సాక్షి, కడప : సాక్షర భారత్ లక్ష్యం నీరుగారి పోతోంది. 15 సంవత్సరాలకు పైబడిన నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమం నామమాత్రంగా మారింది. ఏడాదిగా గ్రామ కోఆర్డినేటర్లు, మండల, జిల్లా కోఆర్డినేటర్లకు జీతాలు అందడంలేదు. దీంతో జిల్లాలో పలు చోట్ల సాక్షరభారత్ కేంద్రాలు మూతబడుతున్నాయి. వీరికి జీతాలు చెల్లించక పోవడంతో అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది.
కోట్ల రూపాయలు ఖర్చు చేసినా క్షేత్ర స్ధాయిలో మాత్రం అశించిన మేర ఫలితాలు దక్కడంలేదు. వయోజనులకు వృత్తి నైపుణ్యాల కోసం ఇవ్వాల్సిన శిక్షణలు నిధులున్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అటకెక్కాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ ,రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులను విడుదల చేయక పోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
రావలసిన జీతాల బకాయిలు ఇవే..
గ్రామ కో ఆర్డినేటర్లకు నెలకు రూ. 2 వేలు, మండల, జిల్లా కో ఆర్డినేటర్లకు నెలకు రూ. 6 వేలు చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంది. ఈ మొత్తం ఏడాదిగా వీరికి అందడం లేదు.
సాగుతోందిలా...
సాక్షర భారత్ కార్యక్రమాన్ని సెప్టెంబరు 8, 2009న ప్రధానమంత్రి లాంఛనంగా ప్రారంభించినా బాలారిష్టాలను అధిగమించి కార్యక్రమం అమలయ్యే సరికే ఏడాది సమయం పట్టింది. జిల్లాలో 2,76,940మంది పురుషులు, 3,44,565 మంది మహిళలు కలిపి మొత్తం 6,21,505 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ఇప్పటికే నాలుగు దశల్లో అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు రూ. 6 కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ ఆశించిన మేర ఫలితం కనిపించడం లేదు. పేపరు పైన అంకెలు తప్ప క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. 2012-13కు సంబంధించి సమ్మె నేపథ్యంలో ఎంత మంది ఉత్తీర్ణులైంది పూర్తి స్థాయిలో వివరాలు అందలేదు. నాల్గవ దశ కార్యక్రమం సెప్టెంబరు 2013లో ప్రారంభం కావాల్సినప్పటికీ నవంబరు 1 నుంచి ఆలస్యంగా ప్రారంభమైంది.
అటకెక్కిన శిక్షణ
వయోజన విద్య కేంద్రాలలో నమోదైన లబ్ధిదారులకు అక్షరాస్యతతోపాటు వృత్తి విద్య నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. స్వయంగా ఆర్థిక పరిపుష్టి కలిగేలా తర్ఫీదు ఇవ్వాలి. ముఖ్యంగా టైలరింగ్, డిజైనింగ్, ఫినాయిల్, జండూబామ్, డిటర్జెంట్లు, తినుబండారాలు, క్యాండిల్ తయారీ వంటి వాటిపై శిక్షణ ఇవ్వాలి. ప్రతి పంచాయతీలో 50 మంది తప్పకుండా శిక్షణ పొందేలా చూడాలి. అయితే జిల్లాలో ఇప్పటివరకు కేవలం 40, 50 పంచాయతీల్లో మాత్రమే ఈ శిక్షణలు జరగడం గమనార్హం. ముఖ్యంగా శిక్షణలు ఇచ్చే ఏజెన్సీలను ప్రభుత్వం ఎంపిక చేయడంలో అలసత్వం ప్రదర్శించడంతో నిధులు ఉన్నప్పటికీ శిక్షణలు అటకెక్కాయి.
మహిళల అక్షరాస్యత పెంపు కోసం
ప్రస్తుతమున్న సాక్షర భారత్ కార్యక్రమం అంతంత మాత్రంగా నడుస్తుంటే ప్రభుత్వం కొత్తగా మహిళా అక్షరాస్యత తక్కువగా ఉన్న 16 మండలాల్లోని 249 పంచాయతీల్లో 14,940 మంది మహిళలను అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఆరు నెలల ప్రత్యేక కోర్సుగా ఏర్పాటు చేసి ఒక్కో పంచాయతీలో ఇద్దరు ఇన్‌స్ట్రక్లర్లను ఏర్పాటు చేయడంతోపాటు వారికి రూ. 1000 గౌరవ వేతనం ఇవ్వనున్నారు. ముఖ్యంగా బద్వేలు, రాయచోటి ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం ఏమేరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే.
సాక్షర భారత్‌కు నిధుల జబ్బు
Published Thu, Dec 26 2013 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement
Advertisement