Price Stabilisation Fund
-
ఆత్మఘోషలు.. ఆక్రందనలు!
తెనాలి : జిల్లాలో 2014 నుంచి ఇప్పటి వరకు వంద మంది రైతులు/కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత నెలలో జిల్లాలో ఆరుగురు ఆత్మహత్యలకు పాల్పడగా, ఈ నెలలో తొలి వారం రోజుల్లోనే ముగ్గురు అన్నదాతలు బలవన్మరణం చెందడం విషాదం. అప్పులు చేసి ఏ పంట సాగు చేసినా, అమ్ముకోవడానికి వచ్చేసరికి ధరల పతనం రైతులను కలవరపెడుతోంది. సాగు కష్టాలకు తోడు అప్పుల దైన్యంతో చెదిరిన గుండెకు, భరోసా కనిపించని స్థితిలో పురుగు మందును, ఉరికొయ్యను ఆశ్రయిస్తున్నారు. పంటలకు తగిన ధరలు లేనపుడు ధరల స్థిరీకరణ నిధితో ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం, రైతులను ఆదుకొనే పేరుతో జారీ చేసిన జీవో అమలులోనూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండడం మరింత విషాదం. 2015లో విడుదలైన 62 జీవో.. కుటుంబ యజమాని ఆత్మహత్యతో ఆపదలో ఉన్న కుటుంబ సభ్యులను ఆదుకొనేందుకు మూడు స్థాయిల్లో అమలుజరిగే మధ్యకాలిక ప్రత్యేక ప్యాకేజీని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు–62ను 2015 ఫిబ్రవరి 19న జారీ చేసింది. జీవో ప్రకారం వ్యవసాయ సంబంధిత విషయాల్లో ఆత్మహత్యలు జరిగినపుడు ఆ కుటుంబానికి రూ.3.50 లక్షలు ఆర్థిక సాయం చేయాలి. మరో రూ.1.50 లక్షలను అప్పుల తాలూకు లావాదేవీలకు ఒక్కసారి పరిష్కార మొత్తంగా రుణదాతలకు చెల్లించాలి. ముందుగా ఈ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియోను బాధితుల చట్టపరమైన వారసులతో పాటు, మండల తహసీల్దారుతో కలిసి ఉమ్మడి ఖాతాను తెరిచి బ్యాంకులో జమచేయాలి. రుణదాతలకు పరిష్కారం ప్రకారం నగదు అందజేసి, సరైన రసీదులు తీసుకుని, బాధితుల కుటుంబంపై మరే ఇతర చెల్లింపులు చేసే బాధ్యత లేదన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఖాతా నిర్వహణలో జరిగే ఖర్చును కలెక్టర్ రివాల్వింగ్ ఫండ్ నుంచి భరించి, తర్వాత సరైన ప్రతిపాదనలను దాఖలు చేయాలి. త్రిసభ్య కమిటీతో నిర్ధారణ రైతుల ఆత్మహత్యలు జరిగినపుడు, ధ్రువీకరణకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆర్డీవో/సబ్‌కలెక్టర్/వ్యవసాయ శాఖ ఏడీలు ఇందులో సభ్యులు. సంఘటన గురించిన సమాచారం తెలియగానే త్రిసభ్య కమిటీ ఆ ప్రదేశాన్ని సందర్శించి, సంబంధిత ఆర్థిక బాధలు, సామాజిక అవమానాలతో జరిగిన ఆత్మహత్యగా నిర్ధారించాలి. బ్యాంకు అధికారులు, రుణదాతలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో సమావేశమై, రుణవిముక్తికి ఒక్కసారిగా ఇచ్చే ఆర్థిక పరిష్కార ప్యాకేజీని తయారుచేయాలి. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం, అప్పుల పరిష్కారమే కాకుండా సామాజికపరమైన సాంత్వననూ జీవోలో చేర్చారు. బాధిత కుటుంబ పిల్లలను సాంఘిక సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లోనూ చేర్చాలి. పక్కా ఇంటిని కేటాయించాలి. ఆర్థిక సహాయం, పింఛను వంటి సంక్షేమ పథకాలనూ అందించాలి. అవసరమైనపుడు అర్హత నిబంధనలను మినహాయించాలని కూడా జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటును ప్రస్తావించారు. ß వట్టిచెరుకూరు మండలం సౌపాడుకు చెందిన రైతు వరగాని సురేష్ అప్పుల బాధ తట్టుకోలేక ఈ నెల 4వ తేదీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ß క్రోసూరు మండలం ఉయ్యందన రైతు సంపటం వెంకటేశ్వర్లు బ్యాంకు రుణాల భారం పెరగడంతో విరక్తితో పురుగు మందు తాగి విముక్తుడయ్యాడు. ß చెరుకుపల్లి మండలం పిట్టుపాలెం రైతు తుమ్మా రామిరెడ్డి నడివయసులో సాగు కష్టాలతో బతుకుబండిని లాగలేని నైరాశ్యంలో చెరువులో మునిగి ప్రాణాలు తీసుకున్నాడు. జిల్లాలో ఆగని రైతు ఆత్మహత్యల పరంపరకు నిదర్శనం ఈ మరణాలు. