా పదోన్నతులు పొందిన వారికి వెంటనే పోస్టింగ్‌లు కూడా దక్కనున్నాయి. దీంతో సీనియారిటీ ఉన్న ఎస్‌ఐలు పదోన్నతుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మరింత ఆలస్యమవుతాయనుకున్న పదోన్నతులు త్వరితగతిన వస్తుండటంతో పోలీస్‌శాఖలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
ఎస్‌ఐల వివరాలు సిద్ధం చేసిన ఐజీ కార్యాలయం..!
రేంజ్‌లో ఉన్న సుమారు 60 మంది ఎస్‌ఐల గురించి పూర్తి వివరాలను ఐజీ కార్యాలయం సిద్ధంగా ఉంచినట్టు తెలుస్తోంది.హైదరాబాద్ నుంచి ఏ క్షణ మైనా ఎస్‌ఐల వివరాలు అడిగే అవకాశాలు ఉన్నట్టు గుర్తించిన ఐజీ కార్యాలయం ఈ మేరకు అన్నీ సిద్ధం చేసింది.
సుమారు 30 మంది ఎస్‌ఐలకు మాత్రమే సీఐలుగా పదోన్నతులు వచ్చే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా ఓ జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఎస్‌ఐలపై ఉన్న అభియోగాలు, మెమోలు, వారి పనితీరు వంటి వివరాలు పొందుపరిచినట్టు తెలుస్తోంది.