ప్రైవేట్‌ సాగు | Private cultivation | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ సాగు

Published Thu, Apr 27 2017 1:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

ప్రైవేట్‌ సాగు - Sakshi

ప్రైవేట్‌ సాగు

చిన్న, సన్నకారు రైతుల భూములు కార్పొరేట్‌ కంపెనీలకు లీజుకు
- భూమి లీజు చట్టం తెచ్చేందుకు రాష్ట్రం కసరత్తు
- కార్పొరేట్‌ కంపెనీ దయాదాక్షిణ్యాలపై అన్నదాత జీవితం?


సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయం ఇక ప్రైవేట్‌ పరం కానుంది. సన్న, చిన్నకారు రైతుల భూములను కార్పొరేట్‌ కంపెనీలకు లీజుకు ఇచ్చేందుకు వీలుగా భూమి లీజు చట్టాన్ని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. చిన్న, సన్నకారు రైతుల భూములను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు రాష్ట్రంలో అనేక చర్యలు చేపట్టామని నీతి ఆయోగ్‌కు ఇప్పటికే నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో ఇప్పటికే కాంట్రాక్టు వ్యవసాయం తరహాలో ఉండే ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అంటే ఒక గ్రామంలో గల చిన్న, సన్నకారు వ్యవసాయదారుల భూమి అంతటినీ కార్పొరేట్‌ కంపెనీకి లీజుకు ఇస్తారు. ఆ కంపెనీ ఆ మొత్తం భూమిలో ఆధునిక పరిజ్ఞానంతో, మెలకువలతో వ్యవసాయం చేస్తుంది.

తద్వారా వచ్చే ఆదాయంలో సాగుకయ్యే వ్యయాన్ని మినహాయించుకుని మార్కెట్‌ ధరలకు అనుగుణంగా లేదా తొలుత ఆయా రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు రైతులకు డబ్బులను చెల్లిస్తుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదిక సారాంశాన్ని నీతి ఆయోగ్‌ ఇటీవల జరిగిన గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ఏపీని ఆదర్శంగా తీసుకుని అన్ని రాష్ట్రాలూ వ్యవసాయం ప్రైవేటీకరణకు చర్యలు చేపట్టాలని సూచించింది. అయితే ఇందుకు మెజారిటీ రాష్ట్రాలు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రైతులను వ్యవlసాయానికి దూరం చేస్తారా?

దేశంలో అత్యధిక శాతం చిన్న కమతాల రైతులు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని నీతి ఆయోగ్‌ పేర్కొంది. అలాంటి సన్నకారు రైతుల భూములను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగిస్తే, వ్యవసాయంలో యంత్రీకరణ పెరుగుతుం దని, రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కార్పొరేట్‌ కంపెనీలకు లాభాపేక్ష తప్ప రైతుల జీవనోపాధి మెరుగుపరచడానికి ఎందుకు చర్యలు తీసుకుంటాయని రైతు ఉద్యమ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బలవంతపు భూసేకరణ పేరుతో కార్పొరేట్‌ కంపెనీలకు వేలాది ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ధారాదత్తం చేసింది. రాజధాని నిర్మాణం పేరుతో మూడు పంటలు పండే భూములను ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

అయితే 2013 భూసేకరణచట్టం నిబంధనలను పాటించకుండా, సామాజిక ప్రభావ అంచనా లేకుండా రైతులనుంచి బలవంతంగా సేకరించడాన్ని సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు ఆక్షేపించింది. మరోవైపు తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్‌పార్కు, భోగాపురం ఎయిర్‌పోర్టు, బందరు పోర్టు పేరుతో వేలాది ఎకరాల పంట భూములను బలవంతంగా సేకరిస్తూ... కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడానికి ప్రతిజిల్లాలోనూ లక్ష ఎకరాల ల్యాండ్‌ బ్యాంకు పేరుతో భూసేకరణ జరుపుతున్న ప్రభుత్వం ఇప్పుడు చిన్న, సన్నకారు రైతుల భూములపై కన్నేయడం దారుణమని రైతు ఉద్యమ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ప్రజెంటేషన్‌లో ముఖ్యాంశాలు
► ఆంధ్రప్రదేశ్‌లో 12.13 % వ్యవసాయ కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువనున్నాయి.
►2004–05 నుంచి ఇప్పటివరకు దేశంలో 10 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారింది, ఈ నేపథ్యంలో ఉత్పాదకతను పెంచాల్సి ఉంది.
► పంటలను నిల్వ చేసుకోవడం, ధర వచ్చినప్పుడే విక్రయించుకునే వెసులుబాటు లేకపోవడంతో రైతులు 2013–14 ఆర్థిక సంవత్సరంలో రూ.1,07,994 కోట్లు నష్టపోయారు.
► 2004–05 ఆర్థిక సంవత్సరం నుంచి పరిశీలిస్తే దేశవ్యాప్తంగా వ్యవసాయం చేసే రైతులు తగ్గిపోతున్నారు. 2004–05లో 16.61 కోట్ల మంది రైతులు వ్యవసాయం చేస్తుండగా 2011–12 నాటికి 14.62 కోట్లకు,  2015–16 నాటికి  13.60 కోట్లకు తగ్గిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement