3 ప్రముఖ సంస్థలతో ‘స్కిల్స్‌’పై ఒప్పందాలు | AP Skill Development Corporation MOU With three leading companies | Sakshi
Sakshi News home page

3 ప్రముఖ సంస్థలతో ‘స్కిల్స్‌’పై ఒప్పందాలు

Published Thu, Sep 17 2020 4:27 AM | Last Updated on Thu, Sep 17 2020 4:27 AM

AP Skill Development Corporation MOU With three leading companies - Sakshi

సాక్షి, అమరావతి: పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నిపుణులైన మానవ వనరులను సమకూర్చడమే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు పెద్దపీట వేస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో భాగస్వామ్యం కోసం కార్పొరేట్‌ సంస్థలు ముందుకు రావటంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ చల్లా మధుసూదన్‌రెడ్డి సమక్షంలో మూడు ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలు ప్రభుత్వంతో కలసి పనిచేసేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో డాక్టర్‌ అర్జా శ్రీకాంత్, టెక్‌ మహీంద్ర ఫౌండేషన్‌ సీఈవో రాకేష్‌ సోని, బయోకాన్‌ అకాడమీ ప్రోగ్రామ్‌ డీన్‌ బిందు అజిత్, స్నైడర్‌ ఎలక్ట్రిక్‌ ఎడ్యుకేషన్‌ హెడ్‌ సాయికృష్ణరావు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. 

నైపుణ్యాల పెంపుపై సీఎం ప్రత్యేక దృష్టి
– ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు సైతం సరైన ఉపాధి అవకాశాలు పొందలేకపోవటాన్ని గుర్తించి నైపుణ్యాలను పెంపొందించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారని మంత్రి మేకపాటి తెలిపారు.
– యువతకు స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం తెచ్చిన ముఖ్యమంత్రి లక్ష్య సాధనలో టెక్‌ మహీంద్ర ఫౌండేషన్, బయోకాన్‌ అకాడమీ,  స్నైడర్‌ ఎలక్ట్రిక్‌ సంస్థలు పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది.
– ఇటీవల ‘ఇకిగయ్‌’ అనే ఓ పుస్తకం చదివా. ప్రతి పుట్టుకకు ఓ కారణం ఉంటుందనేది అందులోని అంతరార్థం. సీఎం జగన్‌ నిర్దేశించిన 30 స్కిల్‌ కాలేజీల ఏర్పాటు కూడా అలాంటిదే.

ఇవీ ఒప్పందాలు...
– తాజా ఒప్పందాల ప్రకారం టెక్‌ మహీంద్రా ఫౌండేషన్‌ విశాఖలో లాజిస్టిక్స్‌ సెక్టార్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పనుంది. పరిశ్రమల్లో పనిచేసేందుకు అనువైన కోర్సులు, సిలబస్, ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్స్, స్కిల్‌ కాలేజీల్లో డిజిటల్‌ టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ విభాగాల్లో సర్టిఫికేషన్‌ కోర్సులను అందించనుంది.
– ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్‌కు చెందిన బయోకాన్‌ అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్కిల్‌ కాలేజీల్లో లైఫ్‌ సైన్సెస్‌ విభాగంలో నాలెడ్జ్‌ పార్టనర్‌గా వ్యవహరించేలా ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమలకు అవసరమైన కోర్సుల్లో శిక్షణ, పాఠ్యాంశాలను రూపొందించడంలో బయోకాన్‌ భాగస్వామ్యం కానుంది.
 – బహుళజాతి సంస్థ స్నైడర్‌ ఎలక్ట్రిక్, ఎనర్జీ, ఆటోమేషన్, డిజిటల్‌ సొల్యూషన్స్‌ విభాగాల్లో కలసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ నెల్లూరు స్కిల్‌ కాలేజీలో ఎలక్ట్రికల్‌ విభాగంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇతర జిల్లాల్లోని 12 స్కిల్‌ సెంటర్లలోనూ ఆటోమేషన్, ఎనర్జీ, మేనేజ్‌మెంట్‌ రంగాల్లో భాగస్వామి కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement