అందని అక్షరం | Preposterous Alphabetical | Sakshi
Sakshi News home page

అందని అక్షరం

Published Fri, Feb 7 2014 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

Preposterous Alphabetical

గ్రామీణ ప్రాంతాల్లో వయోజనులను విద్యావంతులను చేయాల్సిన సాక్షరభారత్ కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రతి రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు అక్షరాలు నేర్పేందుకు ప్రతి గ్రామంలో వీటి ఏర్పాటు చేశారు. గ్రామ కో-ఆర్డినేటర్లను నియమించినా ఫలితం లేకుండా పోయింది.  కేంద్రాల్లో వసతులు లేకపోవడం, సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో అనుకున్న లక్ష్యాన్ని ఇవి సాధించలేకపోతున్నాయి.
 
 60 శాతం మహిళలు నిరక్ష రాస్యులే: జిల్లా వ్యాప్తంగా 34 మండలాల పరిధిలోని 570 గ్రామ పంచాయతీల్లో 7,29,792 మంది మహిళలు నిరక్షరాస్యులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 15 నుంచి 50 ఏళ్లలోపు వారే 60 శాతం అంటే 4,37,875 మంది ఉన్నట్లు తేల్చారు. ఆదోని డివిజన్‌లోనే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కోసిగిలోని 23.80 శాతం మాత్రమే మహిళల్లో అక్షరాస్యులున్నారు.
 
 దాని తర్వాత పెద్దకడుబూరు 27,26, హొళగుంద 31.15, కౌతాళం 31.37, సి. బెళగల్ 31.53, నందవరం 32.70, దేవనకొండ 32.90, ఆస్పరి 33.12, మంత్రాలయం 33.44, గోనెగండ్ల 34.41, క్రిష్ణగిరి 39.26, తుగ్గలి 39.26, హాలహర్వి 40.53, గూడూరు 41.19, కోడుమూరు 42.39, వెల్దుర్తి 43.44, ఎమ్మిగనూరు 43.59, ప్యాపిలి 44.08, చిప్పగిరి 44.18, రుద్రవరం 44.44, పత్తికొండ 44.85, కొలిమిగుండ్ల 45.73, అవుకు 46.63, ఆలూరు 46.91, మద్దికెర 47.47, సంజామల 48.02, మహానంది 48.31, కొత్తపల్లి 48.63, బండిఆత్మకూరు 48.70, దొర్నిపాడు 48.71, గడివేముల 49.36, జూపాడుబంగ్లా 49.37, చాగలమర్రి 49.61, ఆదోని 49.76 శాతంగా మహిళల్లో అక్షరాస్యత ఉన్నట్లు నిర్ధారణ అయింది. నవంబర్ 15 నుంచి ఆరు నెలల పాటు అక్షరాస్యతా ప్రత్యేక కార్యక్రమం ద్వారా వీరిని అక్షరాస్యులుగా చేసేందుకు ప్రణాళిక తయారు చేశారు. ఇందుకుగాను రూ.1000 గౌరవ వేతనంతో ప్రతి పంచాయతీకి ఇద్దరి చొప్పున నియమించారు. ఒక్కొక్కరు 30 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని వీరికి లక్ష్యం నిర్దేశించారు.
 
 అయితే ఆయా ప్రాంతాల్లో కోఆర్డినేటర్లు ఇచ్చిన పుస్తకాలు కేంద్రాలకే పరిమితమయ్యాయి. అక్షరదీపం, అక్షర భారతి కేంద్రాలు ఏనాడో మూలనపడ్డాయి. అధికారులు నిర్లక్ష్యం, మండల సాక్షరభారత్ కోఆర్డినేటర్లు పర్యవేక్షణ పూర్తిగా కొర బడటంతో కేంద్రాలకు బోర్డులే కాదు చిరునామాలు కూడా అగుపించడంలేదు. కోఆర్డినేటర్లు తప్పుడు సమాచారంతో తప్పుడు రికార్డులు రాసేం దుకు ఆఫీసులకు పరిమితమైన వారు సెంటర్లును నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
 
 ఇదీ సాక్షరభారత్ కేంద్రాల పరిస్థితి..
 ఆలూరు మండలంలో 14 సాక్షరభారత్ కేంద్రాలు సరిగా పనిచేయడం లేదు. వాలంటీర్లకు ఆరు నెలలకోసారి వేతనాలు అందుతున్నాయి. వీరి పనితీరు సక్రమంగా లేదంటూ మండల కో-ఆర్డినేటర్లు, సంబంధిత అధికారులు వేతనంలో కోతలు విధిస్తున్నారు.
 
  ఆస్పరి మండలంలో 20 పంచాయతీల్లో కేంద్రాల నిర్వహణ గాలికొదిలేశారు. వలంటీర్లకు గౌరవ వేతనం సక్రమంగా రాకపోవడంతో సొంత పనుల్లో నిమగ్నమవుతున్నారు.
  దేవనకొండ మండలంలో 20 కేంద్రాలున్నా 15వేల మంది, చిప్పగిరి మండలంలో 12 కేంద్రాలున్నా 9 వేల మంది నిరక్ష్యరాస్యులుగానే మిగిలిపోయారు.
 
  హొళగుంద మండలంలో 17, హాలహర్వి మండలంలో 15 పంచాయతీల్లో సాక్షరభారత్ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేదు.
 
  శ్రీశైలం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సాక్షర భారత్ కేంద్రాలకు బోర్డులు మాత్రమే దర్శనమిస్తున్నాయి మినహా వాటి తలుపులు మాత్రం తెరుచుకోలేదు. దీంతో  నిరక్షరాస్యులైన వయోజనులు అటువైపు వెళ్లడం లేదు.
 
  ఆత్మకూరు మండలంలో 13 సాక్షర భారత్ కేంద్రాల్లో 26 మంది కో ఆర్డినేటర్లు 780మంది నిరక్షరాస్యులకు బోధిస్తున్నట్లు, వీరిలో 656 మంది మహిళలు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే వీరిలో 50 శాతం మంది మాత్రమే అక్షరాస్యులుగా మారారు.
 
  వెలుగోడు మండలంలో 8 సాక్షర భారత్ కేంద్రాలో 16మంది కో ఆర్డినేటర్లున్నారు. వేతనాలు సరిగా రాకపోవడంతో కేంద్రాలు నిర్వహించడం మానేశారు.
 
  మహానంది మండలంలో 22 కేంద్రాల్లో 660 మందికి విద్య నేర్పుతుండగా 330 మంది మహిళలున్నారు. 50శాతం మిహ ళలు కూడా అక్షరాస్యులు కాలేకపోయారు.
 
  బండిఆత్మకూరు మండలంలో  26 కేంద్రాల్లో 450 మంది మహిళలు విద్యనభ్యసిస్తున్నారు. ఈ సంఖ్య రికార్డులకు మాత్రమే పరిమితమైందన్న విమర్శలున్నాయి.
 
  పత్తికొండ మండలంలో 30 సెంటర్లలో 900 మంది, తుగ్గలిలో 38 సెంటర్లలో 1,440 మంది, మద్దికెరలో 14 సెంటర్లలో 420 మంది, క్రిష్ణగిరిలో 30 కేంద్రాల్లో 1,220 మంది, వెల్దుర్తి మండలంలో 44 సెంటర్లలో 1,260 మంది అక్షరాలు నేర్చుకుంటున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ప్రతి మండలంలో ఐదారేళ్ల నుంచి సెంటర్లు నిర్వహించినప్పటికి కేవలం 8 నుంచి 10 శాతం మాత్రమే అక్షరాలుగా మారినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement