చీరాల : ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడుతున్న చేనేతలను కొత్తగా కొలువుదీరిన టీడీపీ ప్రభుత్వమైనా ఆదుకుంటుందన్న ఆశలు అడియాశలయ్యాయి. అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వారి అభ్యన్నతి కోసం నాలుగు మెతుకులు విదిల్చేందుకే ప్రభుత్వం పరిమితమైంది. జిల్లాలో కునికిపాట్లు పడుతున్న చేనేత రంగం ఈ చర్యతో మూగబోయింనట్లయింది.
అధికారంలోకి రాకముందు కోతలు కోసిన టీడీపీ అధికారం హస్తగతం చేసుకున్నాక సవతిప్రేమ చూపించింది. కేవలం రూ. 98.97 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. జిల్లాలో 25వేల వరకు చేనేత కుటుంబాలున్నాయి. 50 వేల మందికి పైగా మగ్గాలపై ఆధారపడి ఉన్నారు. 20వేల మంది సహకార రంగంలో ఉండగా, మిగిలిన వారంతా సహకారేతర రంగంలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 70 చేనేత సహకార సంఘాలున్నాయి. కానీ దశాబ్ద కాలంగా ఈ పరిశ్రమ తిరోగమనంలో ఉంది.
యంత్రాల రాకతో పాటు విదేశీ ఉత్పత్తుల దెబ్బకు కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎంతోమంది ఈ వృత్తిని వదిలి ఆదాయం కోసం ఇతర రంగాలను ఆశ్రయిస్తున్నారు. చాలీచాలని మజూరీ తీసుకోలేక మగ్గం పట్టుకొనేందుకే భయపడుతున్నారు. వందల కుటుంబాలు పొట్ట పట్టుకుని వలసలు వెళ్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ ఉత్పత్తులను అగ్రపథంలో నిలిపి..సంస్కృతికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన ప్రభుత్వం చేనేతలను గాలికివదిలేసినట్లయింది.
చేతి వృత్తులకు చేయూతనిందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బడ్జెట్‌లో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరిశ్రమలకు రూ. 600 కోట్లు కేటాయిం చగా.. అందులోనే చేనేతలకు రూ. 99.87 కోట్లు కేటాయించడంపై చేనేత శ్రామిక సంఘాలు మండిపడుతున్నాయి. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు.
డిమాండ్లు ఇవే..
చేనేతలకు ప్రత్యేక పరపతి సౌకర్యం కల్పించేందుకు పరపతి బ్యాంకు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో చేనేత ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ చేనేత వస్త్రాలను ప్రభుత్వమే నేయించాలి. వాటిని కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేయాలి. దీనివల్ల చేనేతలు మూడు పూట్లా కడుపు నింపుకోగలరు. అంతే కాకుండా 20 శాతం సబ్సిడీపై నూలు అందజేయాలి. కానీ తాజాగా కేటాయించిన బడ్జెట్ చేనేతల రుణ మాఫీకే సరిపోయేలా ఉంది. అలాంటప్పుడు ఇతర సంక్షేమ పథకాలు, చేనేత వర్క్ కం షెడ్డులు, చేనేత గృహాలు, ఐహెచ్‌డీపీ (ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ డెవెలప్‌మెంట్ ప్రోగ్రాం), చేనేత క్రెడిట్ కార్డులకు ప్రత్యేక కేటాయింపులు మాటేమిటని ప్రశ్నిస్తున్నారు.
మారని చేనే‘తల’రాత
Published Thu, Aug 21 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM
Advertisement
Advertisement