కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలో నూతన వ్యవస్థను ఏర్పాటు చేసిన అనంతరం తొలిసారిగా జిల్లా పార్టీ నేతల సమావేశాన్ని సోమవారం కాకినాడలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులతోపాటు అసెంబ్లీ, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు మాత్రమే హాజరయ్యే ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత, ప్రాంతీయ సమన్వయకర్త ధర్మాన ప్రసాదరావు హాజరుకానున్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలను సమీక్షించనున్నారు.
ఉదయం 11 గంటలకు నాగమల్లితోట జంక్షన్ సమీపంలో హెలికాన్‌టైమ్స్‌లో ఈ సమావేశం జరగనుంది. జగన్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోన్న నేపథ్యంలో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వైఎస్సార్ సీపీ విధానాలపై ప్రజల వెంట పార్టీ ఉందన్న భరోసా ఇచ్చేలా భవిష్యత్ కార్యాచరణపై నేతలకు సూచనలు ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులతోపాటు, పార్లమెంట్, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు కూడా హాజరుకావాలని ధర్మాన పిలుపునిచ్చారు.
నేడు కంపర రమేష్ బాధ్యతలు స్వీకారం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడిగా కంపర రమేష్ సోమవారం సాయంత్రం 4 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్‌హాలు ఆవరణలోని ఆడిటోరియంలో జరిగే సమావేశానికి మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణతోపాటు జిల్లా పార్టీ నేతలు కూడా హాజరుకానున్నారు. తొలుత 50 బిల్డింగ్ సెంటర్ నుంచి భానుగుడి, మెయిన్‌రోడ్డు, సినిమారోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించి అనంతరం బాధ్యతల స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment