వేద పరిమళం | Prime Minister's speech at Live today | Sakshi
Sakshi News home page

వేద పరిమళం

Published Tue, Nov 21 2017 7:49 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Prime Minister's speech at Live today - Sakshi

బాబాను పూజిస్తున్న గవర్నర్‌ నరసింహన్‌

పుట్టపర్తి అర్బన్‌: వేద అధ్యయనంతోనే ధర్మ స్థాపన సాధ్యమని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. మనిషికి యోగా, ప్రాణాయామం ఎంత ముఖ్యమో వేదాలు, వేద పారాయణం అంతేనన్నారు. హింసను వీడితేనే శాంతి నెలకొల్ప వచ్చన్నారు. పుట్టపర్తి సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రశాంతి నిలయంలో తొలి అంతర్జాతీయ వేద సమ్మేళనం సోమవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌కు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ సభ్యులు ఆర్‌జే రత్నాకర్‌రాజు, ప్రసాదరావు, చక్రవర్తి, విజయభాస్కర్, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్‌పాండే తదితరులు ఘన స్వాగతం పలికారు. సాయికుల్వంత్‌ హాలులో నిర్వహిస్తున్న రెండు రోజుల వేద సమ్మేళనాన్ని గవర్నర్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగిస్తూ వేదాలకు పుట్టినిల్లు అయిన భారత దేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న వేద సమ్మేళనంలో తాను పాల్గొనం సంతోషంగా ఉందన్నారు. పుట్టపర్తికి వస్తే ఏదో తెలియని శక్తి వస్తుందన్నారు. వివిధ దేశాల నుంచి విచ్చేసిన మత గురువులు, ప్రచారకర్తలు తమ మతాల సారాంశాన్ని వివరించారు. ముఖ్యంగా హిందూ, ముస్లిం, క్రిస్లియన్, జైన, సిక్కులు, బౌద్ధులు, పార్శులు ఇలా వివిధ దేశాలకు చెందిన 16 మతాల పెద్దలు విచ్చేసి సర్వమత ప్రార్థనలు చేశారు.

ప్రేమతత్వంతో ప్రపపంచాన్ని జయించవచ్చు
ప్రేమతత్వంతో ప్రపంచాన్ని జయించవచ్చని మతపెద్దలు పేర్కొన్నారు. విశ్వశాంతి, సౌభ్రాతృత్వం కాంక్షిస్తూ జరిగిన సర్వమత ప్రార్థనల్లో వారు మాట్లాడుతూ ఏ మతంలోనైనా భగవంతుడు ప్రేమ, సత్యం, ధర్మం, శాంతి వంటి వాటితోనే బోధనలు చేశారని, ఇక్కడా సత్యసాయి బాబా అవే బోధించారన్నారు. ‘అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు’ సూక్తిని అందరూ తప్పక పాటించాలన్నారు. ప్రస్తుత మానవ జాతికి సేవ, ఐక్యత అనేవి అత్యంత ముఖ్యమైన అంశాలన్నారు.

సర్వమత ప్రార్థనల్లో న్యూ ఢిల్లీకి చెందిన రామక్రిష్ణమిషన్‌ సెక్రెటరీ స్వామి శాంతాత్మానంద, హిమాచల్‌ ప్రదేశ్‌ ధర్మశాలకు చెందిన కర్మగేలేయుతుక్, హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రా నుంచి 7వ చాంగగిల్టెన్‌రింపో, బెంగళూరు జోరోస్ట్రెయిన్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రేయర్‌ వకిల్, కోల్‌కతకు చెందిన ఆలిండియా ఇమాం అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మౌలానా షఫిక్‌ ఖాస్మి, అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అలీ మహమ్మద్‌ నఖ్వీ, ఢిల్లీ కమిషన్‌ ఫర్‌ ఇంటర్‌ఫెయిత్‌ కమిషన్‌ సెక్రెటరీ ఫాదర్‌ ఫెలిక్స్‌ జోన్స్, అమృత్‌సర్‌ గోల్డెన్‌ టెంపుల్‌ నుండి గ్లాని గురుబచన్‌సింగ్, న్యూ ఢిల్లీ జ్యోదాహిం హానరర్‌ సెక్రెటరీ రబ్బీ ఇషాక్‌ మాలేకర్, అహింసా విశ్వభారత్‌ ఫౌండర్‌ ఆచార్య లోకేష్‌ముని, అజ్మీర్‌ షరీఫ్‌ చైర్మన్‌ హాజీ సయ్యద్, సల్మాన్, వెస్ట్‌బెంగాల్‌ ఆలిండియా ఇమాం అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ మౌలానా అబ్దుల్‌ రెహ్మన్, కర్ణాటకకు చెందిన స్టేట్‌ బాహా సెక్రెటరీ దినేష్‌రావ్, అక్షరధాంస్వామి నారాయన్‌ ట్రస్టీలు భారత్‌ సి మెహతా, కునాల్‌ భట్, ఢిల్లీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్‌ రాష్ట్ర అధ్యక్షులు జతీందర్‌ చీమా తదితరులు పాల్గొన్నారు.

సమస్యలకు వేదాల్లో పరిష్కారం
 పుట్టపర్తి అర్బన్‌: మానవాళి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ వేదాల్లో పరిష్కారాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో కూలంకశంగా చర్చించారు. న్యూఢిల్లీ యూజీసీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాంగోపాల్, యూఎస్‌ఏ కలరాడో యూనివర్సిటీ ఫ్రొఫెసర్‌ జాన్‌కిన్‌మణి, మలేషియా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్‌ కన్సల్టెంట్‌ జగదీషన్‌ శ్రీవెంకటేశ్వర వేదిక్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్సలర్‌ సన్నిధానం సుదర్శనశర్మ తదితరులు ప్రసంగించారు. నీటి ఎద్దడి నివారణకు వేదాల్లో సూచించిన పరిష్కారాలు, ప్రస్తుత కాలంలో వేదాలకు ఉన్న ప్రాముఖ్యత, వ్యవసాయానికి, వాతావరణానికి వేద శాస్త్ర పరిజ్ఞానం ఏవిధంగా ఉపయోగపడుతుందనే అంశాలపై సూచనలు చేశారు. ఆహార కొరతకు ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయనే అంశాలను చర్చించారు.

నేడు లైవ్‌లో ప్రధాని ప్రసంగం
వేద సమ్మేళనంలో రెండో రోజు మంగళవారం పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖుల  ప్రసంగాలు ఉంటాయి. సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగం లైవ్‌లో వీక్షించవచ్చు. ఢిల్లీ నుంచి ఆయన విశ్వశాంతి, సర్వమత ప్రార్థనలు, వేద సమ్మేళనం తదితర అంశాలపై ప్రసంగించనున్నారని ట్రస్టీ నాగానంద పేర్కొన్నారు. అనంతరం తమిళనాడు భక్తులు నిర్వహించే ‘రుద్రతత్వం–ఏకత్వం’ అనే నాటిక ఉంటుందన్నారు. వేద తత్వాలపై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. దాదాపు 35 భాగాలుగా ఉన్న స్టాల్స్‌ను ప్రారంభిస్తారు.

సాయి మార్గంలో సర్వమత సమ్మేళనం
బుక్కపట్నం: సర్వ మతాల సారాంశం ఒక్కటే నని సత్యసాయిబాబా పలికిన మాటలు సత్యాలని, మత సామరస్యం కోసం ఆయన చూపిన దారి భావి తరాలకు పూల బాట అని పలువురు మత పెద్దలు, గురువులు అభిప్రాయపడ్డారు. పుట్టపర్తిలో సోమవారం జరిగిన వేద సమ్మేళన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పలువురు మత పెద్దలు, గురువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

సేవా కార్యక్రమాలు ఆదర్శం
పుట్టపర్తి అర్బన్‌: సత్యసాయి భక్తులు సేవా కార్యక్రమాల్లో తరిస్తున్నారు. బాబా జయంతి వేడుకలకు తరలివస్తున్న అశేష భక్తులకు అవసరమైన సేవలందించటానికి వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ముందుకొచ్చారు. బాబా జీవించి ఉన్నప్పటి నుంచే ఈ కార్యక్రమాలు జరిగేవి. అన్నప్రసాదాల పంపిణీ, వైద్యసేవలు, తాగునీటి సరఫరా, విస్తర్లు తీసేసి, గ్లాసులు శుభ్రపరిచి, చెత్తాచెదారం తొలగించి, మొక్కల సంరక్షణ, నడవలేని వారిని దగ్గరుండి తీసుకెళ్లేటటువంటి పనులు చేస్తున్నారు. సత్యసాయి సంస్థల్లో వేలాది మంది సేవాదల్‌ సిబ్బంది పని చేస్తున్నారు. పుట్టపర్తికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలూ అందిస్తూ సేవ చేస్తున్నారు. స్త్రీ, పురుష భేదం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల వారూ ఇక్కడ సామాన్య భక్తుని వలె సేవ చేయడం బహుశా దేశంలోనే ఎక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. 

ఉపరాష్ట్రపతి రాకకు సర్వం సిద్ధం
పుట్టపర్తి అర్బన్‌: సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ నెల 22న వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశారు. బుధవారం మధ్యాహ్నం సత్యసాయి విమానాశ్రయంలో వెంగళమ్మచెరువు గ్రామానికి సంబంధించి అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు. 2016 మేలో ఆయన వెంగళమ్మచెరువు గ్రామానికి అభివృద్ధి పనుల కోసం రూ.80 లక్షలు మంజూరు చేశారు. దీంతో ఆ గ్రామంలో సిమెంటు రోడ్లు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ సుబహాన్‌ చెప్పారు. దీంతో అక్కడి అభివృధ్ది పనులను ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అక్కడి నుండి విడిది చేయడానికి శ్రీనివాస గెస్ట్‌ హౌస్‌కు చేరుకుంటారు. ఇందు కోసం ప్రత్యేకంగా తారు రోడ్డు లేయర్‌ వేసే పనులు పూర్తయ్యాయి. విమానాశ్రయం నుంచి రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన సత్యసాయి ఆర్చీవ్స్‌ ఆర్కియాలజీ మ్యూజియంను కూడా సిద్ధం చేశారు. అక్కడకు వెళ్లడానికి తారురోడ్డు లేయర్‌ వేసే పనులు పూర్తి చేశారు. అక్కడి నుంచి సాయికుల్వంత్‌ హాల్లో సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్లనున్నారు.

భక్త జనసంద్రం
పుట్టపర్తి అర్బన్‌: ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి భక్తజనసంద్రంతో నిండిపోతోంది. సత్యసాయి జయంతి వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. బాబా శివైక్యం పొందిన తర్వాత ఎన్నడూ లేనంతగా ఈసారి భక్తులు పుట్టపర్తి చేరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక రైళ్లు, బస్సుల సంఖ్య పెంచింది. ఇప్పటికే మహిళా దినోత్సవం రోజున పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. రెండు రోజుల అంతర్జాతీయ వేద సమ్మేళనానికి వేదపండితులే సుమారు 15 వేల మంది విచ్చేశారు. దీంతో పట్ణణంతో పాటు ప్రశాంతి గ్రామంలో సైతం లాడ్జీలు నిండిపోయాయి. ప్రశాంతి నిలయంలో అందిస్తున్న అన్నప్రసాదాలతో జనం అంతా ప్రశాంతి నిలయానికే పరిమితమయ్యారు.

భద్రత కట్టుదిట్టం
పుట్టపర్తి అర్బన్‌: బాబా జయంతి వేడుకలకు విచ్చేస్తున్న వీఐపీల భద్రతా ఏర్పాట్లను పరిశీలించడానికి ఎస్పీ అశోక్‌కుమార్‌ పుట్టపర్తికి విచ్చేశారు. సోమవారం ఉదయం తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ రాక సందర్భంగా ముందస్తుగా భద్రతను పెంచారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ వీఐపీలతో పాటు రాష్ట్ర గవర్నర్, ఉప రాష్ట్రపతి ఈ నెల 22న విచ్చేస్తున్న దృష్ట్యా సుమారు 500 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందితో పుట్టపర్తిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్పీ వెంట అడిషనల్‌ ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీలు రామవర్మ, శ్రీలక్ష్మి, నాగసుబ్బన్న, సీఐలు ఆంజనేయులు, రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement