ధరల స్థిరీకరణ నిధి ఏదీ?
ఏ ప్రత్యేకతా లేని ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్
రైతులకు దక్కని సాయం.. రుణమాఫీకి రూ.5వేల కోట్లే
కౌలు రైతులకు గుర్తింపు కార్డుల ప్రస్తావనే లేదు
ఉచిత విద్యుత్ చెప్పింది 9 గంటలు, ఇస్తామన్నది 7 గంటలు
హైదరాబాద్: పేరులో తప్ప ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ఏ ప్రత్యేకతనూ చాటుకోలేకపోయింది. ఎన్నికల మొదలు నిన్నమొన్నటి వరకు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి ఈ బడ్జెట్‌లో ఏ ప్రత్యేకతకూ తావివ్వకుండా ఓ మొక్కుబడి తంతుగా ముగించారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలకు ప్రత్యేక బడ్జెట్‌లో పేర్కొన్న అంశాలకు ఏ మాత్రం పొంతన లేదు. వ్యవసాయ రుణమాఫీ ఎప్పటినుంచి అమలవుతుందో చెప్పలేకపోయారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్న హామీని పట్టించుకోలేదు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా గాల్లో కలిసిపోయింది. సోలార్ విద్యుత్ పరికరాల సబ్సిడీ కాగితాలకే పరిమితమైంది. రూ.1,11,000 కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.13,109 కోట్లు కేటాయించినట్టు చెబుతున్నప్పటికీ దాని వెనుక జిమ్మిక్కులు స్పష్టంగానే కనిపించాయి. ఈ నిధుల్లో రూ.5 వేల కోట్లు రుణమాఫీ ఖాతాకు వెళితే మిగిలేది కేవలం రూ.8 వేల కోట్ల పైచిలుకు మాత్రమే. ఇందులో రూ.3,188 కోట్లు విద్యుత్ సబ్సిడీకి చూపించగా, ఏడాదిలో వంద రోజుల పని కల్పించేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేస్తున్నట్టు మంత్రి గొప్పగా చెప్పినా వాస్తవానికి ఆ నిధులు కేంద్రం నుంచి వచ్చేవే. ఈ పథకం కింద రూ.1,386.30 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రి తన ఉపన్యాసంలో పేర్కొన్నారు. రుణమాఫీకి కేటాయించిన మొత్తం, విద్యుత్ సబ్సిడీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద కేంద్రం నుంచి వచ్చే నిధులన్నింటినీ తీసివేస్తే ఇక వ్యవసాయానికి మిగిలేది రూ.3,535 కోట్లు మాత్రమే. అందులోనూ వంద కోట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కేంద్రం ఇస్తానన్నవే కావడం గమనార్హం.
ఉచిత విద్యుత్ 7 గంటలేనట: ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా స్థానంలో 7 గంటల హామీ మాత్రమే లభించింది. రాష్ట్రంలో విద్యుత్‌ను వినియోగించే 14.54 లక్షల మంది రైతులు ప్రస్తుతానికి ఈ ఏడు గంటలతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. 9 గంటల కరెంటు ఇస్తామన్నారే తప్ప నిర్దిష్ట గడువేదీ ప్రకటించలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామనే ఒకే ఒక్క మాటతో మంత్రి ఆ రంగాన్ని ఆధునికం చేశారు.
కొత్త రుణాలు ఎప్పుడు: ఈ ఏడాది కొత్తగా రూ.56, 019.16 కోట్ల రుణాలిచ్చేందుకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అంగీకరించిందని మంత్రి పేర్కొన్నారు. పాత అప్పులు కడితేనే కొత్తవి ఇస్తామని బ్యాంకులు మొండికేస్తున్న సమయంలో కొత్త రుణాలు ఎప్పుడిస్తారో, ఎవరికిస్తారో మంత్రికే తెలియూలి. రుణమాఫీ అవుతుందేమోనని ఎదురుచూస్తున్న రైతులు పాత రుణాలు చెల్లించకుండా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నా మంత్రి మాత్రం దీనిపై నిర్దిష్ట ప్రకటన ఏదీ చేయలేదు. ఇక రాష్ట్రంలోని చిన్న కమతాలను వాస్తవంగా సాగుచేస్తున్న వారిలో మూడొంతుల మంది కౌలు రైతులు. వారి ప్రస్తావనే ఈ బడ్జెట్‌లో కనిపించలేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులందించి వారికి కూడా రుణ సౌకర్యం కల్పిస్తామని టీడీపీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినా మంత్రి తన ప్రసంగంలో ఈ ఊసే ఎత్తలేదు.