కాలగర్భంలో తొలి దేవదాయ శాఖ కళాశాల! | Principals And Officers Neglects SKIT College | Sakshi
Sakshi News home page

కాలగర్భంలో స్కిట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల

Published Fri, Jan 17 2020 8:46 AM | Last Updated on Fri, Jan 17 2020 8:46 AM

Principals And Officers Neglects SKIT College  - Sakshi

సాక్షి, జేఎన్‌టీయూ(అనంతపురం): నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే ప్రధాన ఆశయంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో నెలకొల్పిన శ్రీకాళహస్తీశ్వర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (స్కిట్‌) ఇంజినీరింగ్‌ కళాశాల కాలగర్భంలో కలిసిపోనుంది. కళాశాలను బాగు చేయాల్సిన దేవదాయ శాఖ అధికారులు ఏ కారణంగానో నిద్రావస్థలో ఉన్నారు. ఫలితంగా కళాశాల భవిత ప్రశ్నార్థకంగా మారింది. స్కిట్‌ కళాశాలకు ఈ విద్యాసంవత్సరంలో ఏఐసీటీఈ అనుమతి కూడా రాలేదు. ప్రభుత్వ పెద్దలు స్పందిస్తేగానీ కళాశాలకు పూర్వవైభవం రాదు.  

2014 తర్వాతనే పతనం 
ఒకనాడు ఎంతో కీర్తిని ఆర్జించిన స్కిట్‌కు 2014 తర్వాత పతనం మొదలయింది. ప్రిన్సిపాళ్లను తరచూ మార్చడం, ఆలయ ఈవోలు పట్టించుకోకపోవడం, అధ్యాపకులు గ్రూపులుగా విడిపోవడం, బోధన పట్టించుకోకపోవడంం తదితర కారణాలతో స్కిట్‌ నిర్వహణ అస్థవ్యస్థంగా మారింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చదువులు పూర్తిగా కుంటుపడ్డాయి. ఉత్తీర్ణత తగ్గిపోయింది. దీంతో ఈ కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గుతూ వచ్చింది. రెండేళ్లుగా ఒకరు కూడా చేరలేదు. ఇక్కడ నిర్వహిస్తున్న డిప్లొమా కోర్సుల్లో మాత్రమే విద్యార్థులు చేరుతున్నారు. గతంలో పని చేసిన ఓ ప్రిన్సిపల్‌ సకాలంలో నివేదికలు సమర్పించకపోవడంతో 2019–2020 విద్యా సంసవత్సరానికి ఏఐసీటీఈ నుంచి అనుమతులు కూడా మంజూరు కాలేదు. ఫలితంగా ఈ ఏడాది ప్రవేశాలు నిలిచిపోయాయి.  కాగా, స్కిట్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తే.. ఈ కళాశాలలో విద్యార్థులకు నిర్ధేశించిన ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ భారం తగ్గుతుంది. కేవలం బోధన, బోధనేతర సిబ్బందిని నియామకం చేసుకుని బ్లాక్‌గ్రాంట్‌ నుంచి జీతాలు చెల్లిస్తారు.   

మేము అసమర్థులం! 
మరో కొత్త ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు తగ్గ శక్తిసామర్థ్యాలు,  ప్రతిభాపాటవాలు, సమర్థత తమకు లేదని పరోక్షంగా జేఎన్‌టీయూ(ఏ) డెరెక్టర్లు అంగీకరిస్తున్నట్లుగా ఉంది. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న స్కిట్‌ను ప్రభుత్వ కళాశాలగా ఏర్పాటు చేసేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేసింది. జేఎన్‌టీయూ(ఏ) పరిధిలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటును ఆమోదిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత రూ. 10 కోట్లు నిధులు మంజూరుకు ఉన్నత విద్యాశాఖ అంగీకారం తెలిపింది. అయితే తమ పరిధిలో అవసరం లేదని, స్కిట్‌ను కానిస్టిట్యూట్‌ కళాశాలగా మార్పు చేయలేమంటూ జేఎన్‌టీయూ(ఏ) డైరెక్టర్లు ఇటీవల సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానం చేశారు. తమకు తామే సుప్రీంగా తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.    

ఉచిత సాంకేతిక విద్యకు విఘాతం 
స్కిట్‌ను ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తే రాయలసీమలో నాలుగో కళాశాలగా గుర్తింపు దక్కుతుంది. అంతేకాక విద్యార్థులకు ఉచిత సాంకేతిక విద్యను ఉన్నత ప్రమాణాలతో అందించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యను అభ్యసిస్తే ఉద్యోగాల కల్పనకు బహుళజాతి కంపెనీలు సైతం ఆసక్తి చూపుతాయి. జేఎన్‌టీయూ(ఏ), దీని అనుబంధ కలికిరి, పులివెందుల ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు ఇటీవల అత్యున్నత బహుళజాతి సంస్థల్లో గణనీయంగా కొలువులు సాధించడమే ఇందుకు నిదర్శనం. మరో వైపు ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను శాశ్వత ప్రాతిపదికన నూతనంగా నియమించుకునే అవకాశం ఉంటుంది. నూతన పరిశోధనలకు ఆస్కారం కలుగుతుంది. నాణ్యమైన బోధన, పరిశోధనలు ఏకకాలంలో వృద్ధి చెందుతాయి. అయితే వీటన్నింటినీ కాదంటూ జేఎన్‌టీయూ (ఏ) యాజమాన్యం, డైరెక్టర్ల వ్యవహరిస్తున్న తీరు వల్ల స్కిట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఉచిత ఉన్నత సాంకేతిక విద్యకు విఘాతం కలుగుతోంది.   

తొలి దేవదాయ శాఖ కళాశాల 
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా పట్టణంలో 1997లో స్కిట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దేవదాయ శాఖ తరపున ఏర్పాటు చేసిన ఏకైక ఇంజినీరింగ్‌ కాలేజీ ఇదే కావడం విశేషం. అప్పటి రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చొరవతో మొదట కాసాగార్డెన్‌లోని భవనాల్లో కళాశాలను నిర్వహించారు. తర్వాత శ్రీకాళహస్తి పట్టణ శివారులో జాతీయ రహదారి పక్కనే సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో భవనాలు నిర్మించారు. మొదట్లో బీటెక్‌ కోర్సులకే అనుమతి ఉండేది. ఆ తరువాత ఎంటెక్‌ కోర్సులకూ అనుమతి లభించింది.

డైరెక్టర్లను ఒప్పించే ప్రయత్నం చేస్తాం
ప్రస్తుతం ఉన్న కానిస్టిట్యూట్‌ కళాశాలల్లో అపరిష్కృత సమస్యలు చాలా ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలను మరో కానిస్టిట్యూట్‌ కళాశాలగా మార్చేందుకు మాకూ ఆసక్తి ఉంది. అయితే డైరెక్టర్లు ఇందుకు సమ్మతించడం లేదు. శాశ్వత ప్రాతిపదికన బోధన సిబ్బందిని నియామకం చేయాలి. అప్పుడే ఉన్నతవిద్యలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపడుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా శ్రీకాళహస్తీశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలను కానిస్టిట్యూట్‌ కళాశాలగా తీసుకోవాలని ఆదేశిస్తే తప్పదు. డైరెక్టర్లతో మరో దఫా సమావేశం నిర్వహించి ఒప్పించేందుకు ప్రయత్నిస్తాం. – ప్రొఫెసర్‌ ఎస్‌ .శ్రీనివాసకుమార్, వీసీ, జేఎన్‌టీయూ(ఏ)   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement