కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన సాక్షరభారత్ లక్ష్యానికి ఆమడదూరంలో ఉంది. కో ఆర్డినేటర్లకు ఏడాదిగా వేతనాలు రాకపోగా కేంద్రాలకు సరఫరా చేయాల్సిన పుస్తకాలు, ఇతర వస్తువులు సక్రమంగా రావడం లేదు. దీంతోపాటు అధికారుల పర్యవేక్షణా లోపంతో జిల్లాలో సగానికిపైగా కేంద్రాలు మూతపడ్డాయి. మిగిలిన కేంద్రాలు సైతం మూతపడే దశకు చేరుకున్నాయి.
2010 సెప్టెంబర్ 8న మంత్రి శ్రీధర్‌బాబు సాక్షరభారత్ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. నిరక్షరాస్యులైన వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామని ఆనాడు ఘనంగా ప్రకటించారు. జిల్లాలో గుర్తించిన 14.40 లక్షల మంది నిరక్షరాస్యులను 2014 వరకు అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యం నిర్ణయించుకోగా.. ఈ మూడేళ్లలో 4.30 లక్షల మందిని మాత్రమే ఓనమాలు నేర్పించినట్లు రికార్డులు చెబుతున్నాయి. వాస్తవంగా అంతమంది అక్షరాస్యత సాధించలేదని సమాచారం. రికార్డుల ప్రకారం చూసుకున్నా మిగతా 10లక్షల మందిని అక్షరాస్యులుగా చేసేందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఆగస్టు 31న కలెక్టర్ అధ్యక్షతన జరిగిన వయోజన విద్యాశాఖ సమీక్షలో జిల్లాలో అక్షరాస్యత 64 శాతం ఉందని, 10.30 లక్షల మంది నిరక్షరాస్యులున్నారని, మార్చి 2014లోగా 5లక్షల మందిని, మార్చి 2015లోగా మరో 5లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించడం కొసమెరుపు. మూడేళ్లలో 4లక్షల మందిని మాత్రమే అక్షరాస్యులుగా తీర్చిదిద్దగా, అస్తవ్యస్త నిర్వహణతో ఏడాదిలో 5లక్షల మందికి ఎలా చదువు నేర్పిస్తారో అధికారులకే తెలియాలి.
అంతా
అస్తవ్యస్తం..
జిల్లాలో ప్రతి గ్రామానికి ఒకటి చొప్పున మొత్తం 1194 లోక్‌శిక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి ఇద్దరు చొప్పున 2,388 మంది గ్రామ కో ఆర్డినేటర్లను, మండలానికొక్కరు చొప్పున 57 మండల కో ఆర్డినేటర్లను నియమించారు.
14.40 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించి 2014 వరకు వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు గ్రామ కో ఆర్డినేటర్లతోపాటు ఆయా గ్రామాల్లోని డ్వాక్రా మహిళలు, ఆశ కార్యకర్తలు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, ఇతర స్వచ్ఛంద సంస్థలవారు ఒక్కొక్కరు 20 మంది చొప్పున దత్తత తీసుకుని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. ప్రభుత్వం ప్రతీ కేంద్రానికి ప్రైమరీ పుస్తకాలు, లాంగ్ నోట్‌బుక్, పెన్సిల్, ఎరేజర్, చాక్‌మార్ వంటివి అందించాలి. కానీ, అధికారులు సగానికి పైగా సెంటర్లకు ఈ వస్తువులు సరఫరా చేయలేదు. స్వచ్ఛందంగా బోధించేవారిని ప్రోత్సహించకపోవడంతో వారు తమ పనుల్లో బిజీగా ఉన్నామని, రాత్రి పూట చదువు చెప్పడం వీలు కావడం లేదని విముఖత చూపుతున్నారు. దీంతో జిల్లాలోని సగానికిపైగా కేంద్రాలు తెరిచిన పాపానపోలేదు.
ఏడాదిగా అందని వేతనాలు
మండల కో ఆర్డినేటర్లకు నెలకు రూ.6వేలు, గ్రామ కో ఆర్డినేటర్లకు రూ.2వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. ఈ చాలీచాలని జీతాలు ఏడాదిగా అందకపోవడంతో గ్రామ కో ఆర్డినేటర్లు కేంద్రాల నిర్వహణకు స్వస్తిపలుకుతున్నారు. వీరికి 2012 ఆగస్టు నుంచి జీతాలు చెల్లించాల్సి ఉంది. మండల కో ఆర్డినేటర్లకు సైతం జనవరి నుంచి వేతనాల జాడే లేదు. దీంతో వీరు కూడా నామ్‌కే వాస్తేగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేగాకుండా కో ఆర్డినేటర్ల వేతనాలకు ప్రభుత్వం సర్వేల పేరుతో మెలికపెట్టింది. వేతనాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ చేస్తుంది. పంచాయతీలు వేతనాలు చెల్లిస్తాయి. సాక్షరభారత్ ఆధ్వర్యం లో 2011లో అక్షరాస్యత గణన నిర్వహించగా, ఈ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరిచే వరకు తాత్కాలిక సిబ్బందికి వేతనాలు చెల్లించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. వేతనాలు విడుదల కాకపోవడంతో ఆన్‌లైన్ ప్రక్రియ ఈ ఆగస్టు 31లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. గడువు మేరకు ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయినా వేతనాలు మాత్రం అందకపోవడం గమనార్హం.
నెలాఖరులోగా వేతనాలు
నేను వారం రోజుల క్రితమే ఇక్కడ జాయిన్ అయ్యాను. సాక్షర భారత్ కో ఆర్డినేటర్లకు వేతనాలు అందని మాట వాస్తవమే. సర్వే వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయకుండా వేతనాలు ఆగాయా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? తెలుసుకున్న తర్వాత వివరాలు చెబుతా. వేతనాల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఈ నెలాఖరులోగానీ, వచ్చే నెల మొదటివారంలోగానీ వేతనాలు అందుతాయి.
- సత్యనారాయణ, వయోజన విద్యాసంచాలకులు
ఆసక్తి చూపడం లేదు..
కేంద్రాలకు వచ్చేందుకు అభ్యాసకులు అసక్తి చూపడం లేదు. వ్యవసాయ పనులు ఉన్న సమయంలో పనికి పోయి వచ్చి అక్షరాలు దిద్దే ఓపిక లేదని చెబుతున్నారు. గ్రామ కో ఆర్డినేటర్లకు వేతనాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో పని చేయడానికి ఆసక్తి చూపడం లేదు.
- అంబటి శ్రీకాంత్ , మండల కో ఆర్డినేటర్, చందుర్తి
సంతకం మందమే..
Published Sun, Sep 8 2013 4:39 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
Advertisement