తిరుచానూరు : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణుగుంట చేరుకోనున్న ప్రణబ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
కాగా ప్రణబ్ పద్మావతి అమ్మవారి దర్శనం అనంతరం రెండో ఘాట్ మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. ఆయన మధ్యాహ్నాం స్వామివారి దర్శనం చేసుకుంటారు. సాయంత్రం వరకు ప్రణబ్ తిరుమలలో గడపనున్నారు. రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ తిరుమలకు రావడం ఇది మూడోసారి. రాష్ట్రపతి వెంట ఆయన కుమారుడు, గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు తిరుమల రానున్నారు.
రాష్ట్రపతి రాకతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ఇప్పటికే భద్రతా బలగాలు తిరుమలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. మధ్యాహ్నం 12 తర్వాత సర్వదర్శనాన్ని కూడా నిలిపివేయనున్నారు.