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం జీవో విడుదల చేసి రెండున్నరేళ్లకు పైగా అయింది. జీవో ప్రకారం ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తే, ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబానికి కనీసం ఓదార్పు లభించేంది. త్రిసభ్య కమిటీ సందర్శన, అప్పుల పరిష్కారం వంటివి ఎక్కడా కనిపించడం లేదు. ఇక సంక్షేమ పథకాల ఊసెందుకుంటుంది? రైతు ఆత్మహత్యగా నిరూపించుకునేందుకు బాధిత కుటుంబం శవ పంచనామా, శవపరీక్ష, బాకీల జాబితా, పొలం రికార్డులతో సహా 13 రకాల ధ్రువీకరణలు అందించాల్సివస్తోంది. శవపరీక్ష నివేదికను సంపాదించడమే బ్రహ్మప్రళయమవుతోంది. అక్కడా లంచాల బెడద తప్పడం లేదంటున్నారు. అలాంటిది 13 రకాల ధ్రువీకరణలు భర్త పోయిన భార్య సంపాదించాలంటే వ్యయప్రయాసలు అధికం. బంధువులో, ఇతరులో సాయం చేస్తే తప్ప, ఒంటరి మహిళలు చేయలేక మానుకుంటున్నారు. ఆదుకోకుంటే ఆత్మహత్యలు ఆగవు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసి, అదనంగా బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలి. లేకుంటే ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ప్రైవేటు/ప్రభుత్వ బ్యాంకు రుణాలను తీసుకున్న రైతులు సాగు చేసిన పంట దెబ్బతింటే, నష్టం అంచనాకు కేరళలో పనిచేస్తున్న కమిషన్ తరహాలో రాష్ట్రంలోనూ ఏర్పాటుచేయడం అవసరం. – వై.రాధాకృష్ణ, ఏపీ రైతు సంఘం, జిల్లా కార్యదర్శి -
ఉల్లి సేకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.9.16 కోట్లు విడుదల
హైదరాబాద్ : సబ్సిడీ ధరలపై ఉల్లిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.9.16 కోట్లు విడుదల చేసింది. ఉల్లి ధరలు స్థిరీకరించేందుకు రూ.18.31 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ విభాగం అంచనా వేసింది. అయితే వాటిలో కనీసం 50 శాతం నిధులు రూ.9.16 కోట్లు విడుదల చేయాల్సిందిగా మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు ఈ నెల మూడో తేదీన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉల్లి సేకరణకు అవసరమయ్యే మిగతా సగం రూ.9.16 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా వుందని లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.500ల కోట్లు ప్రత్యేకంగా కేటాయించింది. ఆ మొత్తం నుంచి నిధులు కేటాయించాల్సిందిగా మంత్రి హరీష్‌రావు రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ గురువారం నిధులు విడుదల చేసింది. కాగా ఉల్లి ధరలను స్థిరీకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 88 సబ్సిడీ ఉల్లి విక్రయ కేంద్రాలను మార్కెటింగ్ విభాగం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు రూ.8.07 కోట్లు వెచ్చించి 1934.13 టన్నుల ఉల్లిని సేకరించి సబ్సిడీ ధరలపై సరఫరా చేస్తోంది. -
ధరల స్థిరీకరణ నిధి ఏదీ?
ఏ ప్రత్యేకతా లేని ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ రైతులకు దక్కని సాయం.. రుణమాఫీకి రూ.5వేల కోట్లే కౌలు రైతులకు గుర్తింపు కార్డుల ప్రస్తావనే లేదు ఉచిత విద్యుత్ చెప్పింది 9 గంటలు, ఇస్తామన్నది 7 గంటలు హైదరాబాద్: పేరులో తప్ప ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ఏ ప్రత్యేకతనూ చాటుకోలేకపోయింది. ఎన్నికల మొదలు నిన్నమొన్నటి వరకు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి ఈ బడ్జెట్లో ఏ ప్రత్యేకతకూ తావివ్వకుండా ఓ మొక్కుబడి తంతుగా ముగించారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలకు ప్రత్యేక బడ్జెట్లో పేర్కొన్న అంశాలకు ఏ మాత్రం పొంతన లేదు. వ్యవసాయ రుణమాఫీ ఎప్పటినుంచి అమలవుతుందో చెప్పలేకపోయారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్న హామీని పట్టించుకోలేదు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా గాల్లో కలిసిపోయింది. సోలార్ విద్యుత్ పరికరాల సబ్సిడీ కాగితాలకే పరిమితమైంది. రూ.1,11,000 కోట్ల బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.13,109 కోట్లు కేటాయించినట్టు చెబుతున్నప్పటికీ దాని వెనుక జిమ్మిక్కులు స్పష్టంగానే కనిపించాయి. ఈ నిధుల్లో రూ.5 వేల కోట్లు రుణమాఫీ ఖాతాకు వెళితే మిగిలేది కేవలం రూ.8 వేల కోట్ల పైచిలుకు మాత్రమే. ఇందులో రూ.3,188 కోట్లు విద్యుత్ సబ్సిడీకి చూపించగా, ఏడాదిలో వంద రోజుల పని కల్పించేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేస్తున్నట్టు మంత్రి గొప్పగా చెప్పినా వాస్తవానికి ఆ నిధులు కేంద్రం నుంచి వచ్చేవే. ఈ పథకం కింద రూ.1,386.30 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి తన ఉపన్యాసంలో పేర్కొన్నారు. రుణమాఫీకి కేటాయించిన మొత్తం, విద్యుత్ సబ్సిడీ, ఎన్ఆర్ఈజీఎస్ కింద కేంద్రం నుంచి వచ్చే నిధులన్నింటినీ తీసివేస్తే ఇక వ్యవసాయానికి మిగిలేది రూ.3,535 కోట్లు మాత్రమే. అందులోనూ వంద కోట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేంద్రం ఇస్తానన్నవే కావడం గమనార్హం. ఉచిత విద్యుత్ 7 గంటలేనట: ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా స్థానంలో 7 గంటల హామీ మాత్రమే లభించింది. రాష్ట్రంలో విద్యుత్‌ను వినియోగించే 14.54 లక్షల మంది రైతులు ప్రస్తుతానికి ఈ ఏడు గంటలతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. 9 గంటల కరెంటు ఇస్తామన్నారే తప్ప నిర్దిష్ట గడువేదీ ప్రకటించలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామనే ఒకే ఒక్క మాటతో మంత్రి ఆ రంగాన్ని ఆధునికం చేశారు. కొత్త రుణాలు ఎప్పుడు: ఈ ఏడాది కొత్తగా రూ.56, 019.16 కోట్ల రుణాలిచ్చేందుకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అంగీకరించిందని మంత్రి పేర్కొన్నారు. పాత అప్పులు కడితేనే కొత్తవి ఇస్తామని బ్యాంకులు మొండికేస్తున్న సమయంలో కొత్త రుణాలు ఎప్పుడిస్తారో, ఎవరికిస్తారో మంత్రికే తెలియూలి. రుణమాఫీ అవుతుందేమోనని ఎదురుచూస్తున్న రైతులు పాత రుణాలు చెల్లించకుండా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నా మంత్రి మాత్రం దీనిపై నిర్దిష్ట ప్రకటన ఏదీ చేయలేదు. ఇక రాష్ట్రంలోని చిన్న కమతాలను వాస్తవంగా సాగుచేస్తున్న వారిలో మూడొంతుల మంది కౌలు రైతులు. వారి ప్రస్తావనే ఈ బడ్జెట్లో కనిపించలేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులందించి వారికి కూడా రుణ సౌకర్యం కల్పిస్తామని టీడీపీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినా మంత్రి తన ప్రసంగంలో ఈ ఊసే ఎత్తలేదు.