ఆత్మఘోషలు.. ఆక్రందనలు! | Price stabilisation fund didnt release for farmers | Sakshi
Sakshi News home page

ఆత్మఘోషలు.. ఆక్రందనలు!

Published Sat, Nov 11 2017 7:59 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM

Price stabilisation fund didnt release for farmers - Sakshi

తెనాలి : జిల్లాలో 2014 నుంచి ఇప్పటి వరకు వంద మంది రైతులు/కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత నెలలో జిల్లాలో ఆరుగురు ఆత్మహత్యలకు పాల్పడగా, ఈ నెలలో తొలి వారం రోజుల్లోనే ముగ్గురు అన్నదాతలు బలవన్మరణం చెందడం విషాదం. అప్పులు చేసి ఏ పంట సాగు చేసినా, అమ్ముకోవడానికి వచ్చేసరికి ధరల పతనం రైతులను కలవరపెడుతోంది. సాగు కష్టాలకు తోడు అప్పుల దైన్యంతో చెదిరిన గుండెకు, భరోసా కనిపించని స్థితిలో పురుగు మందును, ఉరికొయ్యను ఆశ్రయిస్తున్నారు. పంటలకు తగిన ధరలు లేనపుడు ధరల స్థిరీకరణ నిధితో ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం, రైతులను ఆదుకొనే పేరుతో జారీ చేసిన జీవో అమలులోనూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండడం మరింత విషాదం.

2015లో విడుదలైన 62 జీవో..
కుటుంబ యజమాని ఆత్మహత్యతో ఆపదలో ఉన్న కుటుంబ సభ్యులను ఆదుకొనేందుకు మూడు స్థాయిల్లో అమలుజరిగే మధ్యకాలిక ప్రత్యేక ప్యాకేజీని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు–62ను 2015 ఫిబ్రవరి 19న జారీ చేసింది. జీవో ప్రకారం వ్యవసాయ సంబంధిత విషయాల్లో ఆత్మహత్యలు జరిగినపుడు ఆ కుటుంబానికి రూ.3.50 లక్షలు ఆర్థిక సాయం చేయాలి. మరో రూ.1.50 లక్షలను అప్పుల తాలూకు లావాదేవీలకు ఒక్కసారి పరిష్కార మొత్తంగా రుణదాతలకు చెల్లించాలి. ముందుగా ఈ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియోను బాధితుల చట్టపరమైన వారసులతో పాటు, మండల తహసీల్దారుతో కలిసి ఉమ్మడి ఖాతాను తెరిచి బ్యాంకులో జమచేయాలి. రుణదాతలకు పరిష్కారం ప్రకారం నగదు అందజేసి, సరైన రసీదులు తీసుకుని, బాధితుల కుటుంబంపై మరే ఇతర చెల్లింపులు చేసే బాధ్యత లేదన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఖాతా నిర్వహణలో జరిగే ఖర్చును కలెక్టర్‌ రివాల్వింగ్‌ ఫండ్‌ నుంచి భరించి, తర్వాత సరైన ప్రతిపాదనలను దాఖలు చేయాలి.

త్రిసభ్య కమిటీతో నిర్ధారణ  
రైతుల ఆత్మహత్యలు జరిగినపుడు, ధ్రువీకరణకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆర్డీవో/సబ్‌కలెక్టర్‌/వ్యవసాయ శాఖ ఏడీలు ఇందులో సభ్యులు. సంఘటన గురించిన సమాచారం తెలియగానే త్రిసభ్య కమిటీ ఆ ప్రదేశాన్ని సందర్శించి, సంబంధిత ఆర్థిక బాధలు, సామాజిక అవమానాలతో జరిగిన ఆత్మహత్యగా నిర్ధారించాలి. బ్యాంకు అధికారులు, రుణదాతలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో సమావేశమై, రుణవిముక్తికి ఒక్కసారిగా ఇచ్చే ఆర్థిక పరిష్కార ప్యాకేజీని తయారుచేయాలి. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం, అప్పుల పరిష్కారమే కాకుండా సామాజికపరమైన సాంత్వననూ జీవోలో చేర్చారు. బాధిత కుటుంబ పిల్లలను సాంఘిక సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లోనూ చేర్చాలి. పక్కా ఇంటిని కేటాయించాలి. ఆర్థిక సహాయం, పింఛను వంటి సంక్షేమ పథకాలనూ అందించాలి. అవసరమైనపుడు అర్హత నిబంధనలను మినహాయించాలని కూడా జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటును ప్రస్తావించారు.

ß వట్టిచెరుకూరు మండలం సౌపాడుకు చెందిన రైతు వరగాని సురేష్‌ అప్పుల బాధ తట్టుకోలేక ఈ నెల 4వ తేదీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ß క్రోసూరు మండలం ఉయ్యందన రైతు సంపటం వెంకటేశ్వర్లు బ్యాంకు రుణాల భారం పెరగడంతో విరక్తితో పురుగు మందు తాగి విముక్తుడయ్యాడు.
ß చెరుకుపల్లి మండలం పిట్టుపాలెం రైతు తుమ్మా రామిరెడ్డి నడివయసులో సాగు కష్టాలతో బతుకుబండిని లాగలేని నైరాశ్యంలో చెరువులో మునిగి ప్రాణాలు తీసుకున్నాడు. జిల్లాలో ఆగని రైతు ఆత్మహత్యల పరంపరకు నిదర్శనం ఈ మరణాలు.

పట్టించుకోని ప్రభుత్వ అధికారులు  
ప్రభుత్వం జీవో విడుదల చేసి రెండున్నరేళ్లకు పైగా అయింది. జీవో ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తే, ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబానికి కనీసం ఓదార్పు లభించేంది. త్రిసభ్య కమిటీ సందర్శన, అప్పుల పరిష్కారం వంటివి ఎక్కడా కనిపించడం లేదు. ఇక సంక్షేమ పథకాల ఊసెందుకుంటుంది? రైతు ఆత్మహత్యగా నిరూపించుకునేందుకు బాధిత కుటుంబం శవ పంచనామా, శవపరీక్ష, బాకీల జాబితా, పొలం  రికార్డులతో సహా 13 రకాల ధ్రువీకరణలు అందించాల్సివస్తోంది. శవపరీక్ష నివేదికను సంపాదించడమే బ్రహ్మప్రళయమవుతోంది. అక్కడా లంచాల బెడద తప్పడం లేదంటున్నారు. అలాంటిది 13 రకాల ధ్రువీకరణలు భర్త పోయిన భార్య సంపాదించాలంటే వ్యయప్రయాసలు అధికం. బంధువులో, ఇతరులో సాయం చేస్తే తప్ప, ఒంటరి మహిళలు చేయలేక మానుకుంటున్నారు.  

ఆదుకోకుంటే ఆత్మహత్యలు ఆగవు
ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసి, అదనంగా బోనస్‌ ఇచ్చి రైతులను ఆదుకోవాలి. లేకుంటే ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ప్రైవేటు/ప్రభుత్వ బ్యాంకు రుణాలను తీసుకున్న రైతులు సాగు చేసిన పంట దెబ్బతింటే, నష్టం అంచనాకు కేరళలో పనిచేస్తున్న కమిషన్‌ తరహాలో రాష్ట్రంలోనూ ఏర్పాటుచేయడం అవసరం.
– వై.రాధాకృష్ణ, ఏపీ రైతు సంఘం, జిల్లా కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement