ఉల్లి సేకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.9.16 కోట్లు విడుదల
హైదరాబాద్ : సబ్సిడీ ధరలపై ఉల్లిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.9.16 కోట్లు విడుదల చేసింది. ఉల్లి ధరలు స్థిరీకరించేందుకు రూ.18.31 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ విభాగం అంచనా వేసింది. అయితే వాటిలో కనీసం 50 శాతం నిధులు రూ.9.16 కోట్లు విడుదల చేయాల్సిందిగా మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు ఈ నెల మూడో తేదీన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉల్లి సేకరణకు అవసరమయ్యే మిగతా సగం రూ.9.16 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా వుందని లేఖలో పేర్కొన్నారు.
వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.500ల కోట్లు ప్రత్యేకంగా కేటాయించింది. ఆ మొత్తం నుంచి నిధులు కేటాయించాల్సిందిగా మంత్రి హరీష్‌రావు రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ గురువారం నిధులు విడుదల చేసింది. కాగా ఉల్లి ధరలను స్థిరీకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 88 సబ్సిడీ ఉల్లి విక్రయ కేంద్రాలను మార్కెటింగ్ విభాగం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు రూ.8.07 కోట్లు వెచ్చించి 1934.13 టన్నుల ఉల్లిని సేకరించి సబ్సిడీ ధరలపై సరఫరా చేస్తోంది